దటీజ్ జగన్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది. జాతీయ [more]

Update: 2019-01-16 08:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది. జాతీయ రాజకీయాల్లోనూ వీరి భేటీ చర్చనీయాంశమవుతోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నా కేసీఆర్ సాటి తెలుగు రాష్ట్రంలో బలంగా ఉన్న జగన్ మద్దతు కూడా స్వీకరించేందుకు తన తరపున చర్చలకు కేటీఆర్ బృందాన్ని జగన్ వద్దకు పంపించారు. అయితే, ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ చేరుతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై జగన్ ఫస్ట్ నుంచీ క్లీయర్ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదానే సంజీవని అంటున్న ఆయన ప్రత్యేక హోదా ఎవరు ఇస్తామంటే వారికే తమ మద్దతు ఉంటుందని జగన్ స్పష్టంగా చెబుతున్నారు.

ఫెడరల్ ఫ్రంట్ కి పెరుగుతున్న అవకాశాలు

ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందని కేసీఆర్ స్వయంగా చెప్పాకనే జగన్ తో కేటీఆర్ భేటీ జరుగుతోంది. జగన్, కూడా ఫెడరల్ ఫ్రంట్ తో కలవాలంటే ప్రత్యేక హోదా అంశమే కీలకమని కేటీఆర్ కి చెప్పే అవకాశం ఉంది. అయితే, టీఆర్ఎస్ తో కలవడం వల్ల జగన్ కి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఏపీలో కేసీఆర్ వేలు పెడుతున్నారనే వాదనను టీడీపీ తీసుకువచ్చి జగన్ కి నష్టం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారు అంటూ వేసిన ఒక ముద్రను మాత్రం తొలగించుకోవచ్చు. ఇక, ఫెడరల్ ఫ్రంట్ కు అవకాశమే లేదనేది టీడీపీ వాదన. కానీ, పరిస్థితి అలా ఏమీ లేదు. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కాంగ్రెస్ లేకుండానే ఎస్పీ – బీఎస్పీ కూటమి కట్టాయి. పైగా మాయావతి కాంగ్రెస్ ని నేరుగా విమర్శిస్తున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పడింది.

టీడీపీ, జనసేన విమర్శల్లో వాస్తవమెంత..?

ఒడిషాలోనూ కాంగ్రెస్, బీజేపీ కూటమిలో చేరేది లేదని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఇక, మమతా బెనర్జీ సైతం రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు. దీంతో అక్కడా ఫెడరల్ ఫ్రంట్ కి స్కోప్ ఉంది. ఇక, టీఆర్ఎస్ – జగన్ కుమ్మక్కు అంటూ ఏపీలోని వివిధ పక్షాలు చేస్తున్న విమర్శల్లోనూ పస లేదు. టీడీపీ ఈ విమర్శలు ఎక్కువగా చేస్తోంది. అయితే, ఇదే టీడీపీ ఐదు నెలల క్రితమే టీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నాలు చేసిన విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇక, పవన్ కళ్యాణ్ సైతం సంవత్సరం క్రితమే కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆయనను ప్రశంసించి వచ్చారు. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లోనూ ఇన్ డైరెక్ట్ గా టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారు. దీంతో ఆయన వాదనకు కూడా అంత పస లేదనే చెప్పాలి.

జగన్ కి నష్టమైనా రాష్ట్రానికి మేలే…!

మొత్తానికి, ఇతర పార్టీల విమర్శలు ఎలాగున్నా… జగన్ మాత్రం రాజకీయంగా తన ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. ఇక, టీఆర్ఎస్ తో కలవడం వల్ల జగన్ కి రాజకీయంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నా ఏపీకి మాత్రం మేలే చేస్తుంది. కేసీఆర్ తో చంద్రబాబు విభేదాలు పెంచుకున్నందున జగన్ ఒకవేళ రేపు ఏపీలో అధికారం చేపట్టినా రెండు రాష్ట్రాల్లోని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News