సాగు-బాగుల జ‌గ‌న్ బ‌డ్జెట్‌

రాజ‌న్య రాజ్యం తీసుకురావ‌డమే ల‌క్ష్యమ‌ని సీఎంగా ప్రమాణం చేయ‌క‌మునుపే సంక‌ల్పం చెప్పుకొన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న పాల‌న‌లో రాష్ట్ర క్షేమానికి, అభివృద్ధి-అంద‌రికీ సంక్షేమానికి పెద్ద పీట [more]

Update: 2019-07-12 10:33 GMT

రాజ‌న్య రాజ్యం తీసుకురావ‌డమే ల‌క్ష్యమ‌ని సీఎంగా ప్రమాణం చేయ‌క‌మునుపే సంక‌ల్పం చెప్పుకొన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న పాల‌న‌లో రాష్ట్ర క్షేమానికి, అభివృద్ధి-అంద‌రికీ సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికి 40 రోజుల పాల‌న‌లో అనేక మెరుపులు మెరిపించిన జ‌గ‌న్ ప్రభుత్వం.. తాజాగా ప్రవేశ పెట్టిన 2019-20 వార్షిక సంవ‌త్సరానికి సంబంధించిన రాష్ట్ర బ‌డ్జెట్‌లోనూ దీనినే కొన‌సాగించింది. సాగు-బాగుల బ‌డ్జెట్‌గా రూపొందించిన తాజా బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి శుక్ర‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టారు. ఈ బ‌డ్జెట్ స‌మ‌గ్ర స్వ‌రూపాన్ని ప‌రిశీలిస్తే.. సంక్షేమం-అభివృద్ధి-రాజ‌న్య రాజ్య స్థాప‌నే లక్ష్యంగా వైసీపీ ప్ర‌భుత్వం అడుగులు వేసిన‌ట్టు స్పష్టంగా క‌నిపిస్తోంది.

అభివృద్ధి ఫలాలు అందేలా….

బడ్జెట్‌ అంచనా రూ.2,27,974.99 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.1,80,475 కోట్లు అని మంత్రి బుగ్గన వెల్లడించారు. మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు కాగా.. వడ్డీ చెల్లింపుల కోసం రూ.8,994 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే తాజా బడ్జెట్‌లో 19.32 శాతం పెరుగుదల ఉందని చెప్పారు. రెవెన్యూ లోటు రూ.1778.52, ద్రవ్యలోటు సుమారు రూ.35,260 కోట్లు, జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు సుమారు 3.3 శాతం ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన రెండంకెల వృద్ధిరేటుపై సమీక్షిస్తున్నామని బుగ్గన తెలిపారు. రెండంకెల వృద్ధి ఉంటే ప్రజలు ఇంకా పేదరికంలో ఎందుకున్నారో పరిశీలిస్తున్నామని, వారికి అభివృద్ధి ఫ‌లాలు అందేలా చ‌ర్యలు తీసుకునేందుకు బ‌డ్జెట్ కేటాయింపులు ఉన్నాయ‌ని వివ‌రించారు.

మేనిఫోస్టోనే నియమావళిగా….

‘‘నేను సత్యానికి తప్ప దేనికీ లొంగి ఉండను. సత్యం కాక నేను సేవించ వలసిన ఏ దేవుడూ లేడు’’ అంటూ గాంధీజీ చెప్పిన మాటలను మంత్రి బుగ్గన త‌న బ‌డ్జెట్ ప్రసంగంలో ఉటంకించారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమన్నారు. ‘‘ప్రజలు కోరిన పాలన కోసం సీఎం కృషి చేస్తున్నారు. నమ్మకం, విశ్వసనీయతే ప్రాతిపదికగా ప్రజలు తీర్పు ఇచ్చారు. విలువలతో కూడిన రాజకీయాలను పునరుద్ధరించేందుకు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. పార్టీ మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని సీఎం జగన్‌ చెప్పారు. మా ప్రభుత్వానికి మేనిఫెస్టోనే ప్రధాన నియమావళిగా ఉంటుంది’’ అని బుగ్గన స్ప‌ష్టం చేశారు.

బడ్జెట్‌లో బుగ్గన ఏమ‌న్నారంటే..

బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన రామాయణంలోని ఓ ఘట్టాన్ని గుర్తు చేశారు. ఇంద్రజిత్‌ అస్త్రానికి కుప్పకూలిన లక్ష్మణుడిని మూర్ఛ నుంచి లేపేందుకు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చినట్లు దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఏపీ ప్రజల కోసం ఆరోగ్యశ్రీ తెచ్చారని అన్నారు. ప్రతి పేద కుటుంబం కార్పొరేట్‌ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం పొందే లక్ష్యంతో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ తెచ్చారు. ప్రజలు పేదరికంలోకి పడిపోవడానికి వైద్య ఖర్చులు కూడా కారణమని ఆయన భావించారు. ఆ పథకాలను మా ప్రభుత్వంలో మరింత వెలుగులీనేలా చేస్తామని చెబుతున్నాం. ఇందులో భాగంగా ఆరోగ్య శ్రీని ఈ కింది విధంగా విస్తరిస్తున్నాం.

అంద‌రికీ ఆరోగ్య ఫ‌లాలు..

