లోయలో అంత తేలికా…?

ఆర్టికల్ 370, 35 ఏ ల రద్దుతో జమ్మూ కాశ్మీర్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకూ ఈ రెండు అధికరణాల కారణంగా రాష్ట్రానికి గల ప్రత్యేక [more]

Update: 2019-08-30 16:30 GMT

ఆర్టికల్ 370, 35 ఏ ల రద్దుతో జమ్మూ కాశ్మీర్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకూ ఈ రెండు అధికరణాల కారణంగా రాష్ట్రానికి గల ప్రత్యేక ప్రతిపత్తి రద్దయింది. రాష్ట్రం రెండు ముక్కలైంది. బౌద్ధులు అధికంగా గల లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతమయింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ గల కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. దీంతో దేశంలో ఇప్పటి వరకూ 29 రాష్ట్రాలు 28కి తగ్గాయి. అదే సమయంలో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు 9కి పెరిగాయి. ఈ మార్పులు ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ నుంచి అమలలోకి రానున్నాయి.

పరిమితులు లేకున్నా…..

లడఖ్ ను కాసేపు పక్కన పెడితే అందరి దృష్టి జమ్మూ కాశ్మీర్ పైనే కేంద్రీకృతమైంది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కారణంగా ఇతర రాష్ట్రాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా నివసించవచ్చు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. స్థలాలు, భూములు, ఇళ్లు తదితర స్థిరాస్థులు కొనుగోలు చేయవచ్చు. కాశ్మీరీ అమ్మాయి, అబ్బాయి ఇతర ప్రాంతాల వారు ఎవరైనా వివాహం చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు, అడ్డంకులు, పరిమితులు ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇకనుంచి జమ్మూకాశ్మీర్, లడఖ్ నీది – నాది – అందరిదీ. కాశ్మీరీలకు ఇక్కడ ఎలాంటి అవకాశాలు, హక్కులు ఉంటాయో ఇతరులకూ అలాంటి హక్కులు, అవకాశాలు ఉంటాయి. ఈ మేరకు భారత రాజ్యాంగం, భారతీయ చట్టాలు అవకాశాలు కల్పిస్తున్నాయి. హామీ ఇస్తున్నాయి.

కాశ్మీర్ లో అసాధ్యమే….

కానీ ఆచరణలో ఇవన్నీ సాధ్యమేనా? ఎలాంటి సమస్య, ఇబ్బందులు ఎదురు కావా? స్థానిక కాశ్మీరీలు సహకరిస్తారా? బయటవారికి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఏ మేరకు సహకరిస్తుంది? మద్దతుగా నిలుస్తుందన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టమే. ఇప్పటికిప్పుడు ఈ మార్పులు చోటు చేసుకోవడం కష్టమేనని, కొంత సమయం పడుతుందని రాజకీయ వర్గాల అంచనా. దీనిని పూర్తిగా తోసిపుచ్చలేం. ఖండించలేం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలానే ఉన్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం. జమ్మూను పక్కన పెడితే కాశ్మీర్ లో ఇప్పటికిప్పుడు అసాధ్యమే. జమ్మూలో హిందువులదే పైచేయి. అయినందున కొంతవరకు సాధ్యమే కానీ శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా లోక్ సభ నియోజకవర్గాల గల కాశ్మీర్ లోయలో అంత తేలిక కాదు. గత మూడు దశాబ్దాలుగా పాతుకుపోయిన వేర్పాటు వాద, ఉగ్రవాద సంస్థల నాయకులు బయటవారిని గట్టిగా ప్రతిఘటించే ప్రమాదం ఉంది. స్థానికులు కూడా ఇలాంటి వైఖరితోనే ఉన్నారు. 1989 నుంచి పాతుకుపోయిన ఉగ్రవాదులకు స్థానిక ప్రజలపై మంచిపట్టుంది. వారి మాట కాదని క్రయ, విక్రయాలు జరిపే సాహసం కూడా వారుచేయరు. వివాహాది కార్యక్రమాలను కూడా మత పెద్దలను కాదని చేసే పరిస్థితి లేదు. సాధారణ ప్రజలను పక్కన పెడితే ముఖ్యంగా యువతను ఒప్పించడం కష్టమే.

వారిమాటే చెల్లుబాటు…..

అభం శుభం తెలియని వారు ప్రభుత్వ అధికారులు కన్నా వేర్పాటు వాద, ఉగ్రవాద సంస్థల నాయకుల మాటకే ప్రాధాన్యత ఇస్తారు. బయటి రాష్ట్రాల ప్రజలు ఇప్పటికిప్పుడు కాశ్మీర్ వెళ్లి స్థిరపడే పరిస్థితి లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రస్తుతానికి అక్కడ లేవు. ఇంకా పరిస్థితులు పూర్తిగా కుదుటపడని ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి అంత త్వరగా ఎవరూ ముందుకు రారు. కాశ్మీర్ లోయ గురించి ఎంతో కొంత అవగాహన గల కాశ్మీరీ పండిట్లు కూడా ఇక్కడికి వచ్చేందుకు సుముఖంగా లేరు. ఎందుకంటే 1989 నాటి ఊచకోత ఘటనలు వారి మది నుంచి తొలగిపోలేదు. ముఖ్యంగా కాశ్మీర్ గురించి ఏమీ తెలియని రెండోతరం పండిట్లు అక్కడికి వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రంగాల్లో స్థిరపడిన వారు మాతృభూమిపై మమకారం ఉన్నప్పటికీ కొత్త తలనొప్పులు తెచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో ఆగ్రహంతో ఉన్న కొంతమంది కాశ్మీరీ యువత ప్రభుత్వ నిర్ణయానికి ఎంతవరకూ మద్దతు ప్రకటిస్తారన్నది ప్రశ్నార్థకమే. ఇక పాక్ నుంచి అక్రమ చొరబాటుదారులు మరింత కఠినంగా ఉండే అవకాశముంది. దాడులకు దిగే ప్రమాదం లేకపోలేదు. ఎంత భద్రత ఉన్నా ఇప్పటికిప్పుడు సరిహద్దుల్లో చొరబాట్లు ఆగి పోయే పరిస్థితి లేదు. ఏదో ఒక మూల నుంచి బలగాల కన్ను గప్పి లోయలోకి చొరబాటుదారులు ప్రవేశించే పరిస్థితిని కొట్టిపారేయలేం. ఈ పరిస్థితులతో ఇప్పటికిప్పుడు బయట రాష్ట్రాల వారు జమ్మూ కాశ్మీర్ లో నివాసానికి తరలి వెళ్లే పరిస్థితి లేదు. భద్రతా బలగాలను ఎంత మొహరించినా కొంతకాలం పాటు ఆగక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News