ఇక్కడా ఎన్నికలు తప్పవా....?

Update: 2018-10-24 18:29 GMT

సున్నితమైన, సరిహద్దు రాష్ట్రమైన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయా? వచ్చే ఏడాది వేసవిలో సార్వత్రిక ఎన్నికలతో పాటు కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారా? కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుందా? రాష్ట్రంలో రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ సూచన మేరకు కేంద్రం పావులు కదుపుతుందా? అన్న ప్రశ్నలకు రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం లభిస్తోంది. కేంద్రం ప్రభుత్వ ప్రతినిధి, రాష్ట్ర గవర్నర్ అయిన సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు చూసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందన్న భావన కలగక మానదు. 87 మంది శాసనస సభ్యులు గల రాష్ట్ర అసెంబ్లీలో పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిపి)కి 28 మంది, బీజేపీకి 25 మంది, నేషనల్ కాన్ఫరెన్స్ కు 15, కాంగ్రెస్ కు 12 మంది శాసనసభ్యులున్నారు. ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటి పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయిద్ ఉన్నంతకాలం సంకీర్ణం సజావుగానే సాగింది. ఆయన మరణానంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆయన కూతురు మెహబూబా ముఫ్తీ హయాంలో సంకీర్ణానికి బీటలు పడ్డాయి. ఈ ఏడాది జూన్ లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో రాష్ట్ర అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారు. అప్పటి నుంచి రాజకీయ జిమ్మిక్కులు చేసి ఏదో ఒకరకంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరోక్షంగా రాజకీయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ప్రయత్నాలు ఫలితమివ్వలేదు. దీంతో అసెంబ్లీని రద్దు చేసి సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్లు చెబుతున్నారు.

అందుకే ఎన్నికలకు వెళ్లాలని......

రాష్ట్ర అసెంబ్లీకి వీలయినంత త్వరగా ఎన్నికలు జరగాలి, ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కన్పించడం లేదు. అని రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ మనోగతాన్ని తెలియజేస్తున్నాయి. వాస్తవానికి 2020 వరకూ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేంద్రం ఈ నిర్ణయానికి రావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఇటీవల పురపాలక సంఘం ఎన్నికల్లో బీజేపీ అగ్రగామిగా నిలిచింది. ఈ ఊపుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళితే రాజకీయంగా "ఉట్టి" కొట్టవచ్చన్నది కమలనాధుల అంచనా. సార్వత్రిక ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం వల్ల బీజేపీకి ఒక లాభం ఉంది. అప్పుడు రాష్ట్ర అంశాలు, సమస్యలు ప్రచారంలో తెరమరుగు అవుతాయి. జాతీయ అంశాలు, మోదీ నాయకత్వ తీరు వంటి అంశాలు తెరపైకి వస్తాయి. కాశ్మీర్ లో కొనసాగుతున్న హింసను సాకుగా చూపి ప్రాంతీయ పార్టీల వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ వాద పార్టీ అయిన బీజేపీ మాత్రమే హింసను సమర్థంగా ఎదుర్కొనగలదన్న భావనను ప్రజల దృష్టికి తీసుకెళ్లవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. పీడీపీ కాదంటే నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమో? లేదా నేషనల్ కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి తెరవెనక చక్రం తిప్పడం ద్వారా రాష్ట్రంపై పట్టు సాధించాలన్నది కమలనాధుల ఆలోచన.

స్థానిక సంస్థల్లో విజయంతో......

ఇక అన్నింటికీ మించి ఇటీవల పురపాలక ఎన్నికలలో అత్యధిక స్థానాలను సాధించడం బీజేపీలో ధీమాను పెంచింది. ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే మంచి అదను అని భవిస్తోంది. 35 ఎ అధికరణం రద్దు చేయాలన్న డిమాండ్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో ప్రధాన ప్రాంతీయ పార్టీలయిన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికలను బహిష్కరించాయి. ఫలితంగా సహజంగానే బీజేపీ, కాంగ్రెస్ ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. హిందువల ఆధిక్యంగల జమ్మూ ప్రాంతంలో బీజేపీదే పై చేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడే పార్టీ ఆధిక్యం సాధించింది. తాజా ఎన్నికల్లో జమ్మూ నగర పాలకసంస్థను కమలం పార్టీ కైవసం చేసుకుంది. కాశ్మీర్ లోయలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. నాలుగు విడతలుగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 12 పురపాలక సంఘాల్లో స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. రాజధాని నగరమైన శ్రీనగర్ నగర పాలకసంస్థను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దక్షిణ కాశ్మీర్ లో తీవ్ర వాద ప్రాబల్యం కల అనంతనాగ్, కుల్గాం, పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో బీజేపీ పాగా వేయడం విశేషం. లడఖ్, కార్గిల్ ప్రాంతాల్లో మెరుగైన ఫలితాలు సాధించలేదు. లేక్ ప్రాంతంలో హస్తం పార్టీ ఆధిక్యాన్ని చాటింది. కాశ్మీర్ లోయలో కూడా ఆ పార్టీ బలాన్ని చాటింది. ప్రాంతీయ పార్టీలు బరిలో ఉంటే పరిస్థితుల్లో మార్పు ఉండేదన్న అభిప్రాయాన్ని కాదనలేం. అదే సమయంలో జాతీయ పార్టీల పనితీరును తోసిపుచ్చలేం.

అందుకే గవర్నర్ ను.......

ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. తమ మాటను గవర్నర్ సత్యపాల్ మాలిక్ ద్వారా విన్పించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మాలిక్ కరడుగట్టిన బీజేపీ వాది. బ్యూరోక్రాట్ అయిన గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా స్థానంలో ఈ ఏడాది ఆగస్టులో మాలిక్ గవర్నర్ గా వచ్చారు. బ్యూరోక్రాట్ బదులు రాజకీయ వాది గవర్నర్ గా ఉంటే తమ పని సులువవుతుందన్న ముందు చూపుతో ఆయనను గవర్నర్ గా పంపారు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ప్రాధాన్యం కోల్పోతుండటం కమలానికి అవకాశంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉండటం, గవర్నర్ తమ మనిషి కావడం కలిసి వచ్చే అంశాలని కమలనాధులు భావిస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే ముందస్తు ఎన్నికలకు పావులు కదుపుతున్నారు. వీరి వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో వేచి చూడాలి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News