ఎవరితో ఎవరు..? బిగ్ కన్ ఫ్యూజన్...?

Update: 2018-08-29 15:30 GMT

పొలిటికల్ హీట్ పతాకస్థాయికి చేరింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనంత ఉత్కంఠ రాజకీయ శ్రేణులను ఆవహిస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా సందడి పుంజుకొంది. ప్రధాని అభయమిచ్చేశారు. ఇక ఎన్నికలకు వెళ్లిపోవడమే తరువాయి అన్నంత ఉద్వేగం నెలకొంది. కేసీఆర్ ముఖ్యమైన నేతలకు సైతం తన అంతరంగాన్ని వెల్లడించలేదు. ప్రధానితో చర్చల సారాంశాన్ని చెప్పలేదు. పార్టీ ప్రగతి నివేదన సభకు సంబంధించిన సన్నాహాల్లో నిమగ్నమైపోయారు. బీజేపీ నాయకుల వద్ద మాత్రం మనసు విప్పాడు. మరోవైపు కాంగ్రెసు పార్టీ ప్రజావేదన పేరిట బదులు చెప్పాలనే ఎత్తుగడలతో ముందుకు కదులుతోంది. రెండు పార్టీలు అధికారం తమదేనని చాటిచెప్పుకునేందుకు ఆయా సభలను ఎన్నికల నగారా గా వినియోగించుకోవాలని చూస్తున్నాయి.

కనుసన్నల్లో కమలం....

నిన్నమొన్నటి వరకూ బీజేపీ రాష్ట్ర నాయకులకు పూచిక పుల్లపాటి విలువ ఇవ్వలేదు కేసీఆర్. ఏదైనా ఢిల్లీ అధిష్టానంతోనే మాట్లాడుకున్నారు. ఇది స్థానిక నాయకులకు చాలా ఇబ్బందికరంగా మారింది. బీజేపీ అగ్రనాయకత్వానికి పలు ఫిర్యాదులు సైతం చేశారు. ఈ పరిస్థితులను గ్రహించిన కేసీఆర్ కు హస్తినలోని కమలనాథులు కొన్ని సూచనలు చేసినట్లుగా సమాచారం. రాష్ట్ర నాయకులను పూర్తిగా విస్మరించి తాము ముందుకు వెళ్లలేమన్నారు. అందుకే ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చిన మరుసటి రోజే బీజేపీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చేశారు. వాజపేయి విగ్రహస్థాపనకు సంబంధించిన అధికారిక అజెండాతో కలిశామని కమలం పార్టీ వారు చెబుతున్నారు. అయితే ఢిల్లీలో ప్రధానిని కలిసిన సంగతి, పరిణామాలు , భవిష్యత్తులో కలిసి పనిచేయాల్సిన అవసరాలపై కేసీఆర్ వారికి వివరించినట్లుగా తెలిసింది. కేసీఆర్ ప్రధానితో ముఖాముఖిగా సమావేశం కావడం వల్ల అక్కడేం జరిగిందో ఎవరికీ తెలియదు. ప్రధాని చెప్పే అవకాశం లేదు. దాంతో కేసీఆర్ చెప్పిన మాటలపై ఆధారపడే వారు ఒక అంచనాకు రావాల్సి ఉంది. మొత్తమ్మీద ఇప్పటివరకూ స్థానిక బీజేపీ నాయకత్వానికి, టీఆర్ఎస్ కు మధ్య ఉన్న అంతరం సమసిపోయేలా పావులు కదిపారు కేసీఆర్.

అంతర్గత అవగాహన...

కాంగ్రెసు,టీడీపీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తెలంగాణలో సహకరించుకునే వాతావరణం నెలకొంది. దీనిని అర్థం చేసుకుని కమలం, కారు పార్టీలు సైతం పరోక్షంగా పరస్పరం సహకరించుకోవాల్సిన ఆవశ్యకతను కేసీఆర్ గుర్తు చేశారనేది బీజేపీ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేలు తనను కలిసిన సందర్బంలో కొన్ని కీలకమైన హామీలను కూడా టీఆర్ఎస్ అధినేత వారికి ప్రసాదించారని ప్రచారం మొదలైంది. బీజేపీకి కీలకమైన నియోజకవర్గాలు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నాయి. టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలలో ఘనవిజయం సాధించింది. అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికలలో అంతటి సక్సెస్ సాధించగలమనే నమ్మకం కరవైంది. అందుకే బీజేపీతో ప్రచ్చన్నంగా చేయి కలిపేందుకు అభ్యంతరం లేదు. రూరల్ లో తమ బలాన్ని కాపాడుకుంటూ హైదరాబాదు వంటి చోట్ల కమలానికి సహకరించినందున వచ్చే ఇబ్బందేమీ లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెసు అధికారంలోకి రాకుండా చూసుకోవడమనే ఉమ్మడి గోల్ కు అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు కేసీఆర్ నుంచే ఓపెన్ ఆపర్ లభించిందని బీజేపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అధిష్టానం అంగీకరించిన తర్వాత తాము ఈ విషయంలో విభేదించేది ఏమీ లేదని కూడా బీజేపీ లీడర్స్ స్పష్టం చేస్తున్నారు.

కాంగ్రెసులోనూ కాక ...

టీఆర్ఎస్ అధినేత ఢిల్లీ పర్యటన కాంగ్రెసులో కాక పుట్టించింది. అత్యవసరంగా రాష్ట్రస్థాయి నాయకులు సమావేశమయ్యారు. ఏఐసీసీ నుంచి ఇన్ ఛార్జి ని రప్పించారు. పార్టీని ఇక ఎన్నికల రణరంగంలోకి ఉరికించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిర్ణయించారు. పనిలో పనిగా తాము 75 సీట్లలో గెలవబోతున్నట్టుగా కాంగ్రెసు నాయకులు స్వయంగా ప్రకటించేసుకున్నారు. ముందస్తు ఎన్నికలు కచ్చితంగా వస్తున్నాయనే విశ్వాసం పార్టీలో ఏర్పడింది. నియోజకవర్గాల వారీ అభ్యర్థుల కసరత్తు ప్రారంభించారు. ప్రజావేదన పేరిట టీఆర్ఎస్ కు కౌంటర్ మీటింగు పెట్టాలని నిశ్చయించారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు సైతం కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. మీరు సిద్దమైపోండి అని సూచించేశారు. దీంతో హడావిడిగా ఆగమేఘాలమీద కోర్ కమిటీ మీటింగు పెట్టుకుని కొన్ని విషయాల్లో అంతర్గత అవగాహనకు వచ్చేశారు. కేసీఆర్ తో కలిసి నడవక తప్పదన్న విషయాన్ని మరోసారి తమలోతాము నిర్దారించుకున్నారు. ఇదంతా అధిష్ఠానంతో సంబంధం లేకుండానే జరిగిపోవడం విశేషం. దటీజ్ కేసీఆర్.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News