సరిలేరు నీకెవ్వరూ

దేశ రాజధాని ఢిల్లీ కోటకి క్రేజీవాల్ మరోసారి బాద్ షా కావడం కాకతాళీయం గా జరిగింది కాదు. దీనివెనుక ఆయన టీం పరిశ్రమ ఎంతో వుంది. అఖండ [more]

Update: 2020-02-11 05:00 GMT

దేశ రాజధాని ఢిల్లీ కోటకి క్రేజీవాల్ మరోసారి బాద్ షా కావడం కాకతాళీయం గా జరిగింది కాదు. దీనివెనుక ఆయన టీం పరిశ్రమ ఎంతో వుంది. అఖండ భారత్ అంతా విస్తరించిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఎదిరించి చక్కగా ఆరెండు పార్టీలను చీపురుతో ఊడ్చడానికి కేజ్రీవాల్ పరిపాలనే అస్త్రంగా మార్చుకున్నారు. ప్రజలకు అవసరమైన విద్యా, వైద్యం, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అందించడంలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది ఆప్ సర్కార్. ప్రజలకు ఏది అవసరమో అది అందించి రెండు రాజకీయ దిగ్గజాలను ఎదురించి తన సత్తా చాటింది ఆప్. క్రేజ్రీవాల్ విజయసూత్రం ప్రాంతీయ పార్టీలకే కాదు జాతీయ పార్టీలకు ఆదర్శమే అని చెప్పొచ్చు.

విద్య కోసం 25 శాతం బడ్జెట్ …

విద్య హక్కు రాజ్యాంగం ప్రసాదించినా, నేడు దేశంలో ఇది పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. కేరళ వంటి రాష్ట్రాలు తప్ప ప్రభుత్వ విద్యపై సీరియస్ గా దృష్టి పెట్టిన ప్రభుత్వాలు లేవనే చెప్పాలి. ప్రయివేట్ విద్య ను ప్రవేశపెట్టి భారీ వ్యాపారాలను ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండే మంత్రులు, ఎమ్యెల్యేలు స్వయంగా నిర్వహిస్తూ ఉండటంతో నిబంధనలు ఉల్లంఘించే విద్యా సంస్థలపై చర్యలు తీసుకునే ధైర్యం యంత్రాంగం చేయలేని దుస్థితి కొనసాగుతుంది. ప్రాధమిక విద్య నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు అంతా చదువు కొనడమే కానీ చదువు కోవడం అనేది లేకుండా పోయింది. ఈ దశలో దేశం గర్వపడే స్థాయిలో ఆప్ సర్కార్ 25 శాతం నిధులను ప్రభుత్వ విద్యా అభివృద్ధికి ఖర్చు చేస్తూ ఆదర్శంగా నిలిచింది. ఢిల్లీ లో విద్యా సంస్థల అభివృద్ధికి పాఠశాల కమిటీలను విద్యార్థుల తల్లితండ్రులతో ఏర్పాటు చేసి వాటిని తీర్చిదిద్దే బాధ్యత వారికే అప్పగించి మెరుగైన విద్యా సంస్కరణలకు విదేశాలకు సైతం పాఠశాల కమిటీ సభ్యులు పర్యటించే అవకాశం ప్రభుత్వ ఖర్చులతోనే కల్పించారు. ఇక టాయిలెట్ ల నుంచి విద్యాసంస్థల్లో ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయి కి చేర్చగలిగింది ఆప్.

విజయంలో అనేక అంశాలు …

ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి, పేదవర్గాలకు విద్యా, వైద్యమే పెనుభారం, అలాగే నాణ్యమైన విద్యుత్, తాగునీరు అత్యంత ప్రాధాన్యం గలవి ఇవన్నీ లభిస్తే వారికి మిగిలిన రాజకీయాలతో సంబంధం లేనట్లే. అదీ గాక ఢిల్లీ ఓటర్లు లో అత్యధికులు అక్షరాస్యులు కావడంతో వారికి తమకు పనికొచ్చే పార్టీ ఏమిటో స్పష్టంగా గుర్తించే అవకాశం ఏర్పడింది. అందుకే వారు తమకు సన్నిహితంగా ఉండే పాలకులే కావాలని డిసైడ్ అయిపోయారు. దీనికి తోడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న సంప్రదాయ ఓటర్లు ఆప్ వైపు చూశారు. దీనికి తోడు పౌరసత్వ సవరణ బిల్లు వంటి అంశాలతో ముస్లిం లు కి ప్రత్యామ్నాయం ఆప్ గా కనిపించింది. ఇక బిజెపి సంప్రదాయ ఓటర్లు ఢిల్లీ వరకు తమకు ఆప్ నే బెటర్ అనే భావన కమలానికి దెబ్బకొట్టింది.

సమఉజ్జీ ఎక్కడ …

దేశ రాజకీయాల్లో మోడీని ఢీ కొట్టే మొనగాడు ఇంకా రాలేదు. అదే రీతిలో ఢిల్లీ రాజకీయాలకు వస్తే కేజ్రీ వాల్ కు సరితూగే నేత అటు కాషాయ దళం లోను ఇటు హస్తం పార్టీలోనూ లేకుండా పోయారు. ఇది కూడా ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఢిల్లీ ఓటర్లు కూడా తమ ఓట్లను మూడు విధాలుగా విభజిస్తూ పార్టీలతో ఆడుకుంటున్నారు. పార్లమెంట్ కి ఒకలా, అసెంబ్లీకి మరోలా, కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకోలా వారి ఓటింగ్ సరళి సాగుతుంది. బిజెపికి పార్లమెంట్ కి అసెంబ్లీకి ఆప్ కి ఓటర్లు డిసైడ్ అయిపోయినట్లు పోలింగ్ కి ముందే బయటపడిపోయింది. దాంతోబాటు కేజ్రీవాల్ పై తమకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని ఢిల్లీ ఓటరు మారోసారి చాటిచెప్పే సరికొత్త తీర్పు మాత్రం కమలానికి చెంపపెట్టు అనే చెప్పాలి. ఒకే ఒక్కడుగా దిగ్గజ పార్టీల యంత్రాంగాన్ని ఎదిరించి నిలిచిన కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీ లోనే కాదు దేశంలోనే హీరో అయిపోయారంటే ఆయన పార్టీ జనం సమస్యలపై పనిచేసిన తీరే అద్దంపడుతోంది. అందుకే జాతీయ మీడియా ఏకగ్రీవంగా ముందే ఆప్ విజయాన్ని ఖరారు చేసింది మరి.

Tags:    

Similar News