సడెన్ ఎంట్రీ ఇందుకేనటగా?

రాజకీయాలన్నాక ఎత్తుగడలు సహజం. ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు బెజవాడ టీడీపీలోనూ అదే జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీలోని [more]

Update: 2021-03-07 09:30 GMT

రాజకీయాలన్నాక ఎత్తుగడలు సహజం. ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు బెజవాడ టీడీపీలోనూ అదే జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీలోని నేతలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఎత్తుగడలు వేసుకుంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్నల మధ్య ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. బుద్దా వెంకన్న అర్బన్ పార్టీ ఇన్ ఛార్జిగా ఉన్న నాటి నుంచే ఈ పోరు ప్రారంభమయింది. మున్సిపల్ ఎన్నికల వేళ అది మరింత ముదిరింది.

ఆధిపత్యం కోసం….

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ వర్గంపై పట్టు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు కావడంతో కేశినేని నాని అన్ని నియోజకవర్గాలపై తనకే పెత్తనం ఉందని భావిస్తున్నారు. తన పార్లమెంటు పరిధిలో గద్దె రామ్మోహన్ రావు తప్ప మరెవరూ టీడీపీ నుంచి గెలవలేదు. దీంతో ఆయన అన్ని నియోజకవర్గాల్లో పట్టు సంపాదించేందుకు కార్పొరేషన్ ఎన్నికల వేళ ప్రయత్నిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాన్ని కేశినేని నాని టార్గెట్ చేశారు.

వ్యూహాత్మకంగా జలీల్ ను….

అయితే కేశినేని నాని వ్యూహాత్మకంగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను రంగంలోకి దించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నడూ విజయం సాధించలేదు. అయితే జలీల్ ఖాన్ 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరడంతో ఆ పార్టీకి పశ్చిమ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం లభించింది. కానీ 2019 ఎన్నికల్లో జలీల్ ఖాన్ కూతురు ఓటమి పాలయిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు.

బుద్దాకు చెక్ పెట్టేందుకే…..?

దీంతో పశ్చిమ నియోజకవర్గం టీడీపీ బాధ్యతలన్నీ బుద్దా వెంకన్న చూస్తున్నారు. కానీ ఎన్నికల సమయంలో బుద్దా వెంకన్నది పైచేయి అవుతుండటంతో కేశినేని నాని తెలివిగా జలీ‌ల్ ఖాన్ ను రంగంలోకి దించారు. బుద్దా వెంకన్నకు పశ్చిమ లో చెక్ పెట్టేందుకే జలీల్ ఖాన్ ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారంటున్నారు. దీని వెనక కేశినేని నాని ఉన్నారని పార్టీలోనే గుసగుసలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసే సమయానికి తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు మరింత ముదిరే అవకాశముంది.

Tags:    

Similar News