సిన్హా ఆపరేషన్ సక్సెస్ అవుతుందా?

జమ్ము కాశ్మీర్ ఎన్నికల ప్రక్రియలో కదలిక మొదలైంది. 370, 35ఏ అధికరణల రద్దు అనంతరం పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతుండటంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి కేంద్రం కసరత్తు [more]

Update: 2020-09-06 16:30 GMT

జమ్ము కాశ్మీర్ ఎన్నికల ప్రక్రియలో కదలిక మొదలైంది. 370, 35ఏ అధికరణల రద్దు అనంతరం పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతుండటంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికల ప్రక్రియ మొదలు పెడాతమని ప్రధాని నరేంద్రమోదీ తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించడంతో అధికార యంత్రాంగం వేగంగా కదులుతోంది. డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ ప్రకాశ్దేశాయ్ నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిటీ తనకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది.

మనోజ్ సిన్హా నియామకంతో….

2018 జూన్ లో పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతును బీజేపీ ఉపసంహరించు కోవడంతో అప్పటి నుంచి గవర్నర్ పాలన నడుస్తోంది. అనంతర కాలంలో అనేక మార్పులు జరిగాయి. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసింది. కశ్మీర్, లద్దాఖ్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. గత ఏడాది అక్టోబరు 31 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. కశ్మీర్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లుగా జీసీ ముర్ము, ఆర్కే మాధుర్ లను నియమించింది. తాజాగా ఈనెల మొదటివారంలో గవర్నరు ముర్మును కాగ్ చీఫ్ గా నియమించింది. ఆయన స్థానంలో మనోజ్ సిన్హాను పంపింది. సిన్హా నియామకంతో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పాత గవర్నరు ముర్ము మాజీ ఐఏెస్ అధికారి. పాలన అనుభవం తప్ప ప్రజల నాడిని గమనించి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లే నైపుణ్యం లేదు. ముక్కు సూటిగా వెళ్లడం ఆయన విధానం. ప్రస్తుత పరిస్థితులలో ముర్ము తగిన వ్యక్తి కాదని ఆయనకు బదులు సిన్హాను నియమించింది.

ఫక్తు పొలిటికల్ లీడర్….

మనోజ్ సిన్హా ఫక్తు రాజకీయ నాయకుడు. తూర్పు యూపీలోని ఘాజీపూర్ కు చెందిన ఆయన 1996, 1999, 2014లో సొంత స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో ఓడిపోయారు. అంతకుముందు 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు అనంతరం మనోజ్ సిన్హా సీఎం పదవికి పోటీపడ్డారు. కానీ అప్పట్లో పార్టీ ఆయనను పక్కన పెట్టింది. తాజాగా ఆయనకు గవర్నర్ పదవి అవకాశం కల్పించింది. మనోజ్ సిన్హా గతంతో కేంద్ర రైల్వే, టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ప్రజలతో నేరుగా సంబంధాలను నెరపడంతో నేర్పరి అన్న పేరు ఆయనకుంది. అందువల్లే ఆయనను కశ్మీర్ గవర్నరుగా పంపారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పటివరకు కశ్మీర్ గవర్నర్లుగా పనిచేసిన రాజకీయ నాయకుల్లో సిన్హా మూడోవారు. తొలి గవర్నర్ కరణ్ సింగ్, 2018లో నియమితులైన సత్యపాల్ మాలిక్ తరవాత గవర్నరుగా నియమితుడైన మూడో రాజకీయ నాయకుడు మనోజ్ సిన్హానే కావడం గమనార్హం. గతంలో గవర్నర్లుగా పనిచేసిన భగవాన్ సాహే, ఎల్.కె,ఝా, బీకే నెహ్రూ, జగ్ మోహన్, (రెండుసార్లు), కేవీ కష్ణారావు (రెండుసార్లు), జీఎస్ సక్సేనా (రెండుసార్లు), ఎస్కే సిన్హా, ఎన్ఎన్ వోహ్రా, జీసీ ముర్ములలో కొందరు ఐఏఎస్, కొందరు ఐపీఎస్ అధికారులు. కేవీ కష్ణారావు, సిన్హా మాజీ ఆర్మీ చీఫ్ లు కావడం గమనార్హం. సివిల్ సర్వీస్, మిలటరీ అదికారులైతే తీవ్రవాదాన్ని అణఛివేయగలరన్న నమ్మకంతో కేంద్రం వారిని గవర్నర్లుగా నియమించింది. కేంద్రంలో ఏ పార్టీ అదికారంలో ఉన్నా ఇదే విధానాన్ని పాటించడం విశేషం.

డీలిమిటేషన్ తో బీజేపీకి…..

2014 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 87 స్థానాలకు పీడీపీ 28, బీజేపీ 25, కాంగ్రెస్ 12, నేషనల్ కాన్ఫరెన్స్ 15 సీట్లు సాధించాయి. పీడీపీ, బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటయింది. 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మెహబూబా సర్కారు పడిపోయింది. అప్పటి నుంచి గవర్నర్ పాలన నడుస్తోంది. కశ్మీర్ లోయలో 46, జమ్ములో 37, లద్దాఖ్ లో 4 సీట్లు
ఉన్నాయి. ఇప్పుడు లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతమైంది. తాజాగా డీ లిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో నియోజకవర్గాల సంఖ్యలో మార్పులు జరగనున్నాయి.అ దేవిధంగా అధిక జనాభా ఉన్న జమ్ములో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు 37కు బదులు మరికొన్ని పెరగనున్నాయి. అదే సమయంలో తక్కువ జనాభా గల కశ్మీర్ లోయలో ప్రస్తుతం ఉన్న 46 సీట్లకు బదులు
తగ్గనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల హిందూ జనాభా అధికమై వారి నియోజకవర్గాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఫలితంగా బీజేపీ లాభం పొందనుంది. జాతీయవాదం, హిందూత్వ, 370 అధికరణ రద్దు, పాకిస్థాన్ బూచిగా చూపి ఎన్నికలలో లబ్ధి పొందాలన్నది కమలనాధుల యోచనగా చెబుతున్నారు. అందుకే కాషాయం పార్టీ ఎన్నికల పట్ల ఆసక్తి చూపుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కమలనాధుల అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News