యథా రాజా.. తథా ప్రజ

సామెతలు ఊరకనే పుట్టుకుని రాలేదు. అనుభవాల సారంగానే వాడుకలోకి వచ్చాయి. కరోనా వ్యాప్తిలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి , ప్రజల సహకారమూ తోడవుతోంది. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ క్రమశిక్షణ [more]

Update: 2021-05-21 15:30 GMT

సామెతలు ఊరకనే పుట్టుకుని రాలేదు. అనుభవాల సారంగానే వాడుకలోకి వచ్చాయి. కరోనా వ్యాప్తిలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి , ప్రజల సహకారమూ తోడవుతోంది. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ క్రమశిక్షణ కలిగిన పౌరులను తయారు చేయడంలో భారత్ విఫలమైందనే చెప్పాలి. తీవ్రత పెరిగి రోజువారీ మరణాలే వెయ్యి వరకూ నమోదవుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కర్ఫ్యూ, లాక్ డౌన్, పాక్షిక లాక్ డౌన్ అమలవుతున్నాయి. నిత్యావసరాల కోసం సడలించిన సమయాలలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉద్దేశాన్ని నీరుకారుస్తున్నారు. ఫలితంగా రెండో విడతకు ఎప్పటికి తెర పడుతుందో చెప్పలేమంటున్నారు వైద్యులు. ప్రభుత్వాలు పరీక్షల సంఖ్యను తగ్గించి బలవంతంగా కేసులు తగ్గిపోయాయని గణాంకాలు చూపించుకోవాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ కోవలో ప్రవర్తిస్తోంది. తాజాగా జరిపిన అన్ని సర్వేల్లోనూ లాక్ డౌన్ పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదని వెల్లడవుతోంది. దానికి పౌరుల బాధ్యతారాహిత్యం ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.

తొలి ముద్దాయి సర్కారు…

మనదేశంలో ఇన్ సెన్సిటివ్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ప్రజారోగ్యం పై వారికి పెద్దగా శ్రద్ధ లేదనేది అందరికీ తెలిసిందే. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వేరే దేశాల్లో అయితే ప్రయివేటు ఆసుపత్రులను ఇప్పటికే జాతీయం చేసి ఉండేవారు. అందువల్ల నిజమైన , అవసరమైన రోగులకే వైద్య సదుపాయాలు అందించే ఏర్పాటు జరిగి ఉండేది. ప్రయివేటు చికిత్స తీసుకుంటున్న వారిలో 65శాతం మంది రోగులు ఇంటివద్ద క్వారంటైన్ లో ఉండి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందని కొందరు వైద్య ప్రముఖులు పేర్కొంటున్నారు. కానీ తమ వద్ద డబ్బు ఉంది కదా? అని చాలామంది ముందుజాగ్రత్త గా పడకలు ఖాళీ లేకుండా చేస్తున్నారు. ఫలితంగా ప్రయివేటు ఆసుపత్రులంటే ధనికులకే అన్న భావన ఏర్పడిపోయింది. ప్రాణానికి పేద, గొప్ప తేడా లేదు. కానీ ఈ వ్యత్యాసం తీవ్రంగా కొనసాగడానికి ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కారణం. అంటు వ్యాధుల చట్టం ప్రకారం ఆసుపత్రులను జాతీయం చేయడానికి సర్వాధికారాలు ప్రభుత్వాలకు ఉన్నాయి. కానీ వినియోగించడం లేదు. మార్చి నెల నుంచే కరోనా ఉత్పరివర్తనాలు రకరకాల రూపాల్లో దేశంలో విజృంభిస్తున్నాయని సమాచారం వచ్చినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వాటి ఫలితంగానే ఇప్పుడు అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ అవస్థ నెలకొంది.

దున్నపోతు మీద వాన కురిసినట్లే..

