ఉండవల్లి జక్కంపూడి కుటుంబానికి ఎందుకు దూరమయ్యారు?

తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలను ఆ మిత్రులిద్దరూ శాసించారు. వారే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు. విద్యార్థి దశనుంచి [more]

Update: 2020-06-04 08:00 GMT

తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలను ఆ మిత్రులిద్దరూ శాసించారు. వారే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు. విద్యార్థి దశనుంచి వీరిద్దరూ రాజకీయాల్లో చురుగ్గా కదిలారు. ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం ఒకే మాటగా వారి బాట సాగింది. ఒక ప్రత్యేక భాష కూడా కోడ్ మాదిరి పెట్టుకుని అందరు ఉండగానే మాట్లాడుకుంటూ ఎవరికి అందని రాజకీయాలు దశాబ్దాల తరబడి సాగించారు. వీరిద్దరిని కృష్ణార్జునులు అనేవారు ఉన్నారు. దుర్యోధన, కర్ణుడి స్నేహంతో పోల్చేవారు ఉన్నారు. చాణుక్య, చంద్రగుప్తు లని చమత్కరించేవారు ఉన్నారు. అలాంటి వీడతీయలేని స్నేహ బంధం వారిది. ఇద్దరు స్వర్గీయ డా. వైఎస్ఆర్ కి అత్యంత సన్నిహితులు. ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు అహరహం కృషి చేసినవారే.

బంధం తెగిపోయినట్లే….

ఒకరి ఉన్నతికి మరొకరు అండగా దందాగా నిలిచిన ఈ మిత్రుల్లో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు అనారోగ్యం రీత్యా 9 అక్టోబర్ 2011 లో కన్నుమూశారు. ఆయన మరణం తరువాత రామ్మోహన్ కుటుంబం తో ఉండవల్లి బంధం దాదాపు తెగిపోయింది. దీనికి కారణాలపై అనేక ప్రచారాలు సాగాయి. కానీ అటు ఉండవల్లి కానీ ఇటు జక్కంపూడి కుటుంబం కానీ దీనిపై ఎక్కడా పెదవి విప్పలేదు. తాజాగా తెలుగు పోస్ట్ కి వైసిపి ఏడాది పాలన సందర్భంగా రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఉండవల్లి ఎందుకు మీ కుటుంబంతో దూరం జరిగారన్న ప్రశ్నకు రాజా తమ వైపు నుంచి జవాబు చెప్పారు. తన తండ్రి చనిపోయిన తరువాత తమకుటుంబానికి వెన్నెముకగా ఉంటారనుకున్న ఉండవల్లి దానికి భిన్నంగా వ్యవహరించడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. తన తండ్రి దగ్గర లబ్ది పొందిన కొందరు స్వార్ధంతో గ్యాప్ బాగా పెంచారని ఆరోపించారు. అయితే తమ కుటుంబంతో ఎంత సన్నిహితమో అంతేవిధంగా వైఎస్ఆర్ కుటుంబానికి ఆయన వెన్ను దన్నుగా ఉండాలని కానీ ఆయన కాంగ్రెస్ లో ఉండటం తాము వైసిపి లో ఉండటంతో విమర్శలు చేయాలిసి రావడం వాటిని కొందరు పెద్దవి చేసి ఉండవల్లి కి మోయడం ఇలా గ్యాప్ పెరుగుతూ వచ్చిందన్నారు రాజా.

ఆ చర్య మనసు బాధించింది …

తమ తండ్రి మంత్రిగా ఉండగా ఆర్ అండ్ బి, నిధులు కొన్ని, ఎంపి లాడ్స్ నుంచి కొన్ని నిధులు తో బ్లడ్ బ్యాంక్ నిర్మాణం తన తల్లి ప్రతిష్టాత్మకంగా తలపెట్టారని అది నిర్మాణ దశలో తన తండ్రి మరణం ఆ తరువాత అది పూర్తి చేయడానికి బంగారం కుదువ పెట్టి సిద్ధం చేసినా అవకతవకలు జరిగాయంటూ బ్లడ్ బ్యాంక్ నిలుపు చేయడానికి కలెక్టర్ పై ఉండవల్లి అరుణ కుమార్ వత్తిడి తెచ్చారని తెలిసిందన్నారు జక్కంపూడి రాజా. కోట్లాది రూపాయల వ్యయం చేసిన ఆ బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పరికరాలన్నీ నాశనం అయి మూలాన పడిపోయిందనే ఆవేదన ఉందన్నారు జక్కంపూడి. ఇలా అనేక కారణాలు ఉన్నాయని అయితే ఆయనపై ఎంతో గౌరవం ఉందన్నారు రాజా. తన తండ్రి ఆయన లో ఉన్న ప్రతిభను గుర్తించి ఉండవల్లి మీటింగ్స్ కు కుర్చీలు వేయడం దగ్గర నుంచి జన సమీకరణ వరకు అన్ని తానై చేసి హీరో గా అరుణ కుమార్ ను నిలబెట్టినా ఆయన కష్టకాలంలో తమ వెంట నిలవలేదని మనసును బాధ పెడుతూ ఉంటుందని అన్నారు రాజా.

