బలం కాదు..”దళం” ముఖ్యం…!!!

ఉన్నవి 28 స్థానాలు… అందులో తమకు 12 స్థానాలు కావాలని దళపతి దేవెగౌడ పట్టుబడుతున్నారు. థర్డ్ ఫ్రంట్ అంటూ దేశంలో నినాదం ఊపందుకున్న నేపథ్యంలో దళపతి తనకు [more]

Update: 2019-01-09 18:29 GMT

ఉన్నవి 28 స్థానాలు… అందులో తమకు 12 స్థానాలు కావాలని దళపతి దేవెగౌడ పట్టుబడుతున్నారు. థర్డ్ ఫ్రంట్ అంటూ దేశంలో నినాదం ఊపందుకున్న నేపథ్యంలో దళపతి తనకు ఉన్న అవకాశాలను వదులుకోదలచుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ చావుదెబ్బతిన్నా అనుకోని అదృష్టంతో ముఖ్యమంత్రి పదవి దక్కింది. బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చేయాలన్న లక్ష్యంతోనే అయిష్టంగానే కుమారస్వామని సీఎం పీఠం ఎక్కించింది. అయితే రానున్న లోక్ సభ ఎన్నికలు ఈ రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం విషయంలో విభేదాలు తలెత్తే అవకాశముంది.

కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లో…..

కర్ణాటకలో కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఆశావహులున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి ఇదే ధోరణి కన్పించింది. శివమొగ్గ, మాండ్యా పార్లమెంటు స్థానాలను గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్ కు అతికష్టం మీద కేటాయించాల్సి వచ్చింది. కానీ ఈ లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడ, కుమారస్వామి కోరినన్ని స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదన్నది వాస్తవం. ఇప్పటికే కుమారస్వామి అధికారంతో తన బలంపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానం, ఆందోళన కాంగ్రెస్ నేతల్లో ఉంది.

నాలుగంటూ లీకులు….

కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలుండగా అందులో 12 స్థానాలను జేడీఎస్ కోరుతోంది. దేవెగౌడ ఈవిషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. కాని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాలరావులు మాత్రం అన్ని స్థానాలను ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. దేవెగౌడ మాత్రం తాను సీట్ల విషయాన్ని ఢిల్లీలోనే తేల్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. కాంగ్రెస్ కూడా నాలుగు సీట్లకు మించి ఇవ్వలేమని, అదీ దళ్ పట్టున్న చోట మాత్రమే అవకాశముంటుందని లీకులు వదులుతోంది. మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సీట్ల అంశం మాత్రం సెగలు పుట్టించేలా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News