స్టీరింగ్ ఎవరి చేతిలో?

జనసేన జై బీజేపీ అనడంతో ఇప్పుడు ఎవరు రెండు పార్టీలను ముందు ఉండి నడిపిస్తారన్న చర్చ మొదలైంది. ఈనెల 16 న దీనికి సంబంధించి ఇరు పార్టీలు [more]

Update: 2020-01-15 03:30 GMT

జనసేన జై బీజేపీ అనడంతో ఇప్పుడు ఎవరు రెండు పార్టీలను ముందు ఉండి నడిపిస్తారన్న చర్చ మొదలైంది. ఈనెల 16 న దీనికి సంబంధించి ఇరు పార్టీలు ప్రాధమికంగా అవగాహనకు రావడానికి సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ లోనే అన్ని ఖరారు అవుతాయా? లేక ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అటు రాష్ట్ర బిజెపి, ఇటు పవన్ జనసేన నడుచుకుంటాయా అన్నది ఆసక్తి రేపుతోంది. కమలం పార్టీ లో క్రమశిక్షణ కు పెద్ద పీట వేస్తారు. అస్సలు ఏమాత్రం క్రమశిక్షణకు అర్ధం తెలియని జనసైన్యం కి సేనాపతి పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని స్వయంగా పవన్ అనేక సభలు, సమావేశాల్లో కూడా చెప్పినా సైన్యం ఆయన మాటలు పెడచెవిన పెడుతూనే వస్తుంది. సినీ గ్లామర్ కారణంగా ఈలలు, కేకలు, అరుపులతోనే జనసేన సభలు సమావేశాలు అధినేత ఉన్నప్పుడు సాగడం పవన్ కి అనేక సార్లు ఆగ్రహం తెప్పించినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు.

కమలం చెప్పినట్లు నడుచుకోవాలిసిందేనా …?

ప్రస్తుతం కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రధాన విపక్షం కన్నా పవర్ ఫుల్ రోల్ కొనసాగుతూ వస్తుంది. జగన్ పై వున్న కేసులు, విభజనలో నష్టపోయిన ఎపి కేంద్రం చేసే సాయంపై పూర్తిగా ఆధారపడి ఉండటంతో వైసిపి బిజెపి ని గౌరవం ఇవ్వక తప్పని పరిస్థితి. దాంతో బిజెపి అండ దండా ఉంటే వైసిపి ని కంట్రోల్ చేసే రేంజ్ లో వుండొచ్చని, అది సాధ్యం కాకపోయినా బెదిరించే అవకాశం అయినా ఉంటుందన్నది జనసేన అధినేత ఆలోచన అంటున్నారు విశ్లేషకులు. అదీగాక పార్టీ ఆర్థికభారం చాలావరకు తగ్గిపోతుందని అతిధి పాత్రతో ఎపి రాజకీయాల్లో స్టార్ గా సినిమాల్లో తిరిగి రీ ఎంట్రీకి సమయం చిక్కుతుంది అన్నది పీకే ప్లాన్ గా ఉండొచ్చని చర్చ సాగుతుంది.

శ్రేణులు అడ్జస్ట్ అవుతాయా …?

బిజెపి లో ఒక సమస్య ఉంది. కొత్తవారిని అంత తొందరగా వారు అక్కున చేర్చుకోలేరన్న విమర్శలు వున్నాయి. పార్టీలో పాత కొత్తా రెండు గ్రూప్ లు గా రాజకీయాలు నడుస్తాయి. అయితే కీలక సమయాల్లో అందరిదీ ఒకటే మాట గా ఉంటున్నప్పటికీ కాంగ్రెస్ లో ఉన్నంత ప్రజాస్వామ్యం ఆ పార్టీలో కనిపించదు. అయితే ఇటీవల టిడిపి నుంచి కొందరు రాజ్యసభ సభ్యులు వచ్చి చేరాక ఎపి పార్టీలో భిన్నాభిప్రాయాలు అనేక సందర్భాల్లో కనిపిస్తూ వస్తున్నాయి. ఆర్ఎస్ఎష్ భావజాలంతో పార్టీ కోసం నిరంతరం శ్రమించే టీం ఒక పక్క ఆయారాం గయారాం ల టీం మరో పక్క వున్న బిజెపి లో ఇప్పుడు గందరగోళమే కనిపిస్తుంది. ఈ కొత్త పాత సమస్యలు తమకేమి పట్టవని భావిస్తున్న అధిష్టానం వీరి సఖ్యతకు పెద్దగా ప్రయత్నాలు చేసిన సందర్భాలు తక్కువే. ఈ నేపథ్యంలో జనసేన వచ్చి చేరుతుంది.

సైన్యాన్ని అప్పగించేస్తారా …?

ఇక జనసేన సైన్యం సదా బిజెపి ఆదేశాలకు అనుగుణంగా తమ అధినేత వ్యాఖ్యలకు అనుగుణంగా ముందుకు సాగనుంది. పవన్ పార్టీ లో ఆయనే హీరో పేరుకు పార్టీలో కొందరు ముఖ్యల పేర్లు వినిపిస్తున్నా వారంతా నిమిత్త మాత్రులే. పవన్ ఏది అనుకుంటే అదే జరుగుతుంది. టిడిపి లో చంద్రబాబు, వైసిపి లో జగన్ మాటకు ఎలా తిరుగు ఉండదో అదే రీతిలో జనసేన సాగుతుంది. అయితే కీలక అంశాల్లో ఏపీలోని అధికార, విపక్షాల పార్టీల్లో చర్చ సాగుతుంది. పాలిట్ బ్యూరో లో కూడా మంచి చెడ్డా మాట్లాడుకుంటారు. అయితే ఇలాంటివి పవన్ జనసేన పార్టీలో పెద్దగా ఏమి కనపడవు అనడానికి బిజెపి తో కలసి నడవాలన్న ప్రధాన నిర్ణయం పై నేతలు క్యాడర్ అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణలోనికి తీసుకున్నది లేదు.

జనసేనకు మాత్రం…

అలాగే 2014 లో బిజెపి, టిడిపి తో కలిసి నడిచినప్పుడు, ఆ తరువాత ఆ రెండు పార్టీలను ఛీ కొట్టి కామ్రేడ్స్ తో ముందుకు వెళ్ళినప్పుడు కూడా పవన్ సొంత నిర్ణయాలే తప్ప పార్టీ అంతా చర్చించిన సందర్భం లేనేలేదు. ఇప్పుడు కూడా అదే బాటలో పవన్ సాగుతుండటంతో జనసైన్యం ఆయన ఆదేశాలు పాటించేందుకు సిద్ధంగా వుంది తప్ప కీలక రాజకీయ అంశాల్లో తమ అభిప్రాయాలు చెప్పే ఛాన్స్ మాత్రం లేదు. ఈ పరిణామం మాత్రం ఎటు చూసినా బిజెపి కి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు తప్ప జనసేన కు భవిష్యత్తు ఇక ఏమి వుండబోదన్న సంకేతాలు స్పష్టం అని విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News