మళ్లీ ఒక్కటి చేస్తారా..?

ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ పోయి చాలా కాలం అవుతోంది. నా ఇల్లు, నా పొయ్యి, నా కోడి అన్న లెక్కలు వచ్చేశాయి. సమాజంలో కుటుంబం ఒక యూనిట్ [more]

Update: 2019-08-02 14:30 GMT

ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ పోయి చాలా కాలం అవుతోంది. నా ఇల్లు, నా పొయ్యి, నా కోడి అన్న లెక్కలు వచ్చేశాయి. సమాజంలో కుటుంబం ఒక యూనిట్ అయితే అక్కడ నుంచే ఈ విభజన మొదలైందని భావించాలి. కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్తే అంతా ఒక్కటిగా తెలుగు నేల ఉండేది, ముస్లింలు, తరువాత బ్రిటిష్ పాలనలో తెలంగాణా వేరుపడింది. సర్కార్ జిల్లాలు, కోస్తా కలిపి మద్రాస్ లో భాగమైంది. ఆ తరువాత పొట్టి శ్రీరాములు పోరాటంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, మరో మూడేళ్ళకు తెలంగాణాను కూడా కలుపుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఆవిర్భవించడం ఇదొక చరిత్ర. ఇక ఉమ్మడి ఏపీ ఏర్పాటు అయిన పదమూడేళ్ళకే పదవుల కోసమే ప్రధానంగా తెలంగాణా ఉద్యమం మొదలైంది. ప్రతిగా ఇటు ప్రత్యేక ఆంధ్రా పోరాటం కూడా జరిగింది. మొత్తానికి నాటి ప్రధాని ఇందిర అందరినీ కూర్చోబెట్టి సామరస్యంగా వ్యవహారం ముగింపునకు తెచ్చారు. తిరిగి మరో పాతికేళ్ళకు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో మొదలైంది. అది చివ‌రికి రాష్ట్ర విభజననకు దారితీసింది.

ఒక్కటిగా తెలుగు రాష్ట్రాలు…

ఈ మాట అన్న వారు ఎవరో తెలిస్తే షాక్ తినాల్సిందే. ఎందుకంటే పాల కుండ లాంటి ఉమ్మడి ఏపీని రెండుగా చేయడంలో నాటి యూపీయే సర్కార్ లో కీలమైన పాత్ర పోషించిన కేంద్ర మంత్రి జై రాం రమేష్ ఇపుడిలా మాట్లాడుతున్నారు. ఆయన లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ, ఎప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలుస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. ఉమ్మడి ఏపీ విడిపోయి ఇప్పటికి ఆరేళ్ళు అయిందని, అయినా కొద్ది కాలంలోనే కలిసే అవకాశం ఉందని ఆయన జోస్యమే చెబుతున్నారు. దానికి ప్రపంచ చరిత్రలోని అనేక ఉదాహరణలు కూడా ఆయన వినిపిస్తున్నారు. రెండుగా ఉన్న జర్మనీ ఒక్కటి కాలేదా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కూడా రేపో మాపో కలవాలని చూస్తున్నాయి. వీటిని బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం పెద్ద సమస్య కాదని జై రాం రమేష్ అంటున్నారు.

కాంగ్రెస్ తప్పు చేసిందట…

అవును మరీ దిగితే కాని లోతు తెలియదు అంటారు. ఏ ముహూర్తాన అయితే ఉమ్మడి ఏపీని విడగొట్టిందో ఆ పాపమో, శాపమో తెలియదు కానీ కాంగ్రెస్ వరసగా రెండు సార్లు ఘోరంగా జాతీయ స్థాయిలో ఓటమి పాలు అయింది. కనీసం ప్రతిపక్ష స్థానానికి కూడా అర్హత లేకుండా పోయింది బహుశా ఇవన్నీ మనసులో ఉంచుకుని కాబోలు జై రాం రమేష్ తప్పు చేశామని అంటున్నారు. ఏపీని విభజించడం కాంగ్రెస్ చేసిన అతి పెద్ద తప్పేనని ఆయన ఒప్పుకుంటున్నారు. వాస్తవం ఏంటి అంటే విభజన చట్టాన్ని రూపొందించిందే జై రాం రమేష్. అయినా ఆయన ఇపుడు తెగ బాధపడుతున్నారు. తెలుగు వారు ఒక్కటిగా ఉంటే చూడాలన్నది తన కోరికగా కూడా ఆయన చెబుతున్నారు. అది తన జీవితకాలంలోనే జరిగితీరుతుందని కూడా జై రాం రమేష్ అంటున్నారు. తెలంగాణాలో కేసీఆర్ పాలన ముగిసిన తరువాతనే ఇది సాధ్యపడుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపివేస్తామని కూడా ఆయన అంటున్నారు. మరి తెలంగాణా ప్రజలు ఒప్పుకుంటారా అంటే అది అనివార్యమని, అంతా అలాగే స్పందించే రోజు తప్పకవస్తుదని జై రాం రమేష్ అంటున్నారు. మళ్ళీ సమైక్యాంధ్ర రావడం జరిగే పనేనా అని ఆలోచించినపుడు ఎందుకు జరగకూడదూ అన్నది ప్రతి తెలుగు వాడిని అనిపించేదే. చూడాలి మరి.

Tags:    

Similar News