పీవీ మీద బాబుకే భక్తి ఉండాలి ?

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోంది. అంటే ఇపుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు వస్తాయి. మరి కొత్తగా వచ్చే వాటి పేర్ల విషయంలో [more]

Update: 2020-09-04 14:30 GMT

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోంది. అంటే ఇపుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు వస్తాయి. మరి కొత్తగా వచ్చే వాటి పేర్ల విషయంలో ఇప్పటినుంచే రచ్చ సాగుతోంది. ఏనాడో దేశం కోసం అన్నీ త్యాగాలు చేసి అమరులైన వారి నుంచి నిన్నా మొన్నటివరకూ రాజకీయాల్లో వెలిగి దివికేగిన ప్రముఖ నేతల దాకా చాలా పేర్లే డిమాండ్లుగా ఉన్నాయి. ఇక జగన్ తన పాదయాత్ర సందర్భంగా అల్లూరి సీతారామరాజు, ఎన్టీయార్ వంటి మహనీయుల పేర్లు ఆయా స్థానిక జిల్లాలకు పెడతాను అని చెప్పుకొచ్చారు. అయితే మరింత మంది మహానుభావుల పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి. అయితే ఎక్కడ ఏ నాయకుడి పేరు పెట్టాలన్నా కూడా సంబంధం ఉండాలి. జనాలు కూడా కనెక్ట్ కావాలి.

పీవీ పేరుట ….

మాజీ ప్రధానిగా అయిదేళ్ళ పాటు కేంద్రంలో పనిచేసిన పీవీ నరసింహారావు తెలంగాణా వారు అని టీఆర్ఎస్ కేసీయార్ ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆయన పేరుని బాగానే వాడుకుంటూ భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఏపీలో కూడా పీవీ పేరు పెట్టాలన్న డిమాండ్ వస్తోంది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు జగన్ కి దీని మీద లేఖ రాశారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు వెలుగు అని చెప్పుకొచ్చారు. ఇపుడు తెలుగుదేశం పార్టీ అనుబంధ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కొందరు జగన్ కి లేఖ రాశారు. పీవీ పేరు ఏపీలో ఒక జిల్లాకు పెట్టాలని వారు కోరారు.

బాబు సీఎం కావడానికి…..

ఇక పాతికేళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే 1995 సెప్టెంబర్ 1న ఎన్టీయార్ ని కూలదోసి చంద్రబాబు ఉమ్మడి ఏపీకి కొత్త సీఎం అయ్యారు. ఆనాడు కేంద్రంలో ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నారు. నిజానికి అదే ఏడాది ఉగాదికి ప్రధాని హోదాలో ఉన్న పీవీని తన ఇంటికి ఎన్టీయార్ లక్ష్మీ పార్వతి పిలిచి తెలుగు విందును ఆతిధ్యం ఇచ్చారు. అలాగే పీవీ ప్రధానిగా నెగ్గిన తరువాత నంద్యాల నుంచి పీవీ పోటీ చేస్తే టీడీపీ నుంచి పోటీ పెట్టకుండా రామారావు తన సహకారం అందించారు. ఇవన్నీ ఉన్నా కూడా ఎన్టీయార్ ని అక్రమంగా చంద్రబాబు తొలగించిన ఎపిసోడ్ లో పీవీ మౌన పాత్ర వహించారని అంటారు. ఎన్టీయార్ ఈ విషయంలో తనకు సాయం చేయాలని ప్రధాని హోదాలో పీవీని జోక్యం చేసుకోవాలని కోరినట్లుగా నాడు ప్రచారం జరిగింది. కానీ పీవీ మాత్రం మామా అల్లుడు వివాదంగా దాన్ని చూశారని అంటారు. అంతే కాదు, రాజ్యాంగం ప్రకారం ఎలా చేయాలో అలా చేయమన్నట్లుగా నాటి గవర్నర్ కృష్ణ కాంత్ కి చెప్పారని కూడా పేర్కొంటారు. ఆ విధంగా మెజారిటీ చంద్రబాబుకే ఉందని ఆయన్ని గవర్నర్ సీఎంని చేస్తే పీవీ కూడా సరేనని వదిలేశారు. అంటే ఓ విధంగా చంద్రబాబు సీఎం అయన ఎపిసోడ్ లో పీవీ జోక్యం చేసుకోకపోవం అతి పెద్ద వరంగా చెప్పుకోవాలి. మరి దానికి ధన్యవాదంగా అయినా చంద్రబాబు పీవీ పేరు ఏపీకి పెట్టమని జగన్ని కోరాలి.

జగన్ వింటారా ….?

ఇవన్నీ ఇలా ఉంటే పీవీకి, వైఎస్సార్ కుటుంబానికి ఏదో తెలియని రాజకీయ అగాధం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. పీవీ ఉన్నపుడు వైఎస్సార్ ని సీఎం కానీయలేదని చెబుతారు. ఆ విధంగా చెప్పుకుంటే ఏపీ రాజకీయాల వరకూ పీవీ చంద్రబాబుకే ఇండైరెక్ట్ గా మేలు చేశారనుకోవాలి. కానీ పీవీ లాంటి వారి విషయంలో సంకుచిత రాజకీయా కోణం నుంచి ఎవరైనా చూడడం తప్పే. ఆయన గొప్ప దార్శనీకుడు. కాబట్టి జిల్లాకు పేరు పెడితే తప్పు లేదు కానీ ఏ జిల్లాకు పెట్టాలి. పెడితే అక్కడ స్థానికుల మనోభావాలు ఎలా ఉంటాయి అన్నది కూడా పాలకులు గమనంలోకి తీసుకోవాలి. ఇవేమీ జరగకపోతే పీవీకి భారత రత్న ఇవ్వమని కూడా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసినా మంచి పరిణామంగానే ఉంటుంది.

Tags:    

Similar News