‘‘పవర్’’ లేకుంటే పైసలే కరువా?

Update: 2018-05-26 15:30 GMT

అధికారాంతమున చూడవలె ఆ అయ్య కష్టములు..అని సామెత. దీర్ఘకాలంపాటు దేశాన్నేలిన హస్తంపార్టీకి కాసుల కష్టాలు వచ్చి పడ్డాయి. పవర్ లేని పార్టీకి పైసలిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఒకవైపు మూడు నాలుగు చిన్నరాష్ట్రాలకు పరిమితమైన అధికారం. పంజాబ్ మినహా మిగిలిన చోట్ల అధికారం అనేమాట తప్పితే వచ్చిపడేదేమీ లేదు. కర్ణాటకలో జూనియర్ కు పదవీ భాగ్యం కల్పించిన సీనియర్ భాగస్వామిగా చిత్రమైన పరిస్థితి. మరోవైపు పార్టీ విరాళదారులు, కార్యకలాపాలపై కేంద్ర సంస్థల నిఘా కళ్లు. ఏతావాతా ఎటూ పాలుపోని స్థితి. ఇంకొకవైపు పదినెలల వ్యవధిలో ఎన్నికలకు తయారుకావాల్సిన అనివార్యత. అగ్రనాయకుల పర్యటనలు,యాత్రలు, ప్రచారం వంటివిషయమై ఆపన్న హస్తం కోసం గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఎదురుచూస్తోంది. ఎన్నికల్లో నిధుల పంపిణీ వంటి భారీ ఖర్చులను తమాయించుకోవడం ఎలాగో తెలియక తలపట్టుకుంటోంది.

గో.పి. గోడ దూకేశాడు...

అధికారములో ఎవరున్నారనే దానితో నిమిత్తం లేకుండా కార్పొరేట్, కాంట్రాక్టు సంస్థలు తమ అవసరాల నిమిత్తం రాష్ట్ర,జాతీయ స్థాయి పార్టీలకు విరాళాలిస్తుంటాయి. అధికారంలో ఉన్నవాళ్లకు కొంచెం ఎక్కువ మొత్తంలో ప్రధాన పక్షాలకు వాటి స్థాయి ,ప్రాబల్యాన్ని బట్టి అందచేస్తుంటాయి. చిన్నచితక పార్టీలకు చేయి విదిలిస్తుంటాయి. ఎవరితో వైరం తెచ్చుకోకుండా తమపని చక్కబెట్టుకునే ఎత్తుగడలో భాగమే విరాళాల అందచేత. భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని భావించిన పార్టీలకు సైతం భారీగానే ముట్టచెబుతుంటారు. బ్లాక్ అండ్ వైట్ ల గొడవ ఉండనే ఉంటుంది. అందులో నల్లధనానికే అగ్రతాంబూలం. పార్టీ సభ్యత్వం తీసుకునే కార్యకర్తలు, సానుభూతిపరులు అందచేసే నిధులతో పార్టీలు నడిచే రోజులెప్పుడో పోయాయి. సభ్యత్వాలు , స్వచ్ఛంద విరాళాలు బోగస్ గా మారిపోయాయి. ఏవో పేర్లతో చిట్టాలు నింపేసి అనామతు ఖాతాల్లో కోట్ల రూపాయలు వచ్చేసినట్లు గా చూపించేయడం పార్టీలకు అలవాటైపోయింది. కార్పొరేట్ సంస్థలు, బడా కాంట్రాక్టులు చేపట్టే సంస్థలు గోడమీద పిల్లివాటంగానే ఉంటుంటాయి. అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తుంటాయి. తాజాగా పెద్ద సంస్థలన్నీ కాంగ్రెసు పార్టీ 2109లో అధికారంలోకి రావడం కష్టమనే భావనతో విరాళాల విషయంలో బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా లెక్కలు వెల్లడిస్తున్నాయి.

అష్ట దిగ్బంధనం.. ..

అఖిలభారత స్థాయిలో పార్టీ నిర్వహణకు రాష్ట్రాలను ఆదుకోవడానికి కాంగ్రెసు పార్టీ చేతిలో డబ్బులు ఆడటం లేదు. వామపక్షాల వంటి పార్టీలకు నిధుల వసూళ్లకు నిర్దిష్ట యంత్రాంగం ఉంది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు సైతం తమ వేతనాలను పార్టీకి ఇచ్చేస్తారు. పార్టీ నిర్దేశించిన భత్యాన్ని తీసుకుంటారు. అందులోనూ వాటి నిర్వహణ వ్యయం తక్కువ. కానీ కాంగ్రెసు పార్టీ పరిస్థితి అదికాదు. పైవ్ స్టార్ పార్టీ. అగ్రనాయకులు, కార్యకర్తలు మొదలు ప్రజలు సైతం కాంగ్రెసు నుంచి భారీ ఆర్థికప్రయోజనాలనే ఆశిస్తుంటారు. వ్యయం విషయంలో పొదుపు పాటించాల్సిన అవసరాన్ని ఆ నాయకులే అంగీకరించరు. మరోవైపు కాంగ్రెసు పార్టీపై బీజేపీ కేంద్ర నాయకత్వం పూర్తిస్థాయి ద్రుష్టి పెట్టింది. నిఘా సంస్థలు పార్టీకి అక్రమ మార్గాల్లో తరలివచ్చే నిధులను అడ్డుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. దీంతో కాంగ్రెసుకు విరాళమిచ్చి కష్టాలు కొనితెచ్చుకోవడమెందుకనే భావనలో పడ్డాయి అనేక కార్పొరేట్ సంస్థలు. ఇన్ కమ్ టాక్సు, ఎన్ ఫోర్సుమెంట్, రెవిన్యూ ఇంటిలిజెన్సు వంటి సంస్థల దాడులుంటాయేమోనని కాంగ్రెసు సానుభూతిపరులైన బడా వ్యక్తులు సైతం కంగారెత్తి పోతున్నారు. దీంతో పార్టీ ఆదాయం కుదించుకుపోయింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్సు సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం బీజేపీ ఆదాయంలో కాంగ్రెసు పార్టీ ఇన్ కమ్ నాలుగోవంతు కూడా లేదని తేటతెల్లమైంది. 2016-17లో బీజేపీకి ఒక వెయ్యి ముప్ఫైనాలుగు కోట్ల రూపాయల ఆదాయం సమకూరితే కాంగ్రెసుకు వచ్చింది కేవలం 225 కోట్ల రూపాయలు మాత్రమే. బీజేపీ వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న వైఖరితో కాంగ్రెసుకు ఇక ముందు కూడా కష్టాలు తప్పకపోవచ్చు.

