పాపాలు పండుతాయా?

పాపాలు పండడం, కఠిన శిక్షలు పడడం అన్నది రాజకీయ నాయకుల డిక్షనరీలో ఎక్కడా లేని పదం. అది దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గరనుంచి జరుగుఅతున్న తంతే. అయితే [more]

Update: 2019-12-28 06:30 GMT

పాపాలు పండడం, కఠిన శిక్షలు పడడం అన్నది రాజకీయ నాయకుల డిక్షనరీలో ఎక్కడా లేని పదం. అది దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గరనుంచి జరుగుఅతున్న తంతే. అయితే అవినీతిపరుల పాపాలు పండుతాయని ఘాటు వ్యాఖ్యలు మంత్రి పేర్ని నాని చేస్తున్నారు. ఎంత వెనక్కి దాక్కున్నా కూడా వారి బండారం బయటపెడతామని అంటున్నారు. ఇన్నాళ్ళూ సవాళ్ళు చేసిన వాళ్ళ అసలు గుట్టు వెలికితీస్తామని కూడా మంత్రి అంటున్నారు. ఇదంతా అమరావతిలో జరిగిన ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ గురించి. భూములు పెద్ద ఎత్తున అక్కడ బినామీల పేర్లు మీద టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కొన్నారన్నది వైసీపీ మూడేళ్ళుగా చేస్తున్న అతి పెద్ద ఆరోపణ.

దుమ్ము దులుపుతారా…?

ఇదిలా ఉండగా వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచాయి. ఇపుడు కూడా ప్రభుత్వ పెద్దలు ఆరోపణలకే పరిమితం కావడం పైన విమర్శలు కూడా వచ్చాయి. దీన్ని చూసుకునే టీడీపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. మా అవినీతిని ఎక్కడా నిరూపించలేకపోయారని, ఏ అధారాలు కూడా సర్కార్ పెద్దల వద్ద లేవని కూడా ఎత్తిపొడుస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి వర్గ ఉప సంఘం నాలుగు వేల ఎకరాల్లో బినామీ భూముల బాగోతం, పెద్ద ఎత్తున జరిగిన కొనుగోళ్ళపై నివేదిక ఇచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి గట్టిగానే మాట్లాడుతున్నారు. పాపాలు పండిపోయే రోజు వచ్చిందని అంటున్నారు. మరి అవినీతిపరుల దుమ్ము నిజంగానే దులుపుతారా అన్నది ఒక చర్చగా ఉంది.

బాబు కౌంటర్….

ఇక దీని మీద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఘాటుగానే స్పందించారు. అమరావతిని రాజధానిగా ఉంచమంటే బ్లాక్ మెయిల్ కి దిగుతున్నారంటున్నారు. అక్కడ బినామీలతో టీడీపీ పెద్దలు భూములు కొన్నారన్న దానికి డైరెక్ట్ గా బాబు జవాబు చెప్పడంలేదు కానీ సీబీఐ అంటే జగన్ కి భయం అంటున్నారు. ఆయన ముందు ప్రతీ వారం కోర్టుకు వెళ్ళి సీబీఐ పట్ల తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కూడా సెటైర్లు వేశారు. ఓ విధంగా తాము నిజాయతీగానే ఉన్నామని, బేఫికర్ అన్నట్లుగానే బాబు కామెంట్స్ ఉన్నాయి. మరో వైపు ఇదంతా అమరావతి రైతులను ఇబ్బంది పెట్టేందుకే ఇవన్నీ అంటూ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ని కూడా మీడియా ముందు పెట్టారు. అంటే సీబీఐ విచారణ అంటే రైతులను బాధలు పెట్టడమే అన్న రాజకీయ కోణం నుంచే రేపటి నుంచి టీడీపీ పోరాడుతుందన్నమాట.

నిలబడతారా …?

జగన్ వరకూ చూస్తే ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ పై సీబీఐ కే వెళ్లాలని ఉందని అంటున్నారు. మరో వైపు విపక్షాల్లో సీపీఎం కూడా దీనికి మద్దతు తెలుపుతోంది. మిగిలిన ప్రతిపక్షాలు మాత్రం యాగీ చేయడానికే రెడీ అవుతాయన్నది వాస్తవం. అమరావతి రాజధానిని పూర్తిగా నీరు కార్చడానికే ఈ విచారణ అని బాబు లాంటి వారు హింట్లు అపుడే ఇస్తున్నారు. మరో వైపు హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలని చంద్రబాబే కొద్ది రోజుల క్రితం అమరావతి భూముల విషయంలో స‌వాల్ చేశారు. ఇపుడు సీబీఐ అని వైసీపీ సర్కార్ అంటూంటే దీనిని రాజకీయ కోణంలోనే ఎదుర్కోవాలని, వీలైనంత రచ్చ చేయాలని టీడీపీ రెడీ అవుతున్నట్లుగా చెబుతున్నారు.

గుట్టు విప్పాల్సిందే…

ఎవరేమన్నా కూడా ప్రభుత్వం మాత్రం ఇంతదాకా వచ్చిన కధను ముందుకు తీసుకెళ్లాలని, ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జరిగిందా లేదా అన్న దాన్ని అయిదు కోట్ల ప్రజలకు ఆధారాలతో నిరూపిస్తేనే జగన్ సర్కార్ మాటలకు విలువ ఉంటుందని మేధావులు కూడా సూచిస్తున్నారు. అలా కాకుండా కేవలం బెదిరించడానికే ఇలాంటి ప్రకటన‌లను చేసి ఊరుకుంటే అమరావతి కధకు ఎప్పటికీ ముగింపు ఉండదని కూడా అంటున్నారు.

Tags:    

Similar News