అలా హామీలిస్తూ పోతే మేమేం కావాలి?

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. దాదాపు పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలు పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల [more]

Update: 2020-09-20 12:30 GMT

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. దాదాపు పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలు పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల కోసం ఎంతో మంది పార్టీలోని వారే కాచుక్కూర్చుని ఉన్నారు. 2019 ఎన్నికల్లో టిక్కెట్లు పొందక పోయినా పార్టీ కోసం అంతా తామే అయి పనిచేసిన వారు వైసీపీలో అనేక మంది ఉన్నారు. జగన్ సుదీర్ఘ పాదయాత్రను విజయవంతం చేసిన వారు కూడా పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే…..

కానీ వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ ఐడియాలజీ మారింది. పార్టీ నేతల కన్నా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం కూడా అనేక మందిలో అసంతృప్తిని రేకెత్తించింది. అసెంబ్లీ టిక్కెట్ రాకపోయినా శాసనమండలిలో అడుగుపెడదామనుకుంటే దాన్ని తీసేస్తే ఎలా? అని కొందరు మదనపడిపోయారు.

మండలి విషయంలోనూ…..

మొన్న శాసనమండలికి డొక్కా మాణిక్యవరప్రసాద్, పండుల రవీంద్ర బాబు నియామకాలు కూడా పార్టీ నేతల్లో అసంతృప్తిని రేపాయి. డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు కాబట్టి తిరిగి ఆయనకు టిక్కెట్ ఇచ్చినా పరవాలేదు కాని, పండుల రవీంద్ర బాబు ఎన్నికలకు ముందు వచ్చి చేరితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ ను నేరుగా ప్రశ్నించలేకపోయినప్పటికీ ముఖ్యనేతలను బాగానే కొందరు కడిగేసినట్లు సమాచారం.

పద్ధతి పాడూ లేకుండా?

ఇక రాజ్యసభ ఎన్నికల విషయంలోనూ అదే జరుగుతుందన్న అనుమానాలున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన బీద మస్తాన్ రావుకు రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారన్న ప్రచారం ఉంది. అలాగే ఇటీవల వైసీపీలో చేరిన చెలమలశెట్టి సునీల్ కు కూడా రాజ్యసభ హామీ లభించిందంటున్నారు. మొన్ననే రాష్ట్రంతో సంబంధం లేని పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చారు. మండలి రద్దు చేయడంతో రెండుసీట్లు మాజీ మంత్రులకే ఇవ్వాల్సి వచ్చింది. ఇలా వైసీపీలో పదవుల భర్తీలో ఒక పద్ధతి పాడు లేకపోతే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News