కలిశామంటున్నారు… ఎక్కడ బాబూ?

రెండు పార్టీలు కలిశాయి. తాము పొత్తు కుదుర్చుకున్నామని చెప్పాయి. కలసి పోటీ చేస్తామని ప్రకటించాయి. కానీ ఆరు నెలలుగా రెండు పార్టీలు కలసి ఉద్యమ పంధాన నడిచింది [more]

Update: 2021-01-03 12:30 GMT

రెండు పార్టీలు కలిశాయి. తాము పొత్తు కుదుర్చుకున్నామని చెప్పాయి. కలసి పోటీ చేస్తామని ప్రకటించాయి. కానీ ఆరు నెలలుగా రెండు పార్టీలు కలసి ఉద్యమ పంధాన నడిచింది లేదు. ఇది రెండు పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ లు పొత్తు కుదుర్చుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని చెప్పాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపాయి.

రోడ్డు మీదకు వచ్చింది…..

కానీ ఆరు నెలల నుంచి రెండు పార్టీలు కలసి రోడ్డుమీదకు వచ్చింది అతి తక్కువ. ఏ పార్టీ దారి ఆ పార్టీదే. అమరావతి అంశం తీసుకుంటే రెండు పార్టీల స్టాండ్ ఒక్కటే అయినా వేర్వేరు సమయాల్లోనే రోడ్ల మీదకు వస్తాయి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ తో సంబంధం లేకుండా తన సొంత అజెండాతో ముందుకు వెళుతున్నారు. ఇటీవల రైతు సమస్యలపై ఆయన కృష్ణా జిల్లాలో పర్యటించారు. పవన్ పర్యటనకు బీజేపీ శ్రేణులు దూరంగా ఉన్నాయి.

పవన్ పర్యటనలో…..

నివర్ తుపాను బాధితుల పరామర్శకు పవన్ కల్యాణ్ నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. వీటిలో కూడా ఎక్కడా బీజేపీ జెండా కన్పించలేదు. దీంతో రెండు పార్టీలు అసలు కలసి పనిచేస్తున్నాయా? అన్న సందేహం కలగక మానదు. ఎవరి అజెండాతో వారు ముందుకు వెళుతుండటంతో రెండు పార్టీల క్యాడర్ అయోమయంలో పడుతుంది. ఇప్పట వరకూ పవన్ కల్యాణ్, సోము వీర్రాజులు కలసి కూర్చుని చర్చించుకున్న సందర్భమూ లేదు.

కలసి ఉద్యమం చేసింది…..

మరోవైపు పవన్ కల్యాణ్ పార్టీది విచిత్రమైన పరిస్థితి. ఆయనకు రాష‌్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నప్పటికీ ఆయన బయటకు వస్తేనే వారు రోడ్డు మీదకు వస్తారు. లేదంటే లేదు. జనసేన కోలాహలం మొత్తం పవన్ పర్యటనలోనే ఉంటుంది. బీజేపీ మాత్రం వివిధ అంశాలపై విడివిడిగానే పోరాట బాట పడుతుంది. మొత్తం మీద జనసేన, బీజేపీలు ఏపీలో కలసి ఉన్నాయా? లేదా? అన్నది మాత్రం చూసే వారికి అనుమానం కలగక మానదు. ఇప్పటికైనా రెండు పార్టీలు కలసి పోరాడితేనే క్యాడర్ లో ఉన్న అయోమయాన్ని తొలగించగలుగుతారు.

Tags:    

Similar News