జెసి నోటికి అడ్డుకట్ట ఎలా …?

పార్టీకి మేలు చేయకపోతే పోయింది నష్టం చేసే వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో సొంత వారినుంచి ఎదురైతే ఏ పార్టీకి అయినా ఇబ్బందే. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని [more]

Update: 2019-02-06 06:30 GMT

పార్టీకి మేలు చేయకపోతే పోయింది నష్టం చేసే వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో సొంత వారినుంచి ఎదురైతే ఏ పార్టీకి అయినా ఇబ్బందే. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అనంతపురం ఎంపి జెసి దివాకర రెడ్డి రూపంలో వెంటాడుతుంది. వయస్సు మీద పడటంతో పాటు తనను ఎవ్వరు ఏమి అనలేరన్న ధీమాతో జెసి చేస్తున్న కామెంట్స్ కొంపముంచుతున్నాయి. గతం నుంచి ప్రస్తుతం వరకు జెసి ఏదైనా పార్టీ వేదికపై గళం విప్పితే టిడిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా మాగంటి బాబు నేతృత్వంలో ఢిల్లీలో టిడిపి ఎంపిలు చేపట్టిన ధర్నాలో జెసి చేసిన కామెంట్స్ హైలెట్ అయ్యి పార్లమెంట్ సభ్యుల ఆందోళన పక్కకు పోయింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రైల్వే జోన్ ఎందుకు వృధా ?

విశాఖలో రైల్వే జోన్ కోసం అన్ని పార్టీలు కేంద్రంపై వత్తిడి తెస్తున్నాయి. టిడిపి అధినేత సైతం ప్రతి సందర్భంలో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిన లిస్ట్ లో మొదట చదివేది రైల్వే జోన్ అన్నది తెలిసిందే. ఇదే అంశంపై గతంలో ఎపి భవన్ లో జెసి తో సహా కొందరు ఎంపిలు సీఎం రమేష్ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేసే సందర్భంలో చేసిన వ్యాఖ్యలు టిడిపికి మైనస్ మార్కులు వేశాయి. ఇప్పుడూ అదే జరిగింది. మాగంటి దీక్ష ను జెసి తన వ్యాఖ్యలతో తీసిపారేయడంతో ఏమి చేయాలో అర్ధం కానీ స్థితి లో టిడిపి డిఫెన్స్ లో పడింది. సొంత పార్టీ నాయకుడే శల్య సారధ్యం వహిస్తే యుద్ధం ఎలా చేసేది అన్న రీతిలో ఢీలా పడుతున్నారు తమ్ముళ్ళు.

చంద్రబాబును తీసి పారేస్తున్నారే ..?

హోదా కోసం చంద్రబాబు రాహుల్ గాంధీ వెంట పడ్డారని జెసి మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రాహుల్ ప్రధానిగా పనికిరారని సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని దుయ్యబట్టి కాంగ్రెస్ తో తమ అధినేత సాగుతున్న తీరును తిట్టిపోశారు జెసి. ఈ వ్యాఖ్యలు పసుపు పార్టీకి అంతా ఇంతా డ్యామేజ్ కాదు. అధినేత నుంచి ఎవ్వరిని నేను లెక్క చెయ్యను అనే రీతిలో దివాకర రెడ్డి మాట్లాడుతున్న మాటలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతుంటే నిస్సహాయుల పాత్రలో తమ్ముళ్ళు ఉండిపోవటం విచిత్రం. తాజాగా దుమారం చేసిన జెసి ఎన్నికల లోపు ఇంకెన్ని తలనొప్పులు సొంత పార్టీకి తెస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News