కంట్రోల్ చేయకుంటే…. ధడేల్ మనడం ఖాయమే

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కోలుకోలేకుండా ఉంది. దానికి రిపేర్లు చేయడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వయసు రీత్యా కరోనా కారణంగా బయటకు రాలేకపోతుండటంతో జూమ్ యాప్ [more]

Update: 2020-12-19 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కోలుకోలేకుండా ఉంది. దానికి రిపేర్లు చేయడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వయసు రీత్యా కరోనా కారణంగా బయటకు రాలేకపోతుండటంతో జూమ్ యాప్ ద్వారా క్యాడర్ లో ధైర్యం నింపుతున్నారు. లోకేష్ అప్పుడప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. అయితే ఈ తండ్రికొడుకులిద్దరి వల్ల టీడీపీని బలోపేతం చేయడం సాధ్యం కావడం లేదు. కానీ జగన్ పార్టీ వల్లనే తెలుగుదేశం ఏపీలో పుంజుకుంటుంది. ఇది వాస్తవం.

పదిహేడు నెలల నుంచి…

జగన్ పార్టీ నేతలు, క్యాడర్ వల్ల టీడీపీ పూర్వ స్థితికి చేరుకునే అవకాశాలయితే స్పష్టంగా కన్పిస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు కావస్తుంది. అయితే ఈ పదిహేడు నెలల నుంచి కీలకమైన టీడీపీ నేతలు ఎవ్వరూ బయటకు రావడం లేదు. వారి వ్యాపారాలకే పరిమితమయ్యారు. బయటకు వస్తే లేనిపోని కేసులు పెడతారన్న భయం కావచ్చు. కానీ ఇప్పుడు ఆ భయాన్ని వైసీపీ నేతలే వారిలో పోగొడుతున్నారు. దీంతో వారు బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల వరస సంఘటనలు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది.

అందరూ సైలెంట్ గా ఉంటే…..

అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలందరూ దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లినట్లే కన్పించారు. ప్రధానంగా పరిటాల కుటుంబం బయటకు పెద్దగా రావడం లేదు. ఈ సమయంలో హిందూపురం ఎంపీ మాధవ్ పరిటాల రవిపై చేసిన కామెంట్స్ వారిని తిరిగి పార్టీలో చురుగ్గా పాల్గొనేలా చేశాయి. అలాగే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేయడంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

వీళ్లే వాళ్లను యాక్టివ్ చేస్తూ…..

ఇక నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పదిహేను నెలలుగా పీలేరు నియోజకవర్గంతో పాటు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అయితే కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వాహనంపై వైసీపీ నేతలు దాడి చేయడంతో ఆయన ఇక యాక్టివ్ అవుతున్నారు. ఇలా దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలే టీడీపీ నేతలను యాక్టివ్ చేస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయడం, దాడులు చేయడం వంటి వాటితో టీడీపీ నేతల్లో కసి పెంచుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికైనా జగన్ తమ నేతలను, కార్యకర్తలను కంట్రోల్ చేయాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రభావం తప్పదు.

Tags:    

Similar News