డీల్ బాగా కుదిరింది....!!!

Update: 2018-11-29 15:30 GMT

రాహుల్ గాంధీ, చంద్రబాబులు చేపట్టిన తెలంగాణ జంట యాత్ర రాజకీయాల్లో ఒక కీలకపరిణామం. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ప్రత్యర్థులుగా తలపడిన పార్టీలు తమ వైఖరులను మార్చుకుని ప్రజల్లోకి రావడం రాజకీయ మార్పులకు సంకేతం. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా పార్టీలు తమ విధానాలను సవరించుకుంటూ ఉంటాయి. సాధ్యమైనంత వరకూ సైద్ధాంతిక సమైక్యత కలిగినవారితో కలుస్తుంటాయి. వామపక్షాలు ఎంతగా విభేదించుకున్నప్పటికీ తమది ఒకటే పంథా అని ప్రకటించడంలో అర్థమదే. అయితే సంప్రదాయ పార్టీలకు మాత్రం సైద్దాంతికమైన శషభిషలు ఏమీ ఉండవు. అందులోనూ ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రప్రయోజనాలనే ప్రత్యేక అజెండా ఉంటుంది. దాని సాకుతో ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. దీనిని ఆధారంగా చేసుకుంటూనే టీడీపీ గడచిన ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీలతోనూ కలిసి పనిచేసింది. కాంగ్రెసును మాత్రమే దూరంగా పెట్టింది.. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది. ఈ రెండు పార్టీలు కలిసి వేసే తొలి అడుగులు తెలంగాణ గడ్డపై నుంచి మొదలు కావడం విశేషం.

కెమిస్ట్రీ కుదిరింది...

సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ సంబంధాల ఆవిష్కరణను పండించాలంటే కెమిస్ట్రీ కుదరాలి. బాడీ లాంగ్వేజ్ నుంచి పలకరింపుల వరకూ ఒక పాజిటివ్ వేవ్ కనిపించాలి. నాయకులు తమ మధ్య సాన్నిహిత్యాన్ని సహజంగా ప్రజలముందు ఆవిష్కరించుకోగలగాలి. అప్పడే ఆ పొత్తు పండుతుంది. టీడీపీ, రాహుల్ ప్రజల ముందుకు వచ్చినప్పుడు వీరిరువురి మధ్య సాన్నిహిత్యం బాగానే కనిపించింది. చంద్రబాబు నాయుడి సీనియారిటీకి రాహుల్ తగిన గౌరవం ఇస్తున్నట్లుగా కనిపించారు. అదే సమయంలో జాతీయ పార్టీ అధ్యక్షునిగా రాహుల్ మర్యాద మన్ననలకు ఏమాత్రం లోటు రాకుండా సంబోధన మొదలు సంభాషణ వరకూ జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. గంటల కొద్దీ కలిసి ఉన్న సందర్భాల్లోనూ ఒకరి ప్రసంగాలను మరొకరు ఆసక్తిగా ఆలకించడం వంటివన్నీ మంచి సంకేతాలనే పంపించాయి. గతంలో ఢిల్లీ వెళ్లి రాహుల్ ను కలిసి జాతీయంగా కూటమి కడుతున్నామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు అప్పట్లో ప్రజాస్వామ్య అవసరాల రీత్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అప్పుడు వీరిద్దరూ కలిసి కొన్ని నిముషాలపాటు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. చాలా ముక్తసరిగా మాట్లాడారు. దాంతో వారి మధ్య కుదిరిన అవగాహనకు సంబంధించిన పూర్తిస్థాయి అసెస్ మెంట్ మీడియా సహా ప్రజలకు సాధ్యం కాలేదు.

క్యాడర్ కు క్లారిటీ...

తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చేశారు, రెండు పార్టీల అగ్రనాయకులు . తమ నేతలు కలిసి నడవాల్సిందేనని ఎటువంటి అనుమానాలకు, సందేహాలకు తావు లేకుండా తేల్చి చెప్పేశారు. అంతేకాదు, రాష్ట్రస్థాయిలోనే కాకుండా తాము జాతీయ స్థాయిలో కలిసి పనిచేయనున్నామని ప్రకటించారు. ఈ పొత్తు ఇక్కడికే పరిమితం కాదని డిక్లేర్ చేయడం ద్వారా , ఇష్టమైనా, కష్టమైనా రెండు పార్టీల నేతలూ చేయి చేయి కలపాల్సిందేనని తేలిపోయింది. తెలంగాణలో మొదలైన పొత్తు ఆంధ్రప్రదేశ్ కూ విస్తరించబోతోంది. తెలంగాణలో టీడీపీ జూనియర్ పార్టనర్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు జూనియర్ పార్టనర్ గా సెటిల్ కావాల్సి ఉంటుంది. ఈ రెండు పార్టీలకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రధాన ప్రత్యర్థులుగా టీఆర్ఎస్, వైసీపీలు రూపు దాల్చాయి. దాంతో ముఖాముఖి తలపడాల్సిన పరిస్థితులు పోయాయి. తమ పార్టీలకు ఉన్న బలహీనతలను అధిగమించడానికి పొత్తు కుదుర్చుకోవడమే మేలనే అవగాహనకు వచ్చాయి. ప్రధానంగా కాంగ్రెసు పార్టీవి జాతీయ అవసరాలు. టీడీపీవి రాష్ట్ర అవసరాలు. రెండు చోట్లా అధికారంలో భాగస్వామి కావాలనే తపన. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు తొలిసారిగా కలిసి పనిచేయాల్సిన రాజకీయ అనివార్యత ఉత్పన్నమైంది.

బలాలపై కేంద్రీకరణ...

కాంగ్రెసు, తెలుగుదేశం అగ్రనేతలు కలిసి నిర్వహించిన సభలను లక్ష్య కేంద్రంగానే నిర్వహించారని చెప్పాలి. ఖమ్మంలో కాంగ్రెసు, టీడీపీలు కలిస్తే ప్రబలమైన శక్తులుగా నిలుస్తాయి. టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో సైతం ఇక్కడ ఆధిక్యం సాధించలేకపోయింది. ఆతర్వాత పట్టు సాధించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కొంతమేరకు బలపడింది. అయితే తాజాగా టీడీపీ, కాంగ్రెసు, సీపీఐ కలవడంతో తిరిగి కూటమి ఆధిక్యం సాధిస్తుందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. టీఆర్ఎస్ ప్రయోగించే సెంటిమెంటుకు వ్యతిరేకంగా పాప్యులర్ ఓటును సంఘటితం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఖమ్మం జిల్లాలో సభలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోనూ కాంగ్రెసు, టీడీపీ కలిస్తే ఘనవిజయం సాధిస్తామనే నమ్మకం ఆయా పార్టీల్లో నెలకొంది. 2014లో బీజేపీ, టీడీపీ కాంబినేషన్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు అదే ఫీట్ ను రిపీట్ చేయాలనే ఉద్దేశంతో కూటమి సభలతో రాహుల్, చంద్రబాబులు హోరెత్తించారు. క్యాడర్, లీడర్లలో ఆయా సభలు జోష్ నింపాయనే చెప్పాలి. దీనికి విరుగుడుగా ఎన్నికల ప్రచార చివరి ఘట్టంలో టీఆర్ఎస్ హైదరాబాదులో భారీ బహిరంగసభతో బదులివ్వాలని యోచిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News