తగ్గకూడదనా…? తప్పుకుందామనా…?

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల మధ్య సమన్వయం కుదరడం లేదు. రాష్ట్రంలో పాలన ఇంకా గాడిన పడలేదు. భారతీయ జనతా [more]

Update: 2019-02-23 16:30 GMT

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల మధ్య సమన్వయం కుదరడం లేదు. రాష్ట్రంలో పాలన ఇంకా గాడిన పడలేదు. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు స్వస్తి చెప్పి లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించింది. బీజేపీ జాతీయస్థాయి నేతలు కూడా లోక్ సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాష్ట్రంలో పర్యటనలు ప్రారంభించారు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ లు మాత్రం ఇంకా కుదురుకోలేని పరిస్థితి. లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కాలేని స్థితి.

సిద్ధూపై గుర్రుగా…..

ఇప్పటికీ ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్ వ్యవహారశైలి పట్ల గుర్రుగానే ఉన్నారు. సిద్ధరామయ్య ఇప్పటికీ సూపర్ సీఎంగానే వ్యవహరిస్తున్నారన్నది జేడీఎస్ ఆరోపణ. సిద్ధరామయ్య చెప్పినట్లే పాలన సాగాలంటే కుదరదని కుమారస్వామి కుండబద్దలు కొట్టేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ తానే కుమారస్వామి తర్వాత అంటూ చెప్పుకుని తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య సమన్వయం దొరకడం కష్టమేనంటున్నారు.

జేడీఎస్ కోరికలకు…..

ఒకవైపు లోక్ సభ ఎన్నికలు దూసుకు వస్తున్నాయి. మొత్తం 28 లోక్ సభ స్థానాలుండగా, అందులో 23 స్థానాలను రెండు పార్టీలు కలసి కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నాయి. సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు జనతాదళ్ అధినేత దేవెగౌడతో సమావేశమై తొలివిడత సీట్ల పంపకాలపై చర్చలు జరిపినా పెద్దగా ఫలితం కన్పించడం లేదు. జేడీఎస్ పన్నెండు లోక్ సభ స్థానాలను కోరుకుంటుడటంతో దానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించని విషయం తెలిసిందే.

బీజేపీ మాత్రం…..

మరోవైపు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయింది. 28 లోక్ సభ స్థానాలకు రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను రూపొందించింది. దానిని కేంద్ర పార్టీ ఆమోదించాల్సి ఉంది. పార్టీ కోసం కష్టపడిన వారిని, ప్రజల్లో గుర్తింపు ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేశామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒక్కో పార్లమెంటు నియోజజకవర్గానికి రెండు నుంచి మూడు పేర్లను అధిష్టానికి పంపారు. వీటిని అమిత్ షా ఫైనల్ చేయాల్సి ఉంది. కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య సీట్ల ఒప్పందం కూడా మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News