‘హస్త’ వ్యస్తం...

2004 నుంచి 2014 వరకూ వరసగా పదేళ్లపాటు పార్టీ అధికారంలో ఉంది. దేశ ప్రజాస్వామ్యచరిత్రలో దాదాపు అరవయ్యేళ్లపాటు ఆపార్టీదే అధికారం. అయినా ఎందుకీ దుస్థితి అన్న సంగతి ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. గతంలో సీతారాం కేసరి వంటివారు మూడో కంటికి తెలియకుండా కోశాధికారిగా నిధుల నిర్వహణను చక్కబెట్టేవారు. ఆర్థిక అవసరాలను ఎలా తీర్చాలో చూసుకునేవారు. జనరేషన్ షిప్టుతర్వాత సోనియా హయాంలోనూ పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. అధికారంలో ఉన్నకాలంలో అప్పటికప్పుడు ఎవరో ఒకరు అవసరాలు తీర్చేసేవారు. పెద్దగా ప్లానింగ్ లేకపోయినా నడిచిపోయేది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ వంటివారు తొలిదశలో ఏఐసీసీ ఆర్థిక అవసరాలకు బాగా ఉపయోగపడేవారు. రాష్ట్రానికి సంబంధించి ఈ వ్యవహారాల నిర్వహణ విషయంలో కేవీపీ కీలకంగా ఉంటూ వచ్చేవారు. 2014 తర్వాత కేంద్రంతోపాటు ఒక్కో రాష్ట్రం చేజారిపోయింది. మోడీ, షాల బీజేపీ గతంలో మాదిరిగా ఉదారపార్టీ కాదు. అన్నిరకాలుగానూ ప్రత్యర్థిని నియంత్రిస్తోంది. అందులో ప్రధానభాగం వనరులకు కళ్లెం వేయడం. దీంతో కాంగ్రెసు పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. నోట్ల రద్దు వంటి ప్రక్రియలతో ప్రత్యర్థి పార్టీలకు నిధులు అందకుండా కట్టడి చేయగలిగింది. భయపెట్టగలిగింది. కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెసు పార్టీ నిధుల ప్రవాహం పారించలేకపోయింది. ఎన్నికల వ్యయాలను స్థానికంగా ఉన్న పార్టీ విభాగాలే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ, తెలంగాణలోనూ ఇదే అవస్థ. ఏపీలో ఎలాగూ అధికారం వచ్చే అవకాశంలేదు కాబట్టి ఓ మోస్తరుగా పార్టీ కార్యకలాపాలను లాగించేస్తోంది. తెలంగాణలో అధికారం కోసం పోటీ పడుతోంది. ఆర్థికపరిపుష్టి ఉన్న అధికార టీఆర్ఎస్ తో తలపడాలి. పార్టీ వ్యయాన్ని పీసీపీ పీఠం పై ఉన్న ఉత్తమ్ చూసుకోవాలని ఇప్పటికే అధిష్టానం చెప్పేసినట్లు సమాచారం. అధిష్టానం ఆసరా లేకుండా పార్టీని నడపడమంటే ఆషామాషీ కాదు. అందులోనూ ఈ కష్టకాలంలో. అందుకే ప్రచార కార్యక్రమాలు నత్తనడకనే నడుస్తున్నాయని చెప్పాలి. ఇది కేవలం తెలంగాణకే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీలో నెలకొన్న ఆర్థిక స్థితి. అధికారంలోకి కచ్చితంగా వస్తామని భావిస్తున్న ఒకటి రెండు రాష్ట్రాలు, స్థానికంగా ఏకనాయకత్వం కింద పనిచేసేందుకు సానుకూలంగా ఉన్న చోట్ల మాత్రమే ఒకింత పరిస్థితి మెరుగ్గా ఉంది. మిగిలిన చోట్ల నిధుల కటకటే. కాసులేని వాడు ఊసుకైనా కొరగాడు అన్నట్లుగా మిగిలిన పార్టీలు కాంగ్రెసుతో చేతులు కలిపేందుకు సైతం నిధుల సంకటం ఆటంకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News