కరోనా కన్నా అతి పెద్ద వైరస్ ఇదే?

కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అవసరమని వైద్యులు చెబుతున్నారు. అది ఉన్నవారు బాగుంటున్నారు. లేని వారు వెళ్లిపోతున్నారు. ఇది అంతర్జాతీయంగా జరుగుతున్న అతి [more]

Update: 2020-04-18 16:30 GMT

కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అవసరమని వైద్యులు చెబుతున్నారు. అది ఉన్నవారు బాగుంటున్నారు. లేని వారు వెళ్లిపోతున్నారు. ఇది అంతర్జాతీయంగా జరుగుతున్న అతి పెద్ద పరిణామం. మరి భారత్ లో కరోనా వైరస్ ని జయించేటంతగా రోగ నిరోధ‌కశక్త్రి మన భారతీయులకు ఉందని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే బండగా, మొండిగా బతికేయడంలో భారతీయులే ముందుంటారు. మిగిలిన దేశాలకు లేనిది మనకు మాత్రమే ఉన్న ఆస్తి అది. అంతవరకూ బాగానే ఉన్న మన ఆర్ధిక స్థితి మాత్రం దారుణం. దుర్బరం. ఇది ఆర్ధిక వైద్యులు చెబుతున్న మాట.

బీద భారతం….

మనది 130 కోట్ల జనాభా ఉన్న అతి పెద్ద పేద దేశం. ఈ దేశంలో నూటికి పది మంది మాత్రమే స్థితిమంతులు ఉన్నారు. మిగిలిన వారు కడు పేదలు, దుర్బలులు అని తెలుస్తోంది. లాక్ డౌన్ వేళ మన దేశం అసలు బండారం ఇలా బయటపడుతోంది కూడా. ఈ దేశంలో పేదలు ఎంతమంది అన్నది ఎవరూ చెప్పకుండానే ప్రపంచానికి తెలిసిపోతోంది. లాక్ డౌన్ మన మాదిరిగానే ఉన్నా కూడా ఇతర దేశాల బాధలు వేరు. అక్కడ వారు డబ్బు ఉండి ఇంటి నుంచి సరకులు తెచ్చుకోలేని నిస్సహాయత‌తో ఉంటారు. అందువల్ల ఆన్ లైన్ ద్వారా అక్కడి వారికి సరకుల సరఫరా జరుగుతోంది. అదే భారత దేశంలో అలా కాదు. పొయ్యి కింద మంట ఉండదు, పొయ్యి మీద పిల్లి లేవదు అన్నట్లుగా ఉంది సన్నివేశం.

బిచ్చగాళ్ళేనా…?

నిజానికి శరీరంలో వైరస్ ప్రవేశిస్తే దాన్ని అడ్డుకోవడానికి లోపల యాంటీ బ్యాక్టీరియా గట్టిగా పోరాడుతుంది. దాన్నే రోగ నిరోధక శక్తి అంటాం. మరి లాక్ డౌన్ పీరియడ్ ఇలా మొదలైందో లేదో పేదల కేకలు వినిపిస్తున్నాయి. ఒక్క చోట కాదు, ఒక్క రాష్ట్రం కాదు ఆసేతు హిమాచలం ఇదే తీరుగా ఉంది. అంటే మన పేదరికాన్ని నిరోధించే శక్త్రి ఒక్క పూట కూడా గడువు ఇవ్వడంలేదన్న మాట. ఏ పూటకు ఆ పూటే వెతుకులాట అన్నమాట. అందుకే ఇలా ఇంట్లో ఉండండి అన్నారో లేదో అలా ఆకలి తో పెడబొబ్బలు వినిపిస్తున్నాయి. పాలకులు సైతం ప్రజలను బిచ్చగాళ్ళను చేస్తూనే ఇన్నేళ్ళూ పాలించారు. శాశ్వతమైన ప్రయోజనం, ఆర్ధికంగ బలోపేతం చేసే వ్యవస్థలను తయారుచేయలేకపోయారు. అందుకే ఈ వితరణలూ, ఆర్ధిక సాయాలు, మొత్తానికి జనాలను బిచ్చగాళ్ళను చేస్తున్నారు.

డొల్లతనమేనా…?

ఎపుడో అయిదు దశాబ్దాల క్రితం నాటి ప్రధాని ఇందిరా గాంధీ గరీబీ హఠావో అంటూ నినాదాన్ని అందించింది. కానీ పేదలు ఇనా పెరిగారు కానీ తగ్గలేదు. మన దేశ వార్షిక బడ్జెట్ ఇరవై లక్షల కోట్ల రూపాయలు. ఈ దేశంలో గత డెబ్బయి మూడేళ్ళ కాలంలో ఎన్నో లక్షల కోట్లు అప్పులు తెచ్చాం. మరెన్నో దేశాలు సాయం అందించాయి. అన్నీ తీసుకుని అనేక రకాల ప్రణాళికలు రూపొందించుకుని కూడా మన వ్యక్తిగత ఆర్ధిక ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నామంటే తప్పు పాలకులదా, పాలితులదా. అంటే సమాధానం ఇద్దరిదీ అని చెప్పాలి. ఎందుకంటే సగటు ప్రజలు ఓటు వేయడానికి కూడా చేతులు చాపి దేశ ప్రజలు ఏనాడో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసుకున్నారు. ఇపుడు కూడా లాక్ డౌన్ అంటూ పాలకులు చేతిలో నోట్లు పెడుతూ అదే బిచ్చాన్ని వేస్తున్నారు. అంతకు మించి దూర దృష్టి ఎవరికీ లేదు. కరోనా వైరస్ కన్నా అతి పెద్ద ముప్పు ఇదే.

Tags:    

Similar News