వార్షిక ఆదాయం రూ.5లక్షలు లోపు ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. వైద్య ఖర్చులు రూ.1000 అంతకు మించిన అన్ని కేసులు చికిత్స వ్యయంపై పరిమితి లేకుండా అందరికీ వైద్యం అందిస్తాం. బెంగళూరు, చెన్నైలలోని ప్రముఖ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు పొందవచ్చు. ఇందుకోసం ఆయా ఆస్పత్రుల జాబితాను చేరుస్తాం. ఇందు కోసం రూ.1,740కోట్లు కేటాయిస్తాం అని బుగ్గ‌న వివ‌రించారు.

ఆర్థిక రంగ సేవల కోసం రూ.86,105.63కోట్లు.

వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677.08కోట్లు. గ్రామీణాభివృద్ధికి రూ.29,329.98కోట్లు. జలవనరుల కోసం రూ.13,139.05కోట్లు. తాగునీరు, వరద నియంత్రణ కింద రూ.13,139.05కోట్లు. విద్యుత్‌శాఖకు రూ.6,861.03కోట్లు. ఖనిజాభివృద్ధి శాఖకు రూ.3,986.05కోట్లు కేటాయించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.15,000కోట్లు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.4988.52కోట్లు. బీసీ సబ్‌ ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.15,061.64కోట్లు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.1500కోట్లు. మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077కోట్లు. వైఎస్‌ఆర్‌ పాఠశాలల నిర్వహణ గ్రాంటు రూ.160కోట్లు అక్షయపాత్ర ఫౌండేషన్‌ వంటశాలల నిర్మాణానికి రూ.100కోట్లు కేటాయించ‌డం ద్వారా 'అమ్మ ఒడి' కార్య‌క్ర‌మానికి పెద్ద‌పీట వేశారు.

అసంఘ‌టిత రంగానికి పెద్ద‌పీట‌

రాష్ట్రంలోని అసంఘ‌టిత రంగంలోని కార్మికుల కోసం జ‌గ‌న్ బ‌డ్జెట్ పెద్ద‌పీట వేసింది. చేనేత కార్మికులకు వైఎస్‌ఆర్‌ భరోసా కింద రూ.200కోట్లు. వైఎస్‌ఆర్‌ గ్రాంట్స్‌ కింద మత సంస్థలకు సహాయం రూ.234కోట్లు కేటాయించింది. ఆటో డ్రైవర్ల ఆర్థికసాయం కింద రూ.400కోట్లు కేటాయిస్తున్న‌ట్టు బ‌డ్జెట్‌లో స్ప‌ష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ గృహ పథకానికి రూ.5వేల కోట్లు ఇచ్చారు.

ప్ర‌తి వ‌ర్గానికీ న్యాయం..

స‌మాజంలోని ప్ర‌తి సామాజిక వ‌ర్గం బాగుంటేనే, ఆర్థికంగా నిల‌దొక్కుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాకారం అవుతుంద‌ని చెప్పిన మంత్రి బుగ్గ‌న.. ఆ దిశ‌గానే అన్ని వ‌ర్గాల‌కు కేటాయింపులు చేశారు. కాపు సామాజిక వ‌ర్గానికి రూ.2 వేల కోట్లు, న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100కోట్లు. న్యాయవాదుల ఆర్థిక సాయం కింద రూ.10కోట్లు. బీసీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణ కానుక కింద రూ.300కోట్లు. ఎస్సీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణ కానుక కింద రూ.200కోట్లు. ఎస్టీలకు వైఎస్‌ఆర్‌ గిరి పుత్రిక కల్యాణ కానుక కింద రూ.45కోట్లు. మైనార్టీలకు వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా కింద రూ.100కోట్లు. బ్రాహ్మణ కార్పొరేష‌న్‌కురూ.100 కోట్లు కేటాయించారు. గ‌తంతో పోలిస్తే.. ఈ కేటాయింపులు నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉండడం గ‌మ‌నార్హం.

మ‌రికొన్ని..

పౌరసరఫరాలశాఖకు బియ్యం రాయితీ కింద రూ.3000కోట్లు .బియ్యం తదితర సరకుల సరఫరాకు రూ.750కోట్లు. పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఆర్థిక సాయం కింద రూ.384కోట్లు కేటాయించారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న గ్రామ సచివాలయాల కోసం రూ.700కోట్లు. మున్సిపల్‌ వార్డు వాలంటీర్ల కోసం రూ.280కోట్లు. మున్సిపల్‌ వార్డు సచివాలయాల కోసం రూ.180కోట్లు కేటాయించారు. ఏపీఎస్‌ ఆర్టీసీకి సహాయార్థం రూ.1000కోట్లు. రాయితీల కోసం రూ.500కోట్లు. ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.260కోట్లు బ‌డ్జెట్ లో నిధులు కేటాయించారు. రైతు సంక్షేమం కింద‌.. ధరల స్థిరీకరణ నిధికి రూ.3000కోట్లు. ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002కోట్లు . వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి రూ.8,550కోట్లు. రైతులకు ఉచిత విద్యుత్‌కు రూ.4,525కోట్లు ఇచ్చారు. మొత్తంగా జ‌గ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ అన్ని వ‌ర్గాల‌కు, అన్ని వృత్తుల వారికి సంక్షేమ ఫ‌లాల‌ను అందించేదిశ‌గానే సాగ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News