జగన్ కి అప్పుడే స్టార్ట్ అయ్యిందా..?

ఆంధ్ర ప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఓ కార్యక్రమంతో ప్రజల్లో [more]

Update: 2018-12-28 01:30 GMT

ఆంధ్ర ప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఓ కార్యక్రమంతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్మ పోరాట దీక్షలకు తోడు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఏదో ఓ కార్యక్రమంలో బిజీగా ఉంటున్నారు. ఇక ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో 10 రోజుల్లో పూర్తి కానుంది. తర్వాత స్వల్ప విరామం ఇచ్చి ఆయన బస్సెక్కి బస్సుయాత్ర చేయనున్నారు. మిగతా పార్టీలు కూడా ఏదో ఓ కార్యక్రమాలు చేస్తూ ఎన్నికలకు తామూ సిద్ధమే అన్నట్లుగా ఉన్నాయి. అయితే, పలు జాతీయ మీడియా సంస్థ సర్వేలను బట్టి చూస్తే ఇప్పటికైతే ఎన్నికల రేసులో జగన్ ముందున్నారని, చంద్రబాబు వెనుకబడిపోయారనే అంచనాలు వస్తున్నాయి. బయటకు ఎంత లేదని చెబుతున్నా టీడీపీ కూడా చాలా అలెర్ట్ అయ్యింది. ముఖ్యంగా, చంద్రబాబు నాయుడు…. ఈ ఎన్నికలు ఎంత కీలకమైనవో చెప్పి ఎమర్జెన్సీలా భావించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ప్రతిపక్ష నేతగా విఫలమ్యారని…

ఇదే సమయంలో జగన్ పై తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అస్త్రాలు సంధిస్తోంది. దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ జగన్ ను టార్గెట్ చేస్తోంది ఆ పార్టీ. చంద్రబాబుకు ప్రత్యామ్నాయం జగనే అన్న పరిస్థితి ఉండటంతో టీడీపీ ప్రధాన టార్గెట్ జగన్ నే పెట్టుకుంది. ఈ పరిస్థితి ఉండవద్దనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అన్న ఆలోచన ప్రజల్లో కలిగించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు గానూ జగన్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని పదే పదే చెబుతోంది. ఇప్పటికే, ఈ మేరకు రాష్ట్రంలో మౌత్ పబ్లిసిటీ మొదలైంది. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం చెబుతుండటం జగన్ కి నష్టం జరిగేలా ఉంది. ప్రధానంగా జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని, పోరాడటం లేదని జగన్ ఈ రెండు పార్టీలూ పదే పదే టార్గెట్ చేస్తున్నాయి. ఇక, ఇప్పుడు టీడీపీతో కలిసిన కాంగ్రెస్ కూడా ఈ వాదనను వినిపిస్తోంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతగా జగన్ ఫెయిల్ అయ్యారని వ్యాఖ్యానించారు. అంటే, ప్రతిపక్ష నేతగానే ఫెయిల్ అయిన జగన్ కి అధికారం ఇస్తే రాష్ట్రానికే నష్టం అనే భావన ప్రజల్లో రావాలనేది టీడీపీ ప్లాన్ గా కనిపిస్తోంది. నష్టమైనా, కష్టమైనా చంద్రబాబుకే ఓటేయాలని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడమే ఇందుకు ఉదాహరణ.

జగన్ వారితో కుమ్మక్కయారు అంటూ…

ఇక, ఇప్పటికే జగన్.. బీజేపీతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఎలాగూ చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో కొందరు ద్వితియ శ్రేణీ వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అయితే, చంద్రబాబు లానే జగన్ కేవలం ఓ ట్వీట్ చేసి టీఆర్ఎస్ కు అభినందనలు తెలిపారు కానీ ఎక్కడా కేసీఆర్ తో కలిసినట్లు, కలుస్తున్నట్లు వ్యాఖ్యానించలేదు. అయితే, వైసీపీ సంబరాలు చేసుకోవడం ప్రజల్లోకి వెళ్లింది. ఇప్పుడు దీనిని చంద్రబాబు తరచూ హైలెట్ చేస్తున్నారు. కేసీఆర్ పై ఏపీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత జగన్ పైకి మళ్లాలనేది ఓ ప్లాన్. ఇక, అసదుద్దిన్ జగన్ తరపున ప్రచారం చేసినా ఇదే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తుంది. ఇక, టీడీపీ చేతిలో ఉన్న మరో బ్రహ్మాస్త్రం ‘అభివృద్ధి ఆగిపోతుంది’ అనే వాదన. సహజంగా ఈ వాదనకు ప్రజలు ఇట్టే ఏకీభవిస్తారు. అయితే, తాను అధికారంలోకి వచ్చినా అభివృద్ధి ఇంతకు మించి జరుగుతుందని జగన్ చెప్పలేకపోతున్నారు. కేవలం ఆయన సంక్షేమాన్నే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మొత్తానికి, ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ జగన్ ని టార్గెట్ చేసేందుకు టీడీపీ పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తోంది. మరి, జగన్ టీడీపీ వ్యూహాలను ఏ విధంగా తిప్పికొడతారో చూడాలి.

Tags:    

Similar News