మంత్రి గారికి ముచ్చెమటలు తప్పవా..?

Update: 2018-11-04 03:30 GMT

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇక్కడి నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేస్తుండటంతో జిల్లాలో అందరి చూపు ఈ నియోజకవర్గంపైనే పడింది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఉండటంతో విజయం కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేసినా వ్యక్తిగత చరిష్మాతోనే విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డికి టఫ్ ఫైట్ తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన ఆయనకు ఒకటిరెండు సార్లు ప్రజల నుంచి నిలదీతలు ఎదురుకావడంతో అలెర్ట్ అయిన ఆయన విజయం కోసం అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.

పార్టీలో... ప్రజల్లో అసమ్మతి

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గత ఎన్నికల ముందు ఏ పార్టీలో చేరినా టిక్కెట్ దక్కే అవకాశం లేకపోవడంతో బీఎస్పీ బీఫాంపై పోటీ చేసి ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీహరిరావు 52 వేల ఓట్లతో రెండో స్థానంలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి 39 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలచారు. అంతకుముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, వ్యక్తిగత బలంతోనే ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు. అయితే, ఎన్నికల తర్వాత కొన్నిరోజులకే ఆయన టీఆర్ఎస్ లో చేరగా.. మంత్రి పదవి కూడా దక్కింది. ఈసారి టీఆర్ఎస్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే, ప్రచారంలో ఒకటిరెండు సందర్భాల్లో ప్రజలు ఆయనను నిలదీయడం, నిర్మల్ మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్ అప్పాల గణేష్ సహా సుమారు 20 మంద్రి కౌన్సిలర్లు మంత్రి వైఖరికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం కూడా మంత్రికి మింగుడు పడని విషయం. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు నిలిచే అవకాశం ఉంది.

గట్టి పోటీ ఇవ్వనున్న కాంగ్రెస్

కాంగ్రెస్ ను ఆయన గట్టి పోటీనే ఎదురుకునే అవకాశం ఉంది. ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఆయనపై పోటీ చేస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి కూడా నియోజకవర్గంలో బలం పెంచుకునేలా పనిచేసుకున్నారు. మంత్రి వైఫల్యాలను ఎండగట్టడంలో ముందున్నారు. మంత్రిపై పలు ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఆర్థికంగానూ బలంగా ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీచేసిన ఆయన విజయం సాధించారు. ఆ పార్టీ తెలంగాణలో గెలిచిన రెండు స్థానాల్లో నిర్మల్ ఒకటి. ఈ ఎన్నికల్లో ఆయన ఇంద్రకరణ్ రెడ్డికి బలమైన పోటీ ఇస్తున్నారు.

గెలిస్తే ఆయనదే రికార్డు

అయితే, ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పనిచేసిన ఈ నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగారు. ఇక నిర్మల్ ప్రత్యేక జిల్లాగా ఏర్పడటం కూడా ఇంద్రకరణ్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎంఐఎంతో టీఆర్ఎస్ కు స్నేహం ఉన్నందున నియోజకవర్గంలో ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్న మైనారిటీలు టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తారని ఆ పార్టీ ధీమాగా ఉంది. వ్యక్తిగత ఇమేజ్ తోనే గత ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి 60 వేల ఓట్లు సాధించారు. ఇక టీఆర్ఎస్ కి 52 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆయనే టీఆర్ఎస్ అభ్యర్థి కావడంతో వ్యక్తిగత బలానికి పార్టీ బలం కూడా తోడవనుంది. ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి, టీడీపీ నుంచి వెణుగోపాలచారి, ఇంద్రకరణ్ రెడ్డి మూడేసి సార్లు విజయం సాధించగా... నాలుగోసారి ఎవరూ గెలవలేదు. ఈసారి ఇంద్రకరణ్ రెడ్డి గెలిస్తే ఈ రికార్డు ఆయనదే అవుతుంది. మొత్తానికి ద్విముఖ పోటీ ఉండనున్న నిర్మల్ లో ఆపద్ధర్మ మంత్రి అల్లోల గెలవాలంటే చెమటోడ్చక తప్పదు.

Similar News