ఉండవల్లి కే జగన్ తొలిగా ఫోన్ …

కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి ఉత్తరాంధ్ర లో ఓదార్పు యాత్రకు బయల్దేరిన వైఎస్ జగన్ తొలిగా ఉండవల్లి అరుణ కుమార్ కే ఫోన్ చేశారని రాజా చెప్పారు. ఆయనతో మాట్లాడాక, బొత్స సత్యనారాయణ తో కూడా మాట్లాడారని అయితే ఉండవల్లి కాంగ్రెస్ తోనే ఉండిపోవడం జరిగిందన్నారు. అటు వైఎస్ కుటుంబానికి జక్కంపూడి కుటుంబానికి పెద్ద దిక్కు అవుతార నుకుంటే ఆయన దూరం జరగడం తమకు వెలితిగానే ఉంటుందన్నారు రాజా. అనివార్య పరిస్థితుల్లో పాతికేళ్ళు ఆదరించిన కడియం నియోజకవర్గాన్ని వదిలి రాజానగరానికి జగన్ ఆదేశాల మేరకే వచ్చామన్నారు రాజా. 2009 లో కడియం లో 2014 లో రాజానగరం లలో తన తల్లి జక్కంపూడి విజయలక్ష్మి ఓటమికి నమ్మిన వారు వెన్నుపోటే కారణమని ఆవేదన చెందారు రాజా.

సీనియర్లకే దక్కలేదు….

ఇలా రెండు సార్లు ఓటమి పాలై రాజకీయంగా, ఆర్ధికంగా చాలా చితికిపోయామన్నారు జక్కంపూడి. తనకు తొలి క్యాబినెట్ లో బెర్త్ దక్కకపోయినా అసంతృప్తి లేదని రోజా వంటి అనేకమంది కి సైతం మంత్రి పదవులు దక్కలేదని అయినా రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత గల కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టి ఆదరించారని చెప్పారు రాజా. పదవులు ముఖ్యం కాదని జగన్ మనసులో తాము ఉన్నామా? లేదా? అన్నదే తమ కుటుంబానికి ప్రధానమని రాజా వెల్లడించారు. రాజమండ్రి వైసిపి లో గ్రూప్ లు వాస్తవమే అని అయితే అవి పార్టీకి మేలు జరిగేలా ఉన్నంత వరకు ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ కుటుంబం వెంటే ఉంటామని చెప్పుకొచ్చారు రాజా.

జగన్ మాటిస్తే …

గత ఏడాది కాలం లో వైసిపి ఇచ్చిన హామీలను అన్ని జగన్ పూర్తి చేశారని నవరత్నాల అమల్లో కానీ పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుందన్నారు రాజానగరం ఎమ్యెల్యే. దేశంలోనే ఏ రాష్ట్రం లో లేని విధంగా ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలు అందించడానికి కృషి చేయడం, పెన్షన్లు, విద్యా, వైద్యం అంశాల్లో ప్రధానంగా దృష్టి తమ ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమన్నారు రాజా. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఎపి లోని కాపు సామాజికవర్గాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు జగన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ప్రతి ఒక్కరు లబ్ది పొందేలా కృషి చేస్తానని చెప్పారు. వైఎస్ ఆర్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా యువతను పార్టీ వైపు ఆకర్షితులు అయ్యేలా అన్ని జిల్లాల్లో కార్యాచరణ తీసుకుంటున్నట్లు తెలుగుపోస్టు కి వెల్లడించారు జక్కంపూడి రాజా.

Tags:    

Similar News