ఒక పక్క ప్రాణాలు పోతున్నాయి. వేల సంఖ్యలో కుప్పకూలిపోతున్నారంటూ మీడియా, సోషల్ మీడియా హోరెత్తి పోతోంది. ఒక రకంగా చెప్పాలంటే కొంత అతిశయోక్తులతో కూడిన కథనాలను కూడా వండి వారుస్తున్నాయి. అయినా ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన ఏర్పడలేదు. తమకేం కాదనే ధీమాలో చాలా మంది జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా నివేదికల ప్రకారం ఇప్పటికీ 50శాతం మంది అసలు మాస్క్ లే పెట్టుకోవడం లేదు. కొందరు అలంకార ప్రాయంగా పెట్టుకుంటున్నారు. సరైన రీతిలో మాస్కులు ధరించేవారు కేవలం 15శాతం మాత్రమే ఉన్నారనేది క్షేత్రస్థాయి అధ్యయనం. అంటే కరోనా తీవ్రత ప్రజలకు పట్టడం లేదు. ప్రభుత్వాలకు ఇదే అలుసుగా మారింది. కోవిడ్ వారియర్స్ గా గుర్తించిన వర్గాలకు తొలి దశలో వాక్సినేషన్ మొదలు పెట్టినప్పుడు 30 శాతం మంది సుముఖంగా స్పందించలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ తయారీ కంపెనీలకు ఆర్డర్లు పెట్టడం మానేసింది. ఈలోపు కరోనా ముదిరింది. ఇప్పుడు ప్రజలు ఎగబడుతున్నారు. వాక్సిన్ల విషయంలో తమ వంతు వచ్చేవరకూ ఆగడానికి కూడా ఇష్టపడటం లేదు. అదే సమయంలో జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదు. కర్ఫ్యూ సడలింపు సమయాల్లో రోడ్లపై తీవ్రమైన గందరగోళం స్రుష్టిస్తున్నారు . జాతరను తలపింప చేస్తున్నారు. దీనివల్ల మరింతగా కరోనా పెరిగే ప్రమాదం ఉంది.

పంతాలు వదిలితే మేలు…

ప్రపంచం దృష్టిలో భారత్ పరువు ఎలాగూ దిగజారిపోయింది. ఇప్పటికైనా పంతాలు, పట్టుదలలు విడిచి పెడితే మంచిది. దేశం కంటే పార్టీలకు రాజకీయాలే ముఖ్యమై పోయాయి. బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ప్రత్యర్థి పార్టీలు కరోనాను ఒక రాజకీయ అవకాశంగా చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడానికి , ప్రజల ద్రుష్టిలో పలచన చేయడానికి ఇంతకు మించిన తరుణం దొరకదని భావిస్తున్నాయి. భారతీయ జనతాపార్టీలోనే ఒక వర్గం కేంద్ర ప్రభుత్వ పనితీరుపై అసంత్రుప్తితో రగిలిపోతోంది. మరోవైపు బీజేపీకి మాత్రుక అయిన ఆర్ ఎస్ ఎస్ సైతం కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించిందనే అంచనాకు వచ్చింది. కరోనాను దేశం నుంచి తరిమేశామంటూ కేంద్ర మంత్రులు మార్చి నెలలో సంబరాలు చేసుకుని, ప్రధానికి ఆ ఘనతను ఆపాదించారు. ప్రస్తుత పరిస్తితికి వీరంతా కారణమేనని సంఘ్ పరివార్ లోని కొందరు బలంగా విశ్వసిస్తున్నారు. రాష్ట్రాలలోనూ, జాతీయంగానూ రాజకీయ ప్రకంపనలకు కరోనా కారణమవుతోంది. అరవింద్ కేజ్రీవాల్ వంటి వారైతే విదేశీ సంబంధాల్లో ఉండే సెన్సిటివిటీని గుర్తించక ఇతర దేశాలపైనా నిందలు మోపుతున్నారు. మొత్తమ్మీద ఈ గందరగోళ పరిస్థితి కచ్చితంగా స్వయంక్రుతాపరాధమే. ప్రభుత్వమెలాగూ దోషిగానే నిలుస్తోంది. దాంతోపాటు ప్రజలూ బాధితులే కాదు, బాధ్యులు కూడా.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News