విశాఖ ఉక్కుని ఇక మరచిపోవాల్సిందే… ?

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు రైమింగ్ బాగుంది. నాడు టైమ్ కూడా బాగుంది. అందుకే ఐరన్ లేడీ ఇందిరా గాంధీ విశాఖకు నో అని మొదట్లో అన్నా [more]

Update: 2021-09-06 00:30 GMT

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు రైమింగ్ బాగుంది. నాడు టైమ్ కూడా బాగుంది. అందుకే ఐరన్ లేడీ ఇందిరా గాంధీ విశాఖకు నో అని మొదట్లో అన్నా కూడా తరువాత మనసు మార్చుకున్ స్టీల్ ప్లాంట్ ని విశాఖకు మంజూరు చేశారు. ఆమె స్వయంగా 1971లో విశాఖ వచ్చి మరీ శంకుస్థాపన చేశారు. అయితే నాడు కూడా ముప్పయి మందికి పైగా ఆత్మ బలిదానం చేసుకున్నారు. అయితే ఏ ఉద్యమం అయినా ఫలితం సాధిస్తే సార్ధకం అయినట్లే. ఆ విధంగా చూస్తే విశాఖలో స్టీల్ ప్లాంట్ రావడానికి ఇందిరాగాంధీ కారణం. ఆమె 1980లో మళ్లీ ప్రధాని అయ్యాక ఉక్కుకు ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు మొదలయ్యాయి. 1992లో మరో కాంగ్రెస్ ప్రధాని పీవీ నరసింహారావు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. 2008లో మరో కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉక్కుకు ఆర్ధికంగా పెద్ద ఎత్తున సాయం చేశారు. ఇలా కాంగ్రెస్ ఏలుబడిలో విశాఖ ఉక్కు బాగా నిలదొక్కుకుంది.

గత ఆరేళ్ళుగా…?

ఇక మోడీ ప్రధాని అయ్యాక 2015 నుంచే విశాఖ ఉక్కు మీద కన్ను ఉందని ప్రచారం ఉంది. సరిగా అప్పట్లోనే విశాఖ ఉక్కు నష్టాల బాట పట్టింది. దాంతో దాన్ని తెగనమ్మాలని ఒక నిర్ణయాన్ని సూత్రప్రాయంగా తెసుకున్నారని చెబుతారు. ఇన్నాళ్ళ తరువాత విశాఖ ఉక్కు మీద వేటు వేయడానికి ముహూర్తం కుదిరింది అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ ఉక్కు బలి పీఠం మీద ఇపుడు ఉంది. దానికి ముందూ వెనకా లాంచనాలు అన్నీ పూర్తి అయ్యాయని తెలుస్తోంది. విశాఖ ఉక్కు మాత్రమే కాదు నష్టాలు, లాభాలు అని చూడకుండా నిర్ణయించుకున్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలన్నది మోడీ సర్కార్ పాలసీగా పెట్టుకుంది అని అంటారు.

ఇక దిక్కెవ్వరు ..?

విశాఖ ఉక్కు అమ్మేయడానికి అంతా రెడీగా ఉంది. విశాఖ ఉక్కు అమ్మకం విషయంలో న్యాయపరమైన వివాదాలు అవరోధాలు రాకుండా చూసేందుకు న్యాయ సలహాదారులు కావాలంటూ తాజాగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇక విశాఖ ఉక్కు కధ క్లైమాక్స్ కి చేరుకుంది అని అంతా భావిస్తున్నారు. దీనికి ముందు గత నెలలో ఉక్కు మంత్రిత్వ శాఖ, పెట్టుబడుల విభాగం, విశాఖ ఉక్కు అధికారులతో కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించిన రూట్ మ్యాప్ ని కూడా తయారు చేశారు అని చెబుతున్నారు. ఉక్కుని ప్రైవేటీకరణ పనులను పూర్తి చేయడానికి కొత్త ఉక్కు మంత్రి వచ్చారు. పొరుగున ఒడిషాలో ఉన్న ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద ఆ నింద పడకుండా ఆయన్ని తప్పించారు అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానివ్వకుండా కాపాడే దిక్కు ఎవరు అన్నదే కార్మికుల ఆందోళనగా ఉంది.

తుక్కు రాజకీయమే..?

మళ్లీ తుక్కు రాజకీయమే ఉక్కు చుట్టూ అలుముకుంటోంది. అధికార వైసీపీ కేసుల కోసం కేంద్రం వద్ద సాగిలపడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఉక్కుని తెగనమ్మడంలో వైసీపీదే అసలు ఆరాటమని కూడా ఆరోపిస్తోంది. మరో వైపు కేంద్రం మా కర్మాగారం మా ఇష్టమని స్పష్టంగా చెప్పేశాక కూడా ఇలా లోకల్ పార్టీలు రాజకీయం చేయడం వల్ల ఉపయోగం లేకపోగా ప్రైవేటీకరణకు రాచబాట పరచినట్లే అవుతుంది అంటున్నారు. మరో వైపు కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని జగన్ తెసుకువెళ్ళాలన్న డిమాండ్ కూడా ఉంది. అయితే ఇపుడు అంతా అయిపోతున్న వేళ కేంద్రం వద్దకు వెళ్ళినా ఉపయోగం లేదనే అంటున్నారు. ఈ విషయం అటు జగన్ కి చంద్రబాబుకూ కూడా తెలుసు అని అయితే విశాఖ ఉక్కు సెగలను వైసీపీ మీదకు మళ్ళించి చలి కాచుకునే రాజకీయానికే టీడీపీ తెర తీస్తోందని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఈ భూమి మీద ఏ శక్తీ ఆపలేదని మాత్రం అంతా అంటున్నారు.

Tags:    

Similar News