ఇంతింతై...ఎదిగిన ఇందూ...!

Update: 2018-04-30 16:30 GMT

సుప్రీంకోర్టు.....భారత దేశ అత్యున్నత న్యాయస్థానం. ఏ విషయంలోనైనా దీని తీర్పునకు తిరుగులేదు. ఎదురులేదు. ఇంతటి కీలకమైన న్యాయస్థానం న్యాయమూర్తిగా ఎంపిక ఎంతో సమర్థత, దక్షత, విషయ పరిజ్ఞానం అవసరం. పురుషాధిక్య సమాజంలో ఈ పదవిని ఒక మహిళ అందుకోవడం ఆషామాషీ కాదు. అంత తేలికనది కాదు. ఇది అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన పదవి. ఈ పదవికి ఎంపికవ్వడం ద్వారా ఇందు మల్హోత్రా చరిత్ర సృష్టించారు. గతంలో మహిళలు న్యాయమూర్తులుగా ఎంపిక కాకపోలేదు. కాని న్యాయవాదిగా ఉంటూ న్యాయమూర్తిగా ఎంపికైన తొలి మహిళ ఇందూ మల్హోత్రా కావడం విశేషం. గతంలో ఏ మహిళా న్యాయవాదికీ ఇలాంటి అవకాశం లభించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఏడో మహిళ ఇందూ మల్హోత్రా. గతంలో ఆరుగురు మహిళా న్యాయమూర్తులుగా పనిచేశారు. వారు అంతా వివిధ హైకోర్టుల నుంచి పదోన్నతులపై వచ్చిన వారే కావడం గమనార్హం.

ఏడో మహిళ న్యాయమూర్తిగా.....

సుప్రీంకోర్టు తొలి మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవి 1989 నుంచి 1992 వరకూ సేవలు అందించారు. అనంతరం ఆమె తమిళనాడు గవర్నర్ గా పనిచేశారు. రెండో మహిళా న్యాయమూర్తి జస్టిస్ సుజాత వి. మనోహర్. ఆమె 1994 నుంచి 1999 వరకూ పనిచేశారు. మూడో మహిళా న్యాయమూర్తి జస్టిస్ రూమాపాల్. ఆమె 2000 నుంచి 2006 వరకూ పదవిలో కొనసాగారు. నాలుగో మహిళాన్యాయమూర్తిగా జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా 2010 నుంచి 2014 వరకూ వ్యవహరించారు. ఝార్ఘండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆమె పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వచ్చారు. చాలాకాలం పాటు ఆమె రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. అయిదో మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ రంజనా.పి.దేశాయ్ సర్వోన్నత న్యాయస్థానంలో సేవలందించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఏకైక మహిళ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. భానుమతి. ఈమె తమిళనాడుకు చెందని వారు. కొత్తగా ఇందూ మల్హోత్రా నియామకంతో సర్వోన్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు పెరగింది.

ఎన్నో కేసులు....సేవలు.....

ఇందు మల్హోత్రా న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చారు. బెంగళూరులో జన్మించినప్పటికీ విద్యాభ్యాసం ఢిల్లీలోనే జరిగింది. అక్కడే న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు.1983లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. అయిదేళ్లలోనే అత్యంత కఠినతరమైన ‘‘అడ్వకేట్ ఆన్ రికార్డ్’’ పరీక్షలో ప్రధమ స్థానం సాధించారు. ఈ హోదా పొందిన రెండో మహిళ ఇందూనే కావడం విశేషం. సుదీర్ఘకాలం సుప్రీంకోర్టు న్యాయవాదిగా సేవలందించారు. మధ్యవర్తిత్వంపై పలు పుస్తకాలు రచించారు. దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వ కేసుల్లోనూ సెబీ (సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) సహా పలు సంస్థల తరుపున వాదనలు విన్పించారు. ఇందూ కేవలం న్యాయవాద వృత్తికే పరిమితం కాలేదు. అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వయంగా ఆమె ఒక ఉద్యమ కారిణి. తనకున్న విస్తృతమైన అవగాహనతో కీలక అంశాలపై న్యాయనిపుణురాలిగా మధ్యవర్తిత్వం వహించారు. పౌరసేవలు, విద్యాసంబంధిత విషయాలు, మానవ హక్కుల కేసుల్లో సాయపడేవారిని , వేధింపుల నుంచి రక్షించే చట్టానికి మార్గ దర్శకాలు రూపొందించారు. పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులను నిరోధించడానికి ఉద్దేశించిన ‘‘విశాక కమిటీ’’లో ఇందు మల్హోత్రా సభ్యురాలిగా పనిచేశారు. ఈ చట్టం రూపకల్పన కు విశేష కృషి చేశారు. న్యాయస్థానాల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పదిమంది సభ్యుల కమిటీలో సభ్యురాలు. చలన చిత్ర రంగంలో మహిళ కళాకారులు ఎదుర్కొంటున్న వివక్షపై జరిగిన పోరాటాల్లోనూ కీలకమైన సేవలందించారు. పలు వరకట్న కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానానికి ఇందు మల్హోత్రా ‘‘అమికన్ క్యూరీ’’ గా విశేష సేవలందించారు.

చదువంతా ఢిల్లీలోనే......

ఈ నెల 27న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇందూ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రధాన న్యాయమూర్తితో కలసి వెంటనే ఒకటో నెంబరు కోర్టులో కేసుల విచారణ ప్రక్రియలో పాల్గొన్నారు. ఢిల్లీలోని కార్మెంట్ కాన్వెంట్ లో ప్రాధమిక విద్య, ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ఇందు అనంతరం సీనియర్ న్యాయవాదులు ఓం ప్రకాశ్ మల్హోత్రా, సత్య ప్రకాష్ మల్హోత్రా వద్ద కొంతకాలం పనిచేశారు. సుదీర్ఘ కాలం సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసిన అనంతరం 2007 ఆగస్టులో ఆమెను సీనియర్ అడ్వకేట్ గా సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ గుర్తింపు పొందిన రెండో మహిళా న్యాయవాది ఇందూనే కావడం గమనార్హం. గతంలో తొలిసారి లీలా సేథ్ 1977లో ఈ గుర్తింపు పొందారు. తర్వాత కాలంలో ఆమె హిమాచల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తొలి మహిళ లీలా సేథ్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఇందు మల్హోత్రా దేశం గర్వించేంతట కీలక తీర్పులు ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. మహిళా న్యాయమూర్తిగా మహిళా న్యాయవాదులకు ఆమె స్ఫూర్తిదాయకం.

 

-ఎడిటోరియల్ డెస్క్.....

Similar News