స్పీడు పెంచారే….!!!

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ కూడా స్పీడ్ పెంచింది. బీహార్ లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ [more]

Update: 2018-12-25 18:29 GMT

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ కూడా స్పీడ్ పెంచింది. బీహార్ లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాల సీట్లను ఖరారు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన వ్యూహాలను ముందు నుంచే రచించుకోవడానికి అవసరమైన సమయం వారికి చిక్కుతుంది. ఇక కాంగ్రెస్ కూడా కూటమి ఏర్పాటులో వేగం పెంచింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో చర్చలు ప్రారంభించింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివిధ రాష్ట్రాల కూటమిలపై దృష్టి సారించారు. ఎన్నికలకు ముందే పొత్తులు ఉండాలన్నది ఆయన ఆలోచన.

మహారాష్ట్రలో ఓకే…..

48 పార్లమెంటుస్థానాలున్న మహారాష్ట్రలో నలభై సీట్ల విష‍యంలో కూటమిలో ఒప్పందం జరిగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ, రైతు శ్రామిక పార్టీలతో కలసి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఎవరికి ఎన్ని సీట్లు అన్నది ఇంకా ఖరారు కాకపోయినా ఈ మూడు పార్టీలూ కలసి లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఏ ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపై తదుపరి చర్చల్లో తేలనుంది. మహారాష్ట్రలో మారిన పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ ఎంతో ఆశలు పెట్టుకుంది.

బీజేపీకి కష్టమేనా?

ఇక్కడ గత ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలసి పోటీ చేశాయి. శివసేన ఇప్పటికే తాము లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే మోదీ, అమిత్ షాలపై ఒంటికాలిపై లేస్తున్నారు. థాక్రే ప్రధానంగా అయోధ్య అంశాన్ని పట్టుకున్నారు. ముప్ఫయి ఏళ్లుగా నలుగుతున్న అయోధ్య సమస్యపై పార్లమెంటులో చర్చించాలని, అయోధ్య నిర్మాణంపై ఆర్డినెన్స్ తేవాలని ఆయన గట్టిగా పట్టుబడుతున్నారు.

సంఘ్ పరివార్ పైనే ఆశలు…

కాని ఇక్కడ శివసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అన్నది తేలకుండానే ఉంది. శివసేన మోదీ, అమిత్ షా ల పట్ల గుర్రుగా ఉన్నారు. పెద్దనోట్ల రద్దు, రాఫేల్ కుంభకోణం, అయోధ్య వంటి అంశాలపై ఆయన మోదీ సర్కార్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. విమర్శిస్తున్నారు. ఈనేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సంఘ్ పరివార్ ను రంగంలోకి దించి శివసేనను ఒప్పించాలన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. శివసేన, బీజేపీ మహారాష్ట్రలో విడివిడిగా పోటీ చేస్తే అది కాంగ్రెస్ కూటమికి లాభిస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు లోక్ సభ ఎన్నికల నాటికి ఏ మలుపైనా తీసుకోవచ్చన్నది పరిశీలకుల భావన.

Tags:    

Similar News