కవిత పంతం నెగ్గించుకుంటారా...?

Update: 2018-10-25 02:30 GMT

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా వీచినా ఒక్క జగిత్యాల నియోజకవర్గం మాత్రం కారు స్పీడుకి బ్రేక్ వేసింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో విజయ కేతనం ఎగరేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి డా.సంజయ్ కుమార్ పై సుమారు 7 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. టీఆర్ఎస్ కి క్లీన్ స్వీప్ ని దూరం చేసిన జగిత్యాలను ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. ఈసారి కరీంనగర్ లో క్లీన్ స్వీప్ చేస్తున్నామని, సర్వే రిపోర్టులు కూడా అలానే వచ్చాయని గులాబీ బాస్ కేసీఆర్ పదే పదే చెబుతూ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నిం చేస్తున్నారు. ఇక జగిత్యాల నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఉండటం, ఎంపీగా కవిత ఉండటంతో ఆమె కూడా ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. జగిత్యాలలో అన్నీ తానై విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వాస్తవానికి ఆమె ఇక్కడ నాలుగేళ్ల నుంచి ప్రత్యేక దృష్టి పెట్టారు. పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఒక దశలో ఈ ఎన్నికల్లో కవితే జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కవిత...

టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో జగిత్యాల ఒకటి. ఇక్కడి నుంచి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి బరిలో ఉండటమే అందుకు కారణం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సంజయ్ కుమార్ నే మళ్లీ అభ్యర్థిగా మొదటి లిస్టులోనే ప్రకటించారు. ఆయన నెల రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ కవిత కూడా ఇక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తూ పరిస్థితులను పార్టీకి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు తమ వల్లే జరిగాయని టీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఐదుసార్లు గెలిచిన జీవన్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, ఈసారి టీఆర్ఎస్ ను గెలిపించి మరింత అభివృద్ధి చేసుకోవాలని ఓట్లు అడుగుతున్నారు. జగిత్యాల ప్రత్యేక జిల్లాగా ఏర్పడటం కూడా టీఆర్ఎస్ కు కలిసి వస్తుందని నమ్ముతున్నారు. ఇక ఇక్కడ గెలుపోటముల్లో ప్రభావం చూపే ముస్లిం ఓటర్లు ఈసారి టీఆర్ఎస్ వైపు ఉంటారని ధీమాగా ఉన్నారు.

ఉద్దండులు ఒక్కటవడంతో...

ఇక ప్రజాకూటమిలో భాగంగా టిక్కెటు కాంగ్రెస్ పార్టీకే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ రెండు పార్టీలకూ ఉద్దండ నాయకులే ఉన్నారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఇద్దరిదీ జగిత్యాల నియోజకవర్గం. అయితే, పొత్తుల్లో సిట్టింగులు ఉన్న చోట వారికే టిక్కెట్ ఇవ్వాలనే నిబంధనతో జీవన్ రెడ్డికి టిక్కెట్ ఖాయమైంది. ఎల్.రమణ కూడా కోరుట్ల నుంచి బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడి ఎల్.రమణకు కూడా మంచి పట్టు ఉంది. ఆయనకు గత ఎన్నికల్లో 22 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తుండటం జీవన్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఎటువంటి ఆరోపణలు లేకపోవడం, సీనియర్ నేత కావడం, గ్రామాల్లో మంచి పట్టు ఉండటం కూడా ఆయనకు ప్లస్ కానుంది. అయితే, ఇప్పటికే అనేకసార్లు జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఒకసారి సంజయ్ కుమార్ కు అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా కొంతమందిలో ఉంది. పైగా నియోజకవర్గ అభివృద్ధిని టీఆర్ఎస్ ఓన్ చేసుకోవడంలో బాగానే సక్సెస్ అయ్యింది. మొత్తానికి జగిత్యాల నుంచి ప్రజాకూటమి జైత్రయాత్ర మొదలవుతుందని జీవన్ రెడ్డి, ఎల్.రమణ ధీమాగా చెబుతుంటే... ఈ ఇద్దరు కవల పిల్లలను ఓడించి ఈసారి జగిత్యాలపై జెండా ఎగరేస్తామని టీఆర్ఎస్ చెబుతోంది. ద్విముఖ పోటీ జరగనున్న జగిత్యాలలో విజయం ఇద్దరికీ అంత సులువు కాదనేది మాత్రం స్పష్టమవుతోంది.

Similar News