చక్కదిద్దలేమా….?

జమ్మూ కాశ్మీర్.. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రమైన ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది అక్కడి శాంతి భద్రతల పరిస్థితి. దశాబ్దాలుగా ఈ రాష్ట్రం నిత్యం [more]

Update: 2019-02-27 18:29 GMT

జమ్మూ కాశ్మీర్.. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రమైన ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది అక్కడి శాంతి భద్రతల పరిస్థితి. దశాబ్దాలుగా ఈ రాష్ట్రం నిత్యం అగ్నిగుండంగా మారింది. కాల్పులు, ఎదురుకాల్పులతో ప్రతిధ్వనిస్తోంది. ఉగ్రవాదులు, అల్లరి మూకల దాడులతో కాశ్మీర్ సమరాంగణాన్ని తలపిస్తోంది. కాశ్మీర్ తో పోలిస్తే జమ్మూలో పరిస్థితి ఒకింత మెరుగు. కాశ్మీర్ లోయలో ముస్లింలు, జమ్మూలో హిందువులు, లడఖ్ లో బౌద్ధులు అధికం. తాజా ఘటన “పుల్వామా” జమ్ము ప్రాంతంలో చోటు చేసుకోవడం గమనార్హం. అంటే ఉగ్రవాదులు కాశ్మీర్ నుంచి జమ్మూకు విస్తరిస్తున్నట్లు అర్థమవుతోంది.

యువత ఉగ్రవాదం వైపు…..

తాజాగా పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. కానీ ఇటీవల జరిగిన దాడి జాతిని నిశ్చేష్టపరిచింది. పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలన్న వాదన దేశవ్యాప్తంగా వినపడుతోంది. ముష్కరులపై ఉక్కుపాదం మోపాలని, అమాయక ప్రజల రక్షణకు అన్ని విధాలా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనపెడితే…. కాశ్మీర్ రావణ కాష్టంగా మారడానికి భారత ప్రభుత్వం, పాక్, ఉగ్రవాదులు బాధ్యత వహించాలి. ముందుగా కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రయత్నం జరగాలి. కాశ్మీర్ సమస్య కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూడరాదు. దాని మూలాలను లోతుగా విశ్లేషించుకోవాలి. అక్కడి యువత ఎందుకు వక్రమార్గం పడుతుందో ఆలోచించాలి. రాష్ట్రంలోని ముఖ్యంగా కాశ్మీర్ లోయలోని యువత ఉగ్రవాదంవైపు ఆకర్షితమవుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత నిస్పృహలో ఉంది. దీనిని ఉగ్రవాదులు అవకాశంగా మలచుకుంటున్నారు. వారిపై వల విసురుతున్నారు. ఏటా ఉగ్రవాదంవైపు ఆకర్షితమవుతున్న యువత సంఖ్య పెరుగుతోంది. 15 నుంచి 20 సంవత్సరాల లోపు యువకులు ఉగ్రవాద బాట పడుతున్నారు. హిజ్బుల్, అల్ -బచర్, లష్కర్ తోయిబా, ఆల్ ఖైదా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ఇదే పనిలో ఉన్నాయి. భారత ప్రభుత్వం మీ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని, కాశ్మీర్ ను నిర్లక్ష్యం చేస్తోందని, భారత సైన్యంపై దాడులకు తెగబడటం “పవిత్ర యుద్ధం” అని అవి ప్రచారం చేస్తున్నాయి. అదే సమయంలో అమరులైతే స్వర్గం ప్రాప్తిస్తుందని నూరిపోస్తున్నాయి. దానిని తిప్పికొట్టడంలో భారత్ ప్రభుత్వం విఫలమైందని చెప్పకతప్పదు.

ఆర్టికల్ 370ని…..

రాజకీయంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలను తరచూ రద్దు చేయడం, అక్కడి ప్రజలపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటి వరకూ ఎనిమిది ప్రజా ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించారు. పరోక్షంగా ఢిల్లీ తమపై పెత్తనం చేస్తుందన్న భావన ప్రజల్లో కలుగుతుంది. ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితిని చక్కదిద్దవచ్చన్నది జాతీయ వాదుల అభిప్రాయంగా ఉంది. ఈ ఆర్టికల్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తోంది. దీని కారణంగా రాష్ట్రంలో రాష్ట్రేతరులు నివసించరాదు. పర్యాటకులుగా వెళ్లడం తప్ప అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వీలులేదు. ఫలితంగా స్థానికులు ఆడింది …ఆట… పాడింది.. పాటగా మారింది. వారికి ఎదురులేకుండా పోయింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా స్థానికుల ప్రాబల్యాన్ని తగ్గించవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల వారు అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందవచ్చు. తద్వారా ఆ ప్రాంతంలో పట్టు సాధించవచ్చు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ప్రభుత్వాలు ఆర్టికల్ 370ని రద్దు చేస్తే అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని, దేశీయంగా ముస్లింలు దూరమవుతారన్నది భారత ప్రభుత్వ ఆందోళన. కానీ అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలకు వెనకడుగు వేస్తే పరిస్థితి ఎప్పటికీ మారదన్న విషయాన్ని గ్రహించాలి.

ప్రభుత్వాల రద్దుతో…..

కాశ్మీర్ లో ప్రజా ప్రభుత్వాలు పనిచేసేందుకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించాలి. శాంతి భద్రతల పేరుతోనో.. రాజకీయ కారణాలను సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉదాహరణకు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సర్కార్ ను కేవలం రాజకీయ కారణాలతోనే రద్దు చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామి బీజేపీ వైదొలగడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఇతర పార్టీల మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేయడాన్ని జీర్ణించుకోలేని భారతీయ జనతా పార్టీ వెంటనే రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసింది. ఇక్కడ మళ్లీ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ప్రజా ప్రభుత్వాలు ఉంటే శాంతి భద్రతల బాధ్యతను వాటికి వదిలివేయవచ్చు. కేంద్రం చేదోడువాదోడుగా ఉంటే సరిపోతుంది.

కట్టడి చేయలేమా….?

ఇక ఉగ్రవాదానికి ఊత మిస్తున్న పాక్ ను కట్టడి చేయాలి. అంతర్జాతీయంగా దాని పాత్రను ఎండగట్టాలి. దానిని ఒంటరిని చేయాలి. అవసరమైతే దాడికి వెనుకాడరాదు. దౌత్యపరంగా, రక్షణ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవేమీ చేయనంత కాలం ఉగ్రవాదాన్ని అరికట్టలేం. దాడులు కొనసాగుతూనే ఉంటాయి. కేవలం ఖండనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, సైనికులకు సంఘీభావం వంట చర్యలతో కాశ్మీర్ ను చక్కదిద్దుకోలేం. నిర్మాణాత్మకంగా వ్వవహరించాలి. నిర్భయంగా ముందుకు వెళ్లాలి. ఉగ్రవాదుల పట్ల కఠినంగా ఉండాలి. పాక్ కుట్రలను భగ్నం చేయాలి. అప్పుడే కాశ్మీర్ లో శాంతి వికసిస్తుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News