చంద్రబాబుకు త్వరలో గుడ్ న్యూస్… ?

బీజేపీతో కరచాలనం కోసం చంద్రబాబు తెగ కలవరిస్తున్నారు. కమలం దన్ను ఉంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో దున్నేయవచ్చు అన్నది చంద్రబాబు గట్టి నమ్మకం. అయితే కేంద్రంలోని మోడీ, [more]

Update: 2021-07-23 05:00 GMT

బీజేపీతో కరచాలనం కోసం చంద్రబాబు తెగ కలవరిస్తున్నారు. కమలం దన్ను ఉంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో దున్నేయవచ్చు అన్నది చంద్రబాబు గట్టి నమ్మకం. అయితే కేంద్రంలోని మోడీ, అమిత్ షాలకు మాత్రం చంద్రబాబుతో బంధం అన్నది అసలు ఇష్టం లేదు అన్నది ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన 2018 తరువాత డైరెక్ట్ గా ఈ ఇద్దరికే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒక దశలో కేంద్రంలోని బీజేపీని దించడానికి బాహుబలి ప్రయత్నాలే చేశారు. ఇవన్నీ కళ్ళ ముందుండగా మళ్ళీ బాబుతో దోస్తీ ఏంటి అన్నది కేంద్ర పెద్దల నిశ్చితమైన అభిప్రాయం. అయితే బీజేపీకి మాతృ సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్ మాత్రం చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నెత్తిన పాలే ….

ఆర్ఎస్ఎస్ మాట 2014లో చెల్లుబాటు అయి మోడీతో చంద్రబాబు జట్టు కుదిరింది. 2019 నాటికి మోడీ బీజేపీ కంటే ఎక్కువగా ఎదిగిపోయారు. దాంతో పాటు ఇటు చంద్రబాబు కూడా విడాకులు ఇచ్చేశారు. కానీ 2024 నాటి పరిస్థితి అలా ఉండదు అంటున్నారు. ఇప్పటికే బీజేపీకి దేశంలో ఎదురుగాలులు వీస్తున్నాయి. దాంతో మోడీ, షాల ఆధిపత్యం మునుపటిలా సాగడంలేదు. వారు కూడా ఆర్ఎస్ఎస్ పెద్దల సలహా సూచనలను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఈ నేపధ్యంలో పొత్తుల విషయంలోనూ, భవిషత్తు రాజకీయాల మీద ఆరెస్సెస్ మాట గతంలో మాదిరిగా చెల్లుబాటు అవుతుంది అంటున్నారు. అదే జరిగితే చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్లే అన్నది హస్తిన సమాచారం.

జగన్ అంటే..?

ఏపీలో జగన్ అంటే ఆర్ఎస్ఎస్ కి మంచి భావన లేదు అంటున్నారు. దానికి ప్రధాన కారణం ఆయన క్రైస్తవ మత విశ్వాసం కలిగిన వారు కారణం. ఇక జగన్ ఏపీలో మత మార్పిడులకు తెర తీస్తున్నారు అన్నది ఆర్ఎస్ఎస్ ప్రగాఢమైన అనుమానమట. ఆ మధ్య వందకు పైగా గుళ్ళ మీద దాడులు, దేవతా విగ్రహాల విద్వంసం జరిగింది. దీన్ని ఆర్ఎస్ఎస్ తీవ్రంగానే పరిగణిస్తోంది. దేశంలో ఎపుడూ ఎక్కడా ఇంతలా దుర్ఘటనలు జరగలేదు అని ఆర్ఎస్ఎస్ పెద్దలు అంటున్నారుట. అదే విధంగా ఏపీలోని పరిణామాల పట్ల వారు తీవ్రంగా కలత చెందుతున్నారుట. ఇక ఏపీలో జగన్ సర్కార్ హిందూ మతాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది అంటూ ఆర్ఎస్ఎస్ అధికార పత్రికలోనూ కధనాలు రావడం బట్టి చూస్తే జగన్ మీద ఈ అతి పెద్ద హిందూ సంస్థ అభిప్రాయం ఏంటన్నది తేటతెల్లమవుతోంది.

మంచి రోజులేనా?

జాతీయ రాజకీయాలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. దానికి అనుగుణంగా ఏపీలోనూ పరిణామాలు మారుతున్నాయి. మోడీతో ఢీ కొట్టేందుకు ఒక వైపు జగన్ చూస్తున్నారు. చంద్రబాబుకు కూడా అదే కావల్సింది. ఇక రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అనర్హత పిటిషన్ మీద చర్యలు తీసుకోకపోవడం వెనక కూడా ఆర్ఎస్ఎస్ పెద్దల హస్తం ఉంది అంటున్నారు. ఇవన్నీ చూసిన మీదటనే జగన్ తెగదెంపుల దిశగా ఆలోచిస్తున్నారు. మరో వైపు చంద్రబాబుతో దోస్తీకి ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఇవన్నీ చూస్తూంటే ఒక్కటే అనిపిస్తోంది. రోగి కోరింది, వైద్యుడు ఇచ్చింది ఒక్కటే అని. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాదిలోగా చంద్రబాబు శుభవార్తలే వింటారు అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News