జనసేన కు ఛాన్స్ ఇచ్చిన టీడీపీ…. అందుకే ఆ రిజల్ట్

ఎన్నికల్లో సామ, దాన, దండోపాయాలు సహజమే. ఇప్పటి ట్రెండ్ ప్రకారం అసహజ పొత్తులు ఏర్పడినా షాక్ అవ్వలిసిన పని లేదు. ఎన్ని ఎలా చేసినా గెలుపు గుర్రం [more]

Update: 2021-03-01 09:30 GMT

ఎన్నికల్లో సామ, దాన, దండోపాయాలు సహజమే. ఇప్పటి ట్రెండ్ ప్రకారం అసహజ పొత్తులు ఏర్పడినా షాక్ అవ్వలిసిన పని లేదు. ఎన్ని ఎలా చేసినా గెలుపు గుర్రం ఎక్కడమే లక్ష్యం గా పాలిటిక్స్ సాగిపోతున్నాయి. తాజాగా జరిగిన, జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలకు చోటు దక్కించుకున్న ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా కూడా నిలుస్తుంది. ఇక్కడ చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను బరిలోకి దింపకుండా జనసేన కు దారి వదిలేయడం చర్చనీయంగా మారింది. క్యాడర్ బేస్ పార్టీ గా చెప్పుకునే టిడిపి అభ్యర్థినే నిలబెట్టకుండా ప్రత్యర్థులతో పొత్తు పెట్టుకోవడం భవిష్యత్తు రాజకీయ ఎత్తుగడల్లో భాగమా లేక సామాజిక సమీకరణాలను బట్టి సర్దుకుపోయిందా అన్నది ఇప్పుడే లెక్క తేలేది కాదు.

నలుగురు చేతులు ఎత్తేశారా ?

తెలుగుదేశం పార్టీ లో తూర్పుగోదావరి జిల్లా లో గెలిచిన నలుగురు ఎమ్యెల్యేల్లో ముగ్గురు కాకలు తీరిన యోధులే. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెద్దాపురం నుంచి మాజీ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మండపేట ఎమ్యెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావు జిల్లాలో చక్రం తిప్పగలిగేవారే. అలాంటి వారుండగా వారి నియోజకవర్గంలోనే కొన్ని పంచాయితీల్లో టిడిపికి అభ్యర్థుల ను నిలబెట్టకపోవడం గమనార్హం. అక్కడి సామాజిక సమీకరణాల రీత్యా వారు ఈ పని చేయలేదు అంటున్నారు కొందరు. బలమైన అధికారపార్టీని ఎదుర్కొని ఓడించాలంటే అనైతిక పొత్తులతో అయినా సరే ముందుకు వెళ్లాలనే ఈ రకమైన ఎత్తుగడను వారు అనుసరించినట్లు చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో తలనొప్పులేనా …

పంచాయితీ ఎన్నికలే కదా అని టిడిపి జనసేనకు చోటు ఇవ్వడం ఇప్పటికిప్పుడు బాగానే ఉంది. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – బిజెపి తో టిడిపి కి పొత్తు లేకపోతే క్రింది స్థాయిలో క్యాడర్ లేకుండా రణక్షేత్రం లో సైకిల్ దెబ్బతినే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. జగన్ పార్టీ ఎన్నికల వ్యూహాలను ఛేదించి నెగ్గాలంటే మూడు పార్టీల కలయికతోనే సాధ్యమని టిడిపి అంచనా వేస్తున్నట్లు కూడా తాజా పరిణామాలు చెప్పక చెబుతున్నాయి. ఇక పై జరగనున్న మునిసిపోల్స్ లో టిడిపి సీనియర్లు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళతారో చూడాలి.

Tags:    

Similar News