ఛాన్స్ మిస్ చేసుకుంటారా…?

ఈ ఎన్నికలే ప్రజాభిప్రాయాన్ని తేల్చనున్నాయి. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ అసలే కష్టాల్లో ఉంది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పార్టీల్లో సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. ఏ పార్టీకి శాసనసభలో [more]

Update: 2019-05-04 18:29 GMT

ఈ ఎన్నికలే ప్రజాభిప్రాయాన్ని తేల్చనున్నాయి. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ అసలే కష్టాల్లో ఉంది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పార్టీల్లో సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. ఏ పార్టీకి శాసనసభలో పెద్దగా బలం లేకపోవడంతో నిత్యం టెన్షన్ తోనే గడుపుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 104 స్థానాలను గెలుచుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు మరో ఎనిమిది స్థానాలు తక్కువ కావడంతో బీజేపీ ఆపరేషన్ కమల్ ను కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచే ప్రారంభించింది. సభ్యులను కాపాడుకోలేక కాంగ్రెస్ పార్టీ అవస్థలు పడుతోంది.

ఫలితాల తర్వాత….

ఒక దశలో్ అన్ని పార్టీలూ రిసార్టు రాజకీయాలను కూడా నడిపారు. క్యాంపులను నిర్వహించారు. ఇప్పటికే రమేష్ జార్ఖిహోళి వంటి నేతలు కాంగ్రెస్ పార్టీని కాదు పొమ్మంటున్నారు. మరికొందరు నేతలు కూడా రెడీ గా ఉన్నారు. ఈనేపథ్యంలో మరోసారి కర్ణాటకలో శాసనసభ ఉప ఎన్నికలు పార్టీల్లో హీట్ ను పెంచాయి. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ మార్పిడి ఉంటుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం దానికంతట అదే కుప్ప కూలిపోతుందని యడ్యూరప్ప లాంటి నేతలు నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు.

ఉప ఎన్నికల పోరులో….

ఈ పరిస్థితుల్లో కుందగోళ, చించోళి నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రెండు నియోజకవర్గాలపై కన్నేసింది. ఈ రెండు గెలిస్తే తమ బలం 106కు పెరిగుతుంది. ఉప ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాతైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని యడ్యూరప్ప భావిస్తున్నారు. ఏడాదిగా కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదని, రైతు రుణమాఫీ కూడా అమలు చేయలేక చేతులెత్తేసిందని యడ్యూరప్ప తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కుందగోళ నియోజకవర్గంలో చిక్కన గౌడర్, చించోళిలో అవినాష్ జాదవ్ లను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించిం ప్రచారంలో దూసుకుపోతోంది.

ట్రబుల్ షూటర్ ను ….

ఇక ఈ స్థానాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపైనే ఉంది. అందుకే సిద్ధరామయ్య ఈ రెండుస్థానాల్లో ప్రత్యేకంగా పర్యటిస్తూ గెలుపుపై వ్యూహాలను రచిస్తున్నారు. ఈరెండు స్థానాలకు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా నియమించింది. ఈ రెండు స్థానాల ఫలితాల ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఒకవేళ రెండు స్థానాల్లో రిజల్ట్ తిరగబడితే సర్కార్ కు చిక్కులు తప్పవు. యడ్యూరప్ప అందుకే ఈ రెండు నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. దాదాపు 11 రోజుల పాటు ఆయన ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మరి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

Tags:    

Similar News