వారి ఒంటరి పోరు.. జగన్ గెయిన్ అవుతారా..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. పొత్తులు లేకుండానే అన్ని పార్టీలూ బరిలో దిగడం ఖాయమైంది. పొత్తులపై ఉన్న ఊహాగానాలు అన్ని ఉత్తవే అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ [more]

Update: 2019-02-05 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. పొత్తులు లేకుండానే అన్ని పార్టీలూ బరిలో దిగడం ఖాయమైంది. పొత్తులపై ఉన్న ఊహాగానాలు అన్ని ఉత్తవే అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఆంద్రప్రదేశ్ లో మాత్రం వారితో కలవడం లేదు. ఇక, గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకే దిగుతోంది. జనసేన మాత్రం కమ్యూనిస్టులతో కలిసి నడుస్తున్నారు. ఇక, జగన్ మొదటి నుంచీ ఒంటరిగానే ఎన్నికల బరిలో ఉంటామని స్పష్టం చేశారు. అయితే, ఎవరికి వారే ఒంటరిగా బరిలో దిగితే ఎవరికి నష్టం? ఎవరికి లాభం అనే లెక్కలు వేసుకోవడంలో పార్టీలు బిజీ అయ్యాయి. ముఖ్యంగా అందరూ ప్రత్యేకంగా పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆ పార్టీ నేతల లెక్క.

పవన్ తో ఇద్దరికీ నష్టమే..!

కమ్యూనిస్టులతో కలిసి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా చీలుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, మూడు, నాలుగు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఇంకా పూర్తిస్థాయిలో లేదు. చంద్రబాబుకు ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణే అనే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారు ప్రత్యామ్నాయంగా జగన్ నే చూస్తున్నారు కాబట్టి తమకేమీ నష్టముండదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కానీ, ఎంత లేదని చెప్పుకున్నా కచ్చితంగా కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కి కూడా పడే అవకాశం ఉంది. అయితే, అభిమానులతో పాటు ఓ ప్రధాన సామాజకవర్గ ఓట్లు మాత్రం ఎక్కువగా పవన్ ఖాతాలో పడే అవకాశం ఉంది. వీరంతా గత ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమి వైపు ఉన్నారు. దీంతో పవన్ చీల్చే ఓట్లు వల్ల వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ నష్టమయ్యే అవకాశం ఉంది.

జాతీయ పార్టీలు కొంప ముంచుతాయా..?

జాతీయ పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ ఒంటరి పోరు జగన్ కి నష్టం చేసే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. అయితే, గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసింది. ఐదేళ్ల కాంగ్రెస్ రాష్ట్రంలో బలపడక పోగా ఇంకా బలహీనమైంది. దీంతో మహా అయితే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కి మద్య స్నేహం ఉండటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు కాంగ్రెస్ కి ఓట్లు వేసే పరిస్థితి అయితే ఉండదు. దీంతో కాంగ్రెస్ ఒంటరి పోరుతో ఎవరికీ నష్టమూ ఉండదు.. లాభమూ ఉండదని అంటున్నారు. ఇక, బీజేపీ గత ఎన్నికల్లో మోదీ హవా, టీడీపీతో పొత్తు, పవన్ కళ్యాణ్ క్రేజ్ తో కాస్తోకూస్తో ఓట్లు, సీట్లు సంపాదించినా.. పొత్తు తెంపుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ ని ఒక విలన్ గా మార్చేసింది. దీంతో బీజేపీ, మోదీ అభిమానులు తప్ప బీజేపీకి ఎవరూ ఓటేసే పరిస్థితి లేదు. ఈ ఓట్లు గత ఎన్నికల్లో టీడీపీకి పడ్డవే కాబట్టి బీజేపీ ఒంటరి పోరుతో టీడీపీకే కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వల్ల వైసీపీ, టీడీపీ రెండు పార్టీలకూ కొంత నష్టం జరిగే అవకాశం ఉండగా.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు కేవలం నామమాత్రమే కానున్నాయి. ఈ రెండు పార్టీల ఒంటరిపోరు ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండకపోవచ్చు.

Tags:    

Similar News