వీరు అక్కడి వరకేనా?

ఇద్దరూ సీనియర్ నేతలు. అనుభవం ఉన్న నేతలు. అయితే వారి అనుభవం శాసనసభ సమావేశాలకే పరిమితం చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వారిద్దరి సేవలను కేవలం [more]

Update: 2020-01-06 06:30 GMT

ఇద్దరూ సీనియర్ నేతలు. అనుభవం ఉన్న నేతలు. అయితే వారి అనుభవం శాసనసభ సమావేశాలకే పరిమితం చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వారిద్దరి సేవలను కేవలం అసెంబ్లీ సమావేశాల వరకే. ఆ తర్వాత వారిద్దరూ నియోజకవర్గాలకే పరిమితం. కీలకమైన అంశాల్లో సయితం ఇతర నేతలు మీడియా ముందుకు వస్తున్నారు. ఇంతకీ జగన్ వారిని పక్కన పెట్టినట్లా? అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటున్నట్లా?

ఇద్దరూ సీనియర్ నేతలే…..

ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావులు సీనియర్ నేతలు. ఇద్దరూ గతంలో మంత్రులుగా పనిచేసిన వారే. రాజకీయ అనుభవానికి తక్కువ లేదు. అయితే జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో వీరిద్దరికి జగన్ చోటు కల్పించలేదు. నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లకు, శ్రీకాకుళంలో ధర్మాన కృష్ణదాస్ కు జగన్ మంత్రివర్గ సభ్యులుగా అవకాశమిచ్చారు. దీంతో ఈ సీనియర్లు ఆరు నెలలుగా సైలెంట్ గానే ఉంటున్నారు. రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో తమకు స్థానం దక్కుతుందన్న ఆశలో ఉన్నారు.

నిబంధనలు… నియమావళి….

కానీ జగన్ మాత్రం వీరిని శాసనసభ సమావేశాల్లో ఎక్కువగా వినియోగించుకంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ శాసనసభ్యుడు కావడంతో ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చేందుకు జగన్ వాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన శీతాకాల సమావేశాల్లోనూ ఆనం రామనారాయణరెడ్డి అనేక సందర్భాల్లో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. శాసనసభ నిబంధనలను, నియమావళిని తెలియపరుస్తూ ఆనం రామనారాయణరెడ్డి ఒకరకంగా వైసీపీని శాసనసభలో ఆదుకుంటున్నారు.

రాజధాని అమరావతిపై….

ఇక మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా అంతే. ఇటీవల రాజధాని అమరావతిపై జరిగిన చర్చలో ధర్మాన ప్రసాదరావును జగన్ ముందుంచారు. ఆయన ఉత్తరాంధ్రకు చెందిన నేత కావడం, సూటిగా, స్పష్టంగా మాట్లాడగలగడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ఎంత నష్టపోయిందో ధర్మాన నోటి నుంచి జగన్ చెప్పించారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఒక్కటే ధర్మాన నోటి వెంట రాలేదు. మిగిలిన మొత్తం అంశాలను ఆయనచేతనే జగన్ చెప్పించడం విశేషం. ఇదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. తర్వాత మంత్రివర్గ విస్తరణలో వీరిద్దరికీ ఛాన్స్ దక్కుతుందని, అందుకే జగన్ అవసరమైనప్పుడు వీరి సేవలను వినియోగించుకుంటున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. వీరికి ఏ కమిటీలో స్థానం లేదు. అలాగే ప్రధాన అంశాల విషయంలో మీడియాకు దూరంగా ఉంచుతున్నారు.

Tags:    

Similar News