Janasena : ఇద్దరి బండారం బయటపడే టైం వచ్చేసిందిగా?

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల వాతావరణం అలుముకుంది. మిగిలిపోయిన మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు బరిలోకి దిగుతారా? లేదా? [more]

Update: 2021-11-03 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల వాతావరణం అలుముకుంది. మిగిలిపోయిన మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు బరిలోకి దిగుతారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో కలసి పోటీ చేయలేదు. మద్దతు కూడా పెద్దగా ఒకరికొకరు ఇచ్చుకోలేదు. తిరుపతి ఉప ఎన్నిక వీరిద్దరి బహిరంగ మద్దతు చివరిదిగా చెప్పుకోవచ్చు.

మున్సిపల్ ఎన్నికలలో….

ఇటీవల జరిగిన బద్వేలు ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి జనసేన పూర్తి స్థాయిలో మద్దతిచ్చినట్లు కన్పించలేదు. తాజాగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనైనా ఇద్దరూ పొత్తులతో బరిలోకి దిగుతారా? లేక అవగాహన మేరకు పోటీ చేస్తారా? అన్నది తేలకుండా ఉంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ కూడా క్యాడర్ కు సంకేతాలు ఇచ్చారు.

నెల్లూరులో బలంగా….

నెల్లూరు కార్పొరేషన్ తో పాటు దర్శి, దాచేపల్లి, గురజాల, కుప్పం, కమలాపురం, రాజంపేట, బేతంచెర్ల, బుచ్చిరెడ్డిపాలెం, కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో నెల్లూరు, కావలి తదితర ప్రాంతాల్లో జనసేన బలంగా ఉంది. బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో తన ప్రభావాన్ని చూపనుంది.

ఇద్దరూ కలిసి పోటీ చేస్తేనే?

కానీ ఈ ఎన్నికల్లోనూ రెండు పార్టీలూ కలసి ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపుతాయా? లేక ఎవరికి వారు పోటీ చేసి ఫలితాల తర్వాత అవగాహనకు రావాలనుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇద్దరి మధ్య దూరం బాగానే పెరిగింది. జనసేన తాను సొంతంగా బలోపేతమై వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉన్నా ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని చూస్తుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో వీరి మధ్య ఉన్న పొత్తు అనుబంధం బయటపడే అవకాశముంది.

Tags:    

Similar News