అమరావతి అసలు గుట్టు ఇది కాదా?

అమరావతి 29 గ్రామాల్లో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ అన్నది చాలా చిన్న విషయం. మొత్తం సమీకరించి 33 వేల ఎకరాల్లో ఈ 29 గ్రామాల్లో ఈ పద్దులో [more]

Update: 2020-12-27 05:00 GMT

అమరావతి 29 గ్రామాల్లో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ అన్నది చాలా చిన్న విషయం. మొత్తం సమీకరించి 33 వేల ఎకరాల్లో ఈ 29 గ్రామాల్లో ఈ పద్దులో జమ చేయగలిగింది 4 వేల ఎకరాలకు మించదు. అది పెద్ద లెక్కలోనిది కాదు. అసలు లెక్క అమరావతి పరిధి బయట ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పరిధి ముందే తెలిసి, ఆ పరిధి బయట లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు లావాదేవీలు గుర్తున్నాయా!? సరిగ్గా అదే జరిగింది ఇక్కడ.

ఔటర్ రింగ్ రోడ్డు అంచున…

అమరావతి ప్రకటనకు ముందే అమరావతి ORR అంచున భూముల భారీ కొనుగోలు జరిగింది. చెన్నయ్-కలకత్తా జాతీయ రహదారికి రెండువైపులా కనకదుర్గ వారధి నుండి కాకాని వరకు కొత్తగా వచ్చిన ఆకాశహార్మ్యాలు చూస్తే అర్ధం అవుతుంది. అయితే అది తప్పు అనగలమే కానీ నేరం అనలేము. పెట్టుబడి లక్ష్యమే లాభం. వ్యాపార లక్షణమే ముందస్తు సమాచారం తెలుసుకొని లాభాల కోసం పెట్టుబడి పెట్టుకోవడం.

భూములు అమ్మిందెవరు? కొన్నదెవరు?

ఇక రెండో అంశం, అమరావతిలో 5 ఎకరాల లోపు భూములిచ్చిన వారే ఎక్కువ అంటున్నారు. మొత్తం 29 గ్రామాల్లో 29 వేలమంది రైతులు 33 వేల ఎకరాల భూమి ఇచ్చారు. మరి అక్కడ భూములు అమ్మిన వారెవరు? కొన్నవారెవరు? ఆ భూములు ఏమయ్యాయి!? 33 వేల ఎకరాలు 29 వేలమంది రైతులు ఇచ్చి ఉంటే అక్కడ భూములు కొన్నవారెవరు? వారుకొన్న భూములు ఎక్కడికి పోయాయి? వాటిని సమీకరణకు ఇవ్వలేదా!? అసలు అక్కడ రైతులు తమ భూములు అమ్ముకోలేదా!? బయట ప్రాంతాల వారు అక్కడ భూములు కొనలేదా? భూములు కొనడం, అమ్మడం నేరం కాదు కానీ, ఈ క్రయ, విక్రయాల లెక్కలేవీ? ఐదు ఎకరాలు ఇచ్చినవారే ఎక్కువ అనే లెక్క ఈ మతలబులోనిది కాదా!? ఈ లెక్కలు రహస్యంగా ఉంచినంతకాలం, ఈ గుప్పెట మూసి ఉంచినంతకాలం అమరావతి చిక్కుముడి ఎలా వీడుతుంది!?

ఏడాదిగా అమ్మిన సొమ్ముతో…..

ఈ లెక్కలు అమరావతిలోని 29 గ్రామాల రైతులకు తెలియదా? ఒక్కో రైతు తమ భూమిలో ఎంత అమ్ముకున్నారో, ఎంత సమీకరణకు ఇచ్చారో, అమ్మిన భూమి ఎవరి పేరున సమీకరణకు ఇచ్చారో తెలియదా?! తమ భూముల్లో కొంత భాగం అమ్ముకోగా వచ్చిన సొమ్ముతో ఈ యేడాదిగా తాము ఏం చేసుకున్నారో తెలియదా?తమ భూములు కొన్నవారు ఈ యేడాదిగా ఏం చేస్తున్నారో తెలియదా?

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News