ఇక యుద్ధం మొదలైనట్లేనా ?

రాష్ట్రంలో పొలిటికల్ పవర్ గేమ్ మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను వెలికి తీసి శిక్షించాలని వైసీపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా యోచిస్తోంది. అయితే [more]

Update: 2019-06-25 14:30 GMT

రాష్ట్రంలో పొలిటికల్ పవర్ గేమ్ మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను వెలికి తీసి శిక్షించాలని వైసీపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా యోచిస్తోంది. అయితే ప్రభుత్వ పరంగా అదంత సులభంగా జరిగే పని కాదు. ప్రభుత్వాలు మారినా అధికారులు, కాంట్రాక్టర్లు మారరు. సాధ్యమైనంతవరకూ తమ తప్పుబయటికి రాకుండా కప్పిపుచ్చుకుంటారు. అందువల్లనే ఒక ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై వేరే ప్రభుత్వంలో శిక్షలు పడిన దాఖలాలు పెద్దగా కనిపించవు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ పనులపై తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తింది. వాటిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ తక్షణం బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఈ లోపు వేడి తగ్గకుండా రాజకీయ ప్రతీకారాన్ని రగులుస్తూనే ఉండాలని నిర్ణయించారు జగన్ మోహన్ రెడ్డి. మరోవైపు అధికారయంత్రాంగంలో తన పట్ల, ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంపొందింపచేసుకునే పనిలో నిమగ్నమై పోయారు.

హాయి..హాయిగా….

ప్రభుత్వాధినేతలకు అధికారులు మనస్ఫూర్తిగా సహకరిస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయి. బలవంతంగా ఒత్తిడితో పనిచేయిస్తే ఆశించిన ఫలితాలు రావు. ఈవిషయంలో చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందారు. అర్ధరాత్రి వరకూ వరస సుదీర్ఘ సమావేశాలు నిర్వహించి యంత్రాంగాన్ని నిర్లిప్తంగా చేసేశారు. ఒన్ వే తరహాలో ఆయన చెప్పింది వినడమే మినహా, ఇంటరాక్షన్ కు అధికారులకు అవకాశం ఉండేదికాదు. దీంతో ప్రభుత్వాన్ని నడపడం తమ బాధ్యతల్లో భాగం కాదన్న నిరాసక్తతకు ఉన్నతస్థాయి యంత్రాంగం వచ్చేసింది. అంతా చంద్రబాబు నాయుడే చూసుకుంటారన్న ఉదాసీనత నెలకొంది. జగన్ మోహన్ రెడ్డి సలహాదారులు ఈ విషయాన్ని గమనించి ఆయనకు తగిన గైడెన్స్ ఇచ్చారు. అందుకే అధికారులకు రిలీఫ్ కలిగించే విషయాలనే ముందుగా మొదలు పెట్టారు. టు ద పాయింట్ సమీక్షలతో ప్రభుత్వంలో మార్పు వచ్చిన విషయాన్ని బ్యూరోక్రసీకి పంపగలుగుతున్నారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రతిపక్షంపై రాజకీయ దాడి ఉద్ధ్రుతం చేయడానికంటే ముందుగా సొంత ఇల్లు చక్కదిద్దుకోవాలనేది జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. అందులోభాగంగానే సర్కారీ యంత్రాంగాన్ని తనకు పూర్తి సానుకూలంగా మార్చుకొంటున్నారు. పనివేళల్లో స్వేచ్ఛ కల్పిస్తూ పాజిటివ్ ఇమేజ్ సృష్టించుకుంటున్నారు. ఈరకమైన చర్యలు అధికారులు తన ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకారం అందించేందుకు తోడ్పడుతాయనేది జగన్ దీర్ఘాలోచన.

