ఇంత చూస్తున్నాక…. ఎలా కుదురుతుంది?

రెండుసార్లు తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. అయినా వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. తమలో ఉన్న లోపాలను సరిచేసుకోకుండా ఎదుటి వారిపై ఆరోపణలు చేసినా అవి ఏమాత్రం చెల్లుబాటవుతాయి? [more]

Update: 2020-03-27 09:30 GMT

రెండుసార్లు తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. అయినా వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. తమలో ఉన్న లోపాలను సరిచేసుకోకుండా ఎదుటి వారిపై ఆరోపణలు చేసినా అవి ఏమాత్రం చెల్లుబాటవుతాయి? ఒకరికి ఒకరకి సఖ్యత లేదు. ఒకరంటే ఒకరికి పడదు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇది. ఏ జిల్లా చూసినా ఆధిపత్య పోరు కన్పిస్తుంది. అధికార పార్టీని అందరు కలసికట్టుగా ఎదుర్కొనాల్సిన సమయంలో హస్తం పార్టీ నేతలు మాత్రం తమ సంప్రదాయ పద్ధతిలోనే వెళుతున్నారు. ఇక వీరిని ఎవరూ బాగు చేయలేరన్న వ్యాఖ్యలు ఆ పార్టీ కిందిస్థాయి నేతల నుంచే విన్పిస్తుండటం విశేషం.

రెండు సార్లు ఓడించినా…..

2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు తెలంగాణలో ఘోర ఓటమి దక్కింది. గత ఎన్నికల్లో పొత్తులతో ముందుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. పైగా గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు వెళుతున్నారు. అయినా క్లిష్టసమయంలో కలసి ఉండాల్సిన నేతలు కాడి వదిలేసి కర్రలు పుచ్చుకుని సై అంటున్నారు. హైదరాబాద్ లో అంజన్ కుమార్ యాదవ్ ఎవరినీ కలుపుకుని పోరు. రంగారెడ్డిలో కోదండరెడ్డికి, మల్ రెడ్డి రంగారెడ్డికి మధ్య పడదు. మల్కాజ్ గిరి లో రేవంత్ రెడ్డికి, కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పట్నం గోస కార్యక్రమానికి కేఎల్ఆర్ మొహం చాటేశారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, పొన్నాల లక్ష్మయ్యకు పడటం లేదు. చేర్యాల్ డివిజన్ కోసం కోమటిరెడ్డి దీక్ష చేస్తే పొన్నాల లక్ష్యయ్య దీనికి దూరంగా ఉన్నారు.

రేణుక వర్సెస్ భట్టి….

ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ మాజీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు పొసగడం లేదు. కరీంనగర్ జిల్లాలో మంధని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు, పొన్నం ప్రభాకర్ మధ్య బాగా గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఎవరి వర్గాలు వారివే. నిజామాబాద్ లో మధు యాష్కి అసలు ఉన్నారో? లేదో? తెలియదు. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ రేణుక చౌదరిల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇద్దరి సయోధ్య కుదర్చాలని కుంతియా సయితం ప్రయత్నించినా ఫలితం లేదు. భట్టి తన అనుచరులకే పదవులు ఇస్తున్నారని రేణుక ఫైర్ అవుతున్నారు.

కలసి చేసే కార్యక్రమం ఏదీ?

నల్లగొండ జిల్లా సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వంటి సీనియర్ నేతలు ఉన్నారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి కూడా పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. ఎవరి వర్గాలు వారివే. ఎవరి కార్యక్రమాలు వారివేఅన్నట్లుంది. మెదక్ జిల్లాలోనూ మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గీతారెడ్డి వంటి నేతల మధ్య సమన్వయం లేదు. ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోనూ నాయకులు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది అధికార పార్టీకి అడ్వాంటేజీగా మారింది. వీరిలో ఐక్యత రావడం ఇక కష్టమే. కొత్త పీసీసీ అధ్యక్షుడు వచ్చినా వీరి మధ్య సమన్వయం చేయడం కత్తిమీద సామే అవుతుంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ కోలుకునే పరిస్థితులు లేవు.

Tags:    

Similar News