రాజధాని రైతుల ఉద్యమం @ 300

అమరావతి రైతులు తమ ఉద్యమం ప్రారంభించి 300 రోజులవుతుంది. అమరావతిలో రాజధానిని కొనసాగించాలంటూ రైతులు ఉద్యమం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులను చేసేందుకే మొగ్గు [more]

Update: 2020-10-12 00:30 GMT

అమరావతి రైతులు తమ ఉద్యమం ప్రారంభించి 300 రోజులవుతుంది. అమరావతిలో రాజధానిని కొనసాగించాలంటూ రైతులు ఉద్యమం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులను చేసేందుకే మొగ్గు చూపుతోంది. రైతులు తమ ప్రాంతాల్లో ఉద్యమాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. రాజధాని రైతుల ఉద్యమానికి 300 రోజులవుతుండటంతో నేడు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

జనవరి నెలలో…..

ఈ ఏడాది జనవరి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని రోజూ నిరసనలు తెలయజేస్తున్నారు. తమకు, గత ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాన్ని తుంగలో తొక్కి జగన్ ప్రభుత్వం అమరావతిని చంపేసేందుకు కుట్ర పన్నిందని రైతులు ఆరోపిస్తున్నారు.

వివిధ రూపాల్లో……

గత మూడు వందల రోజులుగా రాజధాని అమరావతి రైతులు వివిధ రూపాల్లో నిరసనలు వ్కక్తం చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. తమ విజ్ఞప్తులను వారి ముందు ఉంచారు. మరోవైపు న్యాయపోరాటానికి కూడా దిగారు. రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు పై రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం స్టే ఉత్తర్వులు ఉండటంతో విశాఖకు పరిపాలన రాజధానిని ప్రభుత్వం తరలించలేకపోయింది.

నేడు ప్రత్యేక కార్యక్రమాలు…

ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సయితం అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొననున్నారు. ఇందుకోసమే ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు రైతులతో మాట్లాడనున్నారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా నేడు రైతుల ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించనున్నాయి. తాము చేస్తున్న ఉద్యమం మూడు వందల రోజులకు చేరుకున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా, తన పని తాను చేసుకువెళుతుందని రైతులు అంటున్నారు.తాము న్యాయపరంగానే పోరాడి అమరావతిని రక్షించుకుంటామని రైతులు చెబుతున్నారు.

Tags:    

Similar News