తగ్గేదే లేదు…

వైసీపీకి లభించిన మెజార్టీ చూసిన వారికి వణుకుపుడుతుంది. ప్రత్యర్థుల్లో వణుకు పుట్టడం పక్కనపెడదాం. ఆ స్పీడు చూసి వైసీపీ వర్గాలే కంగారు పడుతున్నాయి. మాట ఇచ్చాం. ముందుకు పోవాల్సిందే అంటున్నారు సీఎం జగన్. అమ్మ ఒడి పై ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వ , ప్రయివేటు పాఠశాలలు రెంటికీ వర్తింప చేస్తే అయిదారు వేల కోట్లరూపాయలు అవసరమవుతాయి. అదే ప్రభుత్వపాఠశాలలకే పరిమితం చేస్తే రెండువేల అయిదు వందల కోట్లతో సరిపోతుంది. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందేనంటున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు వ్యత్యాసం లేకుండా అమ్మ ఒడి సాయంకింద పిల్లల్ని పాఠశాలలో చదివించే ప్రతి మహిళకు 15 వేల రూపాయల ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రధానంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోకుండా చూసేందుకే ఈ నిర్ణయం. ‘మాట తప్పను. మడమ తిప్పను’అనేది వై.ఎస్. కుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న ముద్ర. అమ్మ ఒడిపై షరతులు పెడితే ఆ బ్రాండ్ పోతుంది. అందుకే వేల కోట్ల రూపాయల వ్యయంతో ముడి పడి ఉన్నప్పటికీ వెనకంజ వేయకూడదని కచ్చితమైన నిర్ణయమే తీసుకున్నారు. కేవలం మేనిఫెస్టోలకే పరిమితం కాకుండా నవరత్నాల పథకాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని చెప్పడం ప్రజలకు ఆనందదాయకమే. అమ్మ ఒడి అందరికీ వర్తింపచేయడం, మద్యపానం దశలవారీ ఎత్తివేతపై టైమ్ బౌండ్ కార్యాచరణకు ఆదేశించడం, ప్రజావేదిక కూల్చివేతతోనే అక్రమార్కులకు హెచ్చరికలు పంపడం వంటివన్నీ ఆ దిశలో చర్యలే.

తొలి హెచ్చరిక…

ప్రత్యర్థి చంద్రబాబు నాయుడికి స్పష్టమైన హెచ్చరిక పంపడానికి తోడు అధికారాన్ని సుస్థిరం చేసుకునే ఎత్తుగడతోనే జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజావేదిక కూల్చివేత చంద్రబాబుపై పొలిటికల్ పంచ్ గానే భావించాలి. రెండు రకాలుగా ప్రత్యర్థి పక్షాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్యను వైసీపీ ఉపయోగించుకోబోతోంది. అక్రమ కట్టడాలను నిర్మించి , అక్కడే నివసించి ప్రజలకు నిబంధనలు, నీతినియమాలు ఎలా చెప్పగలమంటూ జగన్ ప్రశ్నించడంతో టీడీపీని నైతికంగా దెబ్బ తీశారు.. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు పాలన నీతినియమాలకు విరుద్ధంగా సాగిందని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం. అదే సమయంలో రాష్ట్రంలో టీడీపీ తీసుకున్న నిర్ణయాలను తిరగతోడమంటూ పరోక్షంగా యంత్రాంగానికి సంకేతాలిచ్చినట్లే. అనుభవం తక్కువ కాబట్టి పరిపాలనలో తనదైన ముద్ర వేయడానికి కొంతకాలం పడుతుందని అందరూ భావించారు. అయితే పరిపాలనలో పాలిటిక్స్ ను సమపాళ్లలో మేళవిస్తూ తెలివైన ఎత్తుగడలు వేస్తున్నారు జగన్. వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సొంత నోట్స్ తయారు చేసుకుని రావడం, అధికారులు చెప్పింది నోట్ చేసుకోవడం వంటి చర్యలు శ్రద్ధాసక్తులు కలిగిస్తున్నాయి. ఫలితంగా అధికారులు కూడా బాగా ప్రిపేర్ అయిన తర్వాతనే సమావేశాలకు హాజరవుతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జరిపిన సమావేశాల్లో ప్రధానంగా ఆయన చెప్పింది వినడానికే సమయం సరిపోయేది. అందువల్ల అధికారులు పెద్దగా కసరత్తు చేయాల్సి వచ్చేది కాదంటున్నారు మొత్తమ్మీద చంద్రబాబుపై అక్రమకట్టడాల కూల్చివేత చర్యతో తొలి హెచ్చరిక జారీ చేసినట్లయ్యింది.

Tags:    

Similar News