ఈ రెండింటిపైనే కాంగ్రెస్ గట్టి ఆశలు

వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలతో కుదేలవుతోంది. 2014 నుంచి ఇటు లోక్ సభ, అటు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ చేదు అనుభవాలను [more]

Update: 2021-03-21 16:30 GMT

వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలతో కుదేలవుతోంది. 2014 నుంచి ఇటు లోక్ సభ, అటు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ చేదు అనుభవాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న నాలుగు రాష్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలను సవాలుగా తీసుకుంది. వీటిల్లో బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులపై పార్టీకి ఎలాంటి ఆశలు లేవు. డీఎంకే గెలిస్తే తమిళనాడు సంకీర్ణంలో భాగస్వామి అవుతుంది. ఇక మిగిలింది కేరళ, అసోం. అధికార పార్టీని ఓడించి విపక్షాన్ని గద్దెనెక్కించడం దక్షిణాది రాష్ర్టమైన కేరళలో సంప్రదాయంగా వస్తోంది. దీనిపైనే హస్తం పార్టీ ఆశలు పెంచుకుంది.

అశోక్ గెహ్లాట్ ను….

ఈశాన్య భారతంలోని అసోం ను ఆ పార్టీ సుదీర్ఘ కాలం ఏలింది. 2016లో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని వదలుకుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్రాలను కైవశం చేసుకునే దిశగా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. ఆ మేరకు పకడ్బందీ కార్యాచరణను కూడా రూపొందించింది. కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడ గెలుపు ఆయనకు ప్రతిష్టగా మారింది. అందుకే ఇటీవల కాలంలో ఈ రాష్రంలో పర్యటనలు చేశారు. సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ను ఓడించేందుకు కాంగ్రెస్ కురువద్ధుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ను పరిశీలకుడిగా నియమించింది. ఆయనకు సహాయపడేందుకు కర్ణాటక మాజీ డెప్యూటీ సీఎం జి.పరమేశ్వర్, గోవాకు చెందిన లూయిజిన్హో ఫెలీర్ లనునియమించింది.

క్రైస్థవ ఓటర్ల కోసం….

పరమేశ్వరన్ దళిత నాయకుడు. ఫెలీరో క్రైస్తవ నాయకుడు. కేరళలో ఈ సామాజిక వర్గం ఎక్కువ. అందువల్లే వీరిని ఎంపిక చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరితోపాటు రాష్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రులు ఏకే ఆంటోనీ, ఉమెన్ చాందీ, పీసీసీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్, సీఎల్పీనేత రమేష్ చెన్నితల వంటి ఉద్ధండులు ఉండనే ఉన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 20కి కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ 19 సీట్లు గెలుచుకుని తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ ఊపుతో అసెంబ్లీ ఎన్నికలను దున్నేయాలని హస్తం పార్టీ అంచనా వేసింది. కానీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిల పడిపోవడంతో ఆశలన్నీ గల్లంతయ్యాయి. దీంతో లోపాలను సరిదిద్దుకుని అధికారం కోసం కలసికట్టుగా ముందుకు సాగుతోంది.

అసోంపై గట్టి ఆశలు….

ఇక ఈశాన్య భారతంలోని అసోంపైనా హస్తం పార్టీ గట్టి ఆశలే పెట్టుకుంది. 2001 నుంచి 2016 వరకు వరుసగా మూడు దఫాలు పార్టీని విజయపథాన నడిపించిన మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ లేకపోవడం పార్టీకి పెద్దలోటు. ఆయన గత ఏడాది నవంబరులో కన్నుమూశారు. అయినప్పటికీ తన శక్తియుక్తులను కూడదీసుకుని పార్టీ ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగల్ ను రాష్ర్ట పార్టీ ఇన్ ఛార్జిగా నియమించింది. ఆయనకు సహాయపడేందుకు ఇద్దరు ముస్లిం నేతలు ముకుల్ వాస్నిక్ (మహారాష్ర్ట), షకీల్ అహ్మద్ (బిహార్) లను నియమించింది. ఛత్తీస్ గఢ్ లో పదిహేనేళ్ల భాజపా పాలనకు చరమగీతం పాడి హస్తం పార్టీని గద్దెనెక్కించడంలో భగేల్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఈ కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

వలస కార్మికులు….

అసోం లో ఛత్తీస్ గఢ్ కు చెందిన దాదాపు పాతిక లక్షలమంది వలస కూలీలు ఉన్నారు. వీరిపై భగేల్ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. బూత్ స్థాయిలో కార్యకర్తలను మోహరించడం, వారికి పార్టీ విధానాలు, సిద్ధాంతాలపై శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలను భగేల్ ఇప్పటికే చేపట్టారు. తేయాకు కార్మికుల జీతాలను పెంచుతామని, బ్రహ్మపుత్ర నదీజలాలను సద్వినియోగ పరిచి వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తామని భగేల్ ప్రకటించారు. ముకుల్ వాస్నిక్, షకీల్ అహ్మద్ స్థానిక ముస్లిములను పార్టీ వైపు మొగ్గు చూపేలా చేస్తారని పార్టీ అంచనా వేస్తోంది. అసోంలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. ఇక సీఏఏ, ఎన్ ఆర్ సీ తోపాటు ఇంధనం, గ్యాస్ ధరల పెరుగుదల వంటి అంశాలు తమకు కలసి వస్తాయని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇది ఎంత వరకు ఫలితమిస్తుందో తేలాలంటే మే 2వరకు వేచి చడక తప్పదు.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News