ష్ ...గప్ చుప్...రచ్చవుతుందనేనా...?

Update: 2018-10-31 15:30 GMT

జాబితా తయారైంది. బయటమాత్రం పెట్టరు. బహిరంగ పరిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన. సొంతింటిపోరు రోడ్డెక్కిపోతుందేమోనని భయం. జట్టు కడదామనుకుంటున్న పార్టీలు రచ్చ చేస్తాయోమోనని సందేహం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఇది. మూడు క్యాటగిరీలుగా కాంగ్రెసు పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్నవారిని విభజించారు. పార్టీలో పాతుకుపోయిన సీనియర్లు, పార్టీకి సేవలందిస్తూ ఆర్థికంగా సంపన్నులైనవారు, సామాజిక కుల బలం కలిగి నాయకత్వ సామర్థ్యంలో రాటు తేలిన వారు.. ఇలా టిక్కెట్ల కేటాయింపునకు కొన్ని ప్రమాణాలు పెట్టుకుని ఒక ప్రాతిపదికను సిద్ధం చేసుకున్నారు. దీనికనుగుణంగా ఒక జాబితాను రెడీ చేశారు. చిట్టాలో పేర్లు 80 వరకూ ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కూటమి యత్నాలు ఒక కొలిక్కి వచ్చి , అధికారికంగా పొత్తు కడుతున్నామని ప్రకటించిన తర్వాతనే జాబితాను బయటపెట్టాలనుకుంటున్నారు. అధిష్టానం ఆమోదించిన చిట్టాలో మార్పులు చేర్పులకు అవకాశాలు తక్కువ. అందువల్ల ఇప్పటికే సిద్దమైన టీపీసీసీ జాబితాపై ప్రస్తుతానికి విశ్వసనీయంగా వ్యవహరిస్తున్న టీడీపీతో కూడా చర్చించాలని కాంగ్రెసులోని పెద్దలు భావిస్తున్నారు.

ముందరికాళ్లకు బంధం...

తెలంగాణ రాష్ట్రసమితి ఒకే దఫాలో 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి సంచలనం సృష్టించింది. గెలుపుపై తాము ఆత్మవిశ్వాసంతో ఉన్నామన్న భావనను కలిగించింది. నలభై రెండు నియోజకవర్గాల్లో తీవ్రస్థాయి అసమ్మతి చెలరేగింది. ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆందోళనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కేసీఆర్ దిగిరాలేదు. ఏ నియోజకవర్గంలో అయినా అభ్యర్థిని మారిస్తే మిగిలిన చోట్ల ఒత్తిడి పెరుగుతుందని అధినాయకత్వానికి తెలుసు. అందుకే అసమ్మతివాదులను సామ,దాన,భేద, దండోపాయాలతో అణచివేసేందుకు ప్రయత్నించారు. కొందరికి భవిష్యత్తులో పదవులను హామీగా చూపించారు. మరికొందరికి రాజకీయభవిష్యత్తు లేకుండా చేస్తామని బెదిరించారు. మొత్తమ్మీద అసమ్మతిని చాలావరకూ నియంత్రించగలిగారు. పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాలేదు. మహాకూటమి జాబితా బయటకి వచ్చిన తర్వాత అక్కడ తీవ్రమైన అసంతృప్తులు బయలు దేరతాయనేది టీఆర్ఎస్ విశ్వాసం. దానిముందు తమ పార్టీ అసమ్మతి తేలిపోతుందని భావిస్తున్నారు. తమపార్టీలో అసమ్మతిని అధికార పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటుందని కాంగ్రెసు గ్రహించింది. అందువల్లనే ముందుగా అభ్యర్థుల జాబితా బయటికి రాకుండా జాగ్రత్త పడుతోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ టిక్కెట్లు ఆశిస్తూ భంగపాటుకు గురయ్యేవారిని ముందుగానే బుజ్జగించే యత్నాలు ప