కేసీయార్ రిటర్న్ గిఫ్ట్ ఈసారి ఎవరికో తెలుసా?

గిఫ్ట్ గురించే అప్పటిదాకా అందరికీ తెలుసు. కానీ మూడేళ్ల క్రితం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అన్న పదం వాడారు. పొలిటికల్ గా అది తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి [more]

Update: 2021-04-03 14:30 GMT

గిఫ్ట్ గురించే అప్పటిదాకా అందరికీ తెలుసు. కానీ మూడేళ్ల క్రితం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అన్న పదం వాడారు. పొలిటికల్ గా అది తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆయన ఏపీలో నాటి తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబుని ఉద్దేశించి రిటర్న్ గిఫ్ట్ అన్న దాన్ని వాడారు. దాని అర్ధమేంటో 2019 ఎన్నికల్లో బాబు దిగిపోయి జగన్ ముఖ్యమంత్రి కావడంతో టీడీపీ తమ్ముళ్లకు తెలిసివచ్చింది. మళ్ళీ ఇన్నాళ్లకు రిటర్న్ గిఫ్ట్ అన్న పదం ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది.

విశాఖ టూర్ కన్ఫర్మ్ ….

విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. దానికి సెంటిమెంట్ ని కూడా జోడించి ప్లాంట్ ని అమ్మేస్తే ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ ఉద్యమానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. తెలంగాణా మంత్రి కేటీయార్ అయితే విశాఖ ఉక్కు ఉద్యమానికి టీయారెస్ పూర్తి సపోర్ట్ అని చెప్పేశారు. అవసరం అయితే తాను కూడా విశాఖ వచ్చి అక్కడే అగ్గి రాజేస్తానని కేంద్రాన్ని హెచ్చరించారు. ఇపుడు ఆ సమయం రానే వచ్చింది అంటున్నారు. తొందరలోనే కేటీయార్ విశాఖ రాబోతున్నారని టాక్ నడుస్తోంది.

సంచలనమే…

ఉమ్మడి ఏపీ విభజనకు ముందు ఆంధ్రోళ్ళు దోపిడీ అంటూ విమర్శలు చేసిన టీయారెస్ పార్టీ ఇన్నేళ్ళ తరువాత ఏపీ నడిబొడ్డుకు రావడం అంటే మామూలు విషయం కాదు, అదే విధంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద లీడ్ తీసుకుని పోరాడతామని చెప్పడం కూడా ఇంకా విశేషం. ఇక కేటీయార్ ని విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా ఆహ్వానించారు. దానికి అంగీకరించిన కేటీయార్ తప్పకుండా వస్తానని హామీ ఇచ్చేశారు. ఇలా విశాఖకు రాజమార్గానే వస్తున్న కేటీయార్ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరిట దుమ్ము దులపడం ఖాయం. అదే సమయంలో ఆయన అంతటితో ఆగుతారా అన్నదే ఆసక్తిని కలిగించే అంశం.

దెబ్బే మరి …?

స్టీల్ ప్లాంట్ సమస్య ఏపీకి సంబంధించిన అంశం. ఇక్కడ రాజకీయ పార్టీలు ఉక్కు కార్మికులకు అండగా నిలవాలి. కానీ అదేమీ జరగడంలేదు. కేంద్రంలోని బీజేపీకి చెడ్డ కావడం ఇష్టం లేకనే ఎవరూ కిమ్మనడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు పొరుగు రాష్టానికి చెందిన ఒక రాజకీయ పార్టీ నేత విశాఖ వచ్చి కేంద్రాన్ని నిలదీశారు అంటే ఏపీలోని రాజకీయ పార్టీలకు అది పరువు తక్కువ వ్యవహారమే. అదే సమయంలో కేంద్రాన్ని అనేసి కేటీయార్ వెళ్ళిపోతారు అనుకోవడానికీ లేదు. ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ మీద కూడా ఆయన బాణాలు వేయవచ్చు అంటున్నారు. జగన్ సోదరి షర్మిల పార్టీ పేరిట తెలంగాణాలో హడావుడి చేస్తున్నారు. దానికి రిటర్న్ గిఫ్ట్ అన్నట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ నే కేటీయార్ ఆయుధం చేసుకున్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. అదే జరిగితే రాజకీయంగా వైసీపీకి పెద్ద దెబ్బ అవుతుందనాలి. ఏది ఏమైనా కేటీయార్ విశాఖ టూర్ ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందన్నది ఖాయమనే అంటున్నారు.

Tags:    

Similar News