మోడీని వెంటాడుతున్న జగన్

ఏపీకి ప్రత్యేక హోదా.. ఈ మాట పుట్టింది 2014 ఫిబ్రవరి నెలలో. ఆ నెలలో జరిగిన యూపీయే చివరి క్యాబినెట్ సమావేశంలో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలన్న [more]

Update: 2019-06-21 14:30 GMT

ఏపీకి ప్రత్యేక హోదా.. ఈ మాట పుట్టింది 2014 ఫిబ్రవరి నెలలో. ఆ నెలలో జరిగిన యూపీయే చివరి క్యాబినెట్ సమావేశంలో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో హోదా అంశాన్ని కాంగ్రెస్ ముందుకు తెచ్చింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని మంత్రి మండలి దీనికి అమోదం తెలుపుతూ అమలు బాధ్యతను నాటి ఆర్ధిక సంఘం మీద పెట్టింది. తరువాత ఎన్నికలు జరగడం, బీజేపీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. అప్పట్లో 2014 ఎన్నికల సందర్భంగా ప్రధాని అభ్యర్ధిగా తిరుపతి వచ్చిన మోడీ ప్రత్యీక హోదా ఏపీకి ఇస్తామని తన వంతుగా కూడా గట్టి హామీ ఇచ్చారు. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. ఈ లోగా అయిదేళ్ళు గడిచాయి కానీ హోదా మాత్రం రాలేదు. టీడీపీ జమానాలో ప్యాకేజి అన్న కొత్త బ్రహ్మ పదార్ధాన్ని మోడీ, బాబు కలసి స్రుష్టించారు. చివరకూ అదీ లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ఉంది

ప్రధాని విసిగిపోతున్నారా :

ఇక ప్రత్యేక హోదా విషయంలో జగన్ మోహన్ రెడ్డి గట్టిగానే ఉన్నారు. అది ఆయన పోకడలు బట్టే తెలుస్తోంది. ప్రతిపక్ష నాయకుని హోదాలో అయిదేళ్ళూ వూరూ వాడా తిరిగి అనేక ఉద్యమాలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ఇపుడు సీఎం హోదాలోకి మారారు. తనతో పాటు ఏపీకి హోదా కావాలంటున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత ఢిల్లీ వెళ్ళిన జగన్ అప్పట్లో ఒకసారి హోదా మీద ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. హోదా ఏపీకి వూపిరి అని బలంగా వాణి వినిపించారు. ఇక ఆ తరువాత ప్రధాని తిరుపతి పర్యటనలోనూ హోదా అంశాన్ని కావలని జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఇక నీతి ఆయోగ్ సమావేశంలో అయితే దేశంలోని ముఖ్యమంత్రులు అందరి ఎదుట ప్రత్యేక హోదాపై జగన్ మోహన్ రెడ్డి గళమెత్తారు. ఎందుకు ఇవ్వరూ అంటూ ఆధారసహితంగా ఆయన ప్రసంగం చేశారు. తప్పు ఎవరిది ఎక్కడ జరిగిందో కూడా కళ్ళకు కట్టినట్లుగా విడమరచి చెప్పారు. పదే పదే హోదా ప్రస్తావనతో ఓ విధంగా జగన్ మోడీని విసిగించేస్తున్నారనే చెప్పాలి.

ఇప్పుడు కూడా :

ఇక ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష భేటీలో మళ్ళీ హోదాపై జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పెద్ద గొంతు చేశారు. పార్లమెంట్ అర్ధవంతంగా సాగాలని, ప్రజా సమస్యలు ప్రస్తావనకు రావాలని కోరుతున్న కేంద్రం తాను ఇచ్చిన మాటను తప్పితే గొడవలు జరగవా, ఎంపీలు ఆందోళన చేయరా అంటూ నేరుగా ఈసారి ప్రధానినే టార్గెట్ చేశారు జగన్. పార్లమెంట్ ప్రోడక్టివిటీ పెరగాలంటే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పోవడమే ఉత్తమ మార్గమని జగన్ మోహన్ రెడ్డి చేసిన సూచన ప్రధానికి నచ్చిందో లేదో కానీ దేశ ప్రజలకు మాత్రం బాగా నచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై ఎంత పట్టుదలగా ఉన్నారన్నది ఇప్పటికి నాలుగైదు సార్లు అదీ గట్టిగా నెల రోజులు కూడా కాకుండానే కేంద్రంపై వత్తిడి తేవడం ద్వారా నిరూపించుకున్నారు. నిజంగా హోదా ఇవ్వాలని ప్రధానికి అనిపించేలా జగన్ బాగా విసిగించేస్తున్నారు. మరి విసుగు చెందిన ప్రధాని ఏం చేయబోతారన్నదే ఇక్కడ ప్రశ్న.

Tags:    

Similar News