జగన్ నా జిగినీ దోస్త్…?

జగన్ నా జిగినీ దోస్త్.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఏపీలో ఒకనాడు సంచలన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. [more]

Update: 2021-04-05 00:30 GMT

జగన్ నా జిగినీ దోస్త్.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఏపీలో ఒకనాడు సంచలన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఆయన రెండు సార్లు ఎంపీగా విజయవాడ నుంచి గెలిచారు. ఉమ్మడి ఏపీని అడ్డగోలుగా విభజిస్తే తాను రాజకీయాలకు గుడ్ బై కొడతాను అని భీష్మ ప్రతిన చేసిన లగడపాటి ఆ మాట ప్రకారం అలాగే ఉండిపోయారు. ఇక ఆయన 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి చేరువ అయినా ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు చేసినా కూడా అవి బెడిసికొట్టడంతో పూర్తిగా రాజకీయ వాసనలు వదులుకున్నారు అని అంటారు.

జగన్ తో అలా….?

ఇక వైఎస్సార్ సీఎంగా ఉన్న రోజుల్లో లగడపాటి రాజగోపాల్ హవా బాగానే సాగింది. వైఎస్సార్ కూడా రాజగోపాల్ కి మంచి విలువ ఇచ్చారు. ఆ సమయంలో లగడపాటి వ్యాపార దక్షత చూసిన వైఎస్సార్ ఆ మెలకువలేవో తన కుమారుడికీ నేర్పమని కోరారని ప్రచారంలో ఉంది. అలా లగడపాటి రాజగోపాల్ జగన్ ల మధ్య స్నేహాన్ని వైఎస్సారే కుదిర్చారు అంటారు. దాంతోనే జగన్ తనకు రాజకీయాల కంటే ముందు నుంచే తెలుసు అని తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్ చెప్పారు. జగన్ తనకు మంచి స్నేహితుడు అని కూడా చెప్పుకున్నారు.

వైఎస్సారే గ్రేటా….

మాటల చతురత గురించి లగడపాటి రాజగోపాల్ కి కొత్తగా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. జగన్ పాలన గురించి విలేకరులు అడిగిన దానికి ఆయన నర్మగర్భంగా మూడేళ్లలో జనమే తీర్పు చెబుతారు కదా అని చెప్పడంలోనే అసలైన రాజకీయం ఉంది. జనాలకు నచ్చితే మళ్లీ ఎన్నుకుంటారు. లేకపోతే లేదు. తాను మాత్రం ఎక్కడా బయటపడకుండా జగన్ కి చెడ్డ కాకుండా లగడపాటి రాజగోపాల్ జాగ్రత్తగానే మాటలు వాడారని అంటున్నారు. ఇక జగన్ కి వైఎస్సార్ కి మధ్యన ఒక అద్భుతమైన తేడాను కూడా చూపించి జగన్ మీద ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశారు. వైఎస్సార్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ బ్యాలన్స్ చేశారని చెప్పడంలోనే జగన్ ఆ పని చేయడంలేదన్న ఎత్తి పొడుపు దాగుంది మరి.

దూరమా దగ్గరా…?

మొత్తానికి జగన్ తో ముందే పరిచయం స్నేహం ఉందని చెప్పిన లగడపాటి రాజగోపాల్ మధ్యలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్థావన తీసుకువచ్చి ఓడినా జనాల్లోనే ఉన్నారని పొగిడారు. జగన్ ని నేరుగా అనకపోయినా విమర్శించేలాగానే లగడపాటి రాజగోపాల్ మాటలు ఉన్నాయని అంటున్నారు. అందువల్ల రాజకీయాల్లో ఒకనాటి జిగినీ దోస్తులు మరో నాడు ఉంటాయని అనడానికి లేదు. ఇక లగడపాటి సర్వేలు, ఆయన పోకడలు చూసిన జగన్ అంత తొందరగా దగ్గరకు తీస్తాడనీ అనుకోడానికీలేదు. ఏది ఏమైనా లగడపాటి మాటలను బట్టి చూస్తే సర్వేలు చేయడం తాను మానేశాను అని చెప్పినా కూడా ఆయన మాటలలోని అంతరార్ధమే తీసుకుంటే అది కూడా ఒక సర్వేలాగానే ఉంటుంది. జగన్ రెండేళ్ల పాలన మీద జనాలకు ఇంకా మోజు ఉందని, వైసీపీ పాలన మీద జనాల వ్యతిరేకత పెద్దగా లేదని అర్ధమవుతోంది. అదే సమయంలో జనసేనాని కష్టపడితే ఫ్యూచర్ ఉంది అన్నట్లుగానే లగడపాటి రాజగోపాల్మాటలు ఉన్నాయి. ఇక జగన్ పట్టించుకున్నా లేకపోయినా కూడా లగడపాటి రాజగోపాల్ కామెంట్స్ మాత్రం వైసీపీలో చర్చగానే ఉన్నాయిట.

Tags:    

Similar News