ఏడేళ్ల నాటి శని వదలలేదా?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. తమిళనాడులో కూటమితో అధికారంలోకి రావడం మినహా ఆ పార్టీకి ఎక్కడా ప్రజలు ఆదరించినట్లు [more]

Update: 2021-05-04 17:30 GMT

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. తమిళనాడులో కూటమితో అధికారంలోకి రావడం మినహా ఆ పార్టీకి ఎక్కడా ప్రజలు ఆదరించినట్లు కన్పించలేదు. దాదాపు ఏడేళ్లుగా కాంగ్రెస్ కు శని పట్టినట్లుంది. ఏ ఎన్నికలోనూ పెద్దగా ఫలితాలు రాకపోవడం ఆ పార్టీని మరింత కుంగదీస్తుంది. అసోం, కేరళ, పుదుచ్చేరిలో విజయం సాధిస్తామన్న ధీమా కాంగ్రెస్ కు ఉండేది. కానీ అక్కడ కూడా ప్రజలు తిరస్కరించడంతో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

వరస పరాజయాలతో….

కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి వరస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఫలితాలు కొంత ఊరటనిచ్చినా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కనీస విజయాలను నమోదు చేసుకోకపోవడంపై పార్టీలో చర్చగా మారింది. నాయకత్వలోపమా? క్షేత్రస్థాయిలో క్యాడర్ నైరాశ్యమా? అన్నది తేలాల్సి ఉంది. నిజానికి కేరళలో ఈసారి విజయం సాధించాల్సి ఉన్నా అక్కడ నేతల అనైక్యత కారణంగా అధికారంలోకి రాలేకపోయింది.

కేరళపైనే ఆశలు….

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎక్కువగా కేరళపైనే దృష్టి పెట్టారు. అసోం ఎన్నికలను ప్రియాంక గాంధీ పర్యవేక్షించారు. కానీ ీఈ రెండుచోట్ల కాంగ్రెస్ చిత్తుగా ఓడటం పార్టీ శ్రేణుల స్థయిర్యాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. తమిళనాడులో మాత్రం డీఎంకేతో జత కట్టడంతో కొంత అక్కడ అధికారంలోకి వచ్చామని చెప్పుకోవడం మినహా దానికి మిగిలిందేమీ లేదు. పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.

ఇక నమ్ముతారా?

జాతీయ పార్టీగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా భావించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. భవిష్యత్ లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు. అటు వైపు చూసే అవకాశం లేదు. రాష్ట్ర స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, జాతీయ స్థాయిలోనూ రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి విముఖత చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై గాంధీ కుటుంబం పట్టు సడలుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News