చాయ్ వాలా.. గాజు గ్లాసు ఒకటేగా

పవన్ కల్యాణ్ మొత్తానికి ఫిక్స్ అయిపోయారు. బలంలేని బీజేపీతో బలం కూడగట్టు కోవాలను కుంటున్న పవన్ కల్యాణ్ పొత్తుకు సిద్ధమయ్యారు. ఈనెల 16వ తేదీన విజయవాడ గేట్ [more]

Update: 2020-01-14 13:30 GMT

పవన్ కల్యాణ్ మొత్తానికి ఫిక్స్ అయిపోయారు. బలంలేని బీజేపీతో బలం కూడగట్టు కోవాలను కుంటున్న పవన్ కల్యాణ్ పొత్తుకు సిద్ధమయ్యారు. ఈనెల 16వ తేదీన విజయవాడ గేట్ వే హోటల్ లో బీజేపీ, జనసేన రాష్ట్ర స్థాయి నేతల సంయుక్త సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన, రాజధాని అమరావతి తరలింపుపై ప్రధానంగా చర్చించనున్నారు.

ఈ నెల 16వ తేదీన…..

అమరావతి తరలింపుపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సయితం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ తర్వాత తాము ప్రత్యక్ష్య కార్యాచరణను ప్రకటిస్తామని బీజేపీ నేతలు చెప్పారు. తాజాగా 16వ తేదీన జరగబోయే బీజేపీ, జనసేన సమావేశంలో ప్రధానంగా రాజధాని అమరావతిపైనే కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనే అవకాశం లేదని, పార్టీ తరుపున నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరు పాల్గొంటారని తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలపైనా….

బీజేపీ కూడా కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు ముఖ్యనేతలు పాల్గొొనే సమావేశంలో రాజధాని అమరావతి అంశమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ చర్చ జరిగే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని ఇప్పటికే జనసేన ఫిక్స్ అయింది. బీజేపీతో కలసి పోటీ చేస్తే అత్యధిక స్థానాలను జనసేన తీసుకునే అవకాశముంది. దీనిపైనా రెండు పార్టీల నేతలు చర్చలు జరుపుతారని తెలుస్తోంది.

ఆటాడుకుందామనేనా?

అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే? ఏపీలో బీజేపీకి నాయకులు తప్ప బలమైన క్యాడర్ లేదు. ఓటు బ్యాంకు లేదు. చరిష్మా కలిగిన నాయకుడు కూడా లేరు. జనసేనది కూడా సేమ్ టు సేమ్. కాకుంటే గ్లామర్ ఉన్న పవన్ కల్యాణ‌్ నాయకుడిగా ఉన్నారు. జనసేన ఇంకా రాష్ట్రంలో బలపడలేదు. స్థానిక సంస్థల ఎన్నికలతో బలపడాలని భావిస్తుంది. అయితే బీజేపీతో పొత్తుకు ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉండటమే. పొత్తు ఉంటే జనసేనకు కొంత మానసికంగా బలం పెరుగుతుంది. వలస నేతలు కూడా జనసేన వైపు చూస్తారు. అంతేకాకుండా అధికార వైసీపీని ఆటాడుకోవచ్చని కూడా జనసేనాని భావనగా కన్పిస్తుంది. మొత్తం మీద బలంలేని బీజేపీ వైపు జనసేన పొత్తుకు మొగ్గు చూపడం జనసేనలోనే చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News