మంత్రికి మళ్లీ దడ మొదలయిందా?

వరసగా మంత్రులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఉప ఎన్నికల్లో ఇటీవల వరకూ టీఆర్ఎస్ కు ఓటమి అనేది తెలియదు. అయితే దుబ్బాక నుంచి ఓటమి అనేది మొదలయింది. [more]

Update: 2020-12-17 09:30 GMT

వరసగా మంత్రులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఉప ఎన్నికల్లో ఇటీవల వరకూ టీఆర్ఎస్ కు ఓటమి అనేది తెలియదు. అయితే దుబ్బాక నుంచి ఓటమి అనేది మొదలయింది. దీంతో మంత్రులు ఉప ఎన్నిక అంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మంత్రి జగదీశ్వర్ రెడ్డికి దడ ప్రారంభమయింది. ఆయన జిల్లాలోని నాగార్జున సాగర్ కు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికకూ జగదీష్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో…..

మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం నుంచి ఆయనతో కలసి నడిచిన నేత. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లుగా జగదీష్ రెడ్డి కేసీఆర్ మంత్రివర్గంలో ఉంటున్నారు. అదీ ఆయనకు కేసీఆర్ వద్ద ఉన్న పలుకుబడి. కొంతకాలం క్రితం జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయం సాధించి పెట్టి జగదీష్ రెడ్డి మంచి మార్కులు కొట్టేశారు. కేసీఆర్ భుజం తట్టడంతో మురిసిపోయారు.

గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం…..

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయం తన ఖాతాలోనే జగదీష్ రెడ్డి వేసుకున్నారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో గులాబీ జెండా ఎగురువేయడంతో ఇక తనకు తిరుగులేదని జగదీష్ రెడ్డి భావించారు. అయితే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు జగదీష్ రెడ్డి పై ఉన్న నమ్మకాన్ని తారు మారు చేసిందంటున్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా జగదీష్ రెడ్డి కి సరూర్ నగర్, ఎల్పీనగర్ నియోజకవర్గాలను అప్పగించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ చాప చుట్టేసింది. బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది.

ఇప్పుడు మరో ఉప ఎన్నిక…..

దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అంటేనే జగదీష్ రెడ్డి భయపడిపోతున్నారు. జిల్లాకు చెందిన మంత్రి కావడంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బాధ్యతను ఆయనకే ఇస్తారు. సహజంగా ఇది జరిగేదే. అయితే జానారెడ్డి బలమైన నేత కావడంతో ఇక్కడ గెలుపు కష్టమేనన్నది టీఆర్ఎస్ నేతల అంచనా. అందుకే జగదీష్ రెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అంటేనే హడలి పోతున్నారట. అభ్యర్థులు డిసైడ్ అయ్యేంత వరకూ ఆయనకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నిద్రపట్టనివ్వడం లేదు.

Tags:    

Similar News