ఈసారి జయం వైసీపీదేనా..?

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా ఉన్న కృష్ణా జిల్లాపై ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా గంపెడాశలు పెట్టుకుంది. జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు గెలుచుకొవాలని ఆ [more]

Update: 2019-05-21 01:30 GMT

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా ఉన్న కృష్ణా జిల్లాపై ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా గంపెడాశలు పెట్టుకుంది. జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు గెలుచుకొవాలని ఆ పార్టీ కంకణం కట్టుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను కాపాడుకోవడంతో పాటు కొత్త స్థానాలనూ దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉంటున్నారు. ఈసారి కృష్ణా జిల్లాలో గెలిచే కొత్త స్థానాల్లో జగ్గయ్యపేట కచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు నమ్మకంగా ఉన్నారు. ఇక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్థి సామినేని ఉదయభాను కచ్చితంగా విజయం సాధిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక, తెలుగుదేశం పార్టీ సైతం ఈ నియోజకవర్గంలో గెలుపుపై ధీమాగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఆ పార్టీ చెబుతోంది.

హ్యాట్రిక్ పై టీడీపీ ధీమా

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలుగా సామినేని ఉదయభాను, శ్రీరాం తాతయ్య వ్యవహరించారు. 1999, 2004లో కాంగ్రెస్ నుంచి ఉదయభాను విజయం సాధించారు. 2009లో శ్రీరాం తాతయ్య టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి సుమారు 10 వేల ఓట్లతో ఉదయభానుపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఉదయభాను గట్టి పోటీ ఇచ్చినా మరోసారి తాతయ్య విజయం సాధించారు. 1,846 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన ఉదయభాను ఓడించారు. ఈసారి కూడా మళ్లీ వీరిద్దరే బరిలో నిలిచారు. దీంతో మరోసారి హోరాహోరీ పోరు జరిగింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఇక్కడి నుంచి ఏకంగా ఆరుసార్లు విజయం సాధించారు. నెట్టెం రఘురాం మూడుసార్లు టీడీపీ నుంచి గెలిచి మంత్రిగానూ పనిచేశారు. ఇక, ఎమ్మెల్సీ, చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే టీడీ జనార్ధన్ కూడా నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు.

ఉదయభానును భయపెడుతున్న సెంటిమెంట్

టీడీపీలో ఎమ్మెల్యేతో పాటు నెట్టెం రఘురాం, టీడీ జనార్ధన్ వంటి కీలక నేతలు ఉండటంతో ఈ ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గం బాగానే అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఇక్కడి ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కుంటున్న మంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో తాము చేసిన అభివృద్ధితోనే మళ్లీ గెలుస్తానని శ్రీరాం తాతయ్య నమ్మకంగా ఉన్నారు. జగ్గయ్యపేటలో కమ్మ, ఆర్యవైశ్య, కాపు, ముస్లిం, బీసీ ఓట్లు అధికంగా ఉన్నాయి. కమ్మలు టీడీపీ వైపు మొగ్గు చూపినా ఆర్యవైశ్యులు, ముస్లింలలో వైసీపీకి మెజారిటీ ఓట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. కాపుల ఓట్లు జనసేన చీల్చడం టీడీపీ నష్టం చేసే అవకాశం ఉంది. ఇక, బీసీలు ఎప్పుడూ టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నా ఈసారి వారి ఓట్లు కూడా తమకే ఎక్కువ వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. ఉదయభానుపై రెండుసార్లు ఓడినా సానుభూతి ఉంది. వరుసగా పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న శ్రీరాం తాతయ్యపై సహజంగానే కొంత వ్యతిరేకత వ్యక్తమవతోంది. మొత్తంగా ఇక్కడ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కే అవకాశం ఉంది. అయితే, ఇక్కడ ఒక్కసారి ఓడిపోయిన అభ్యర్థి మళ్లీ గెలిచిని చరిత్ర లేదు. ఈ సెంటిమెంట్ మాత్రం వైసీపీ అభ్యర్థి ఉదయభానును బయటపెడుతోంది.

Tags:    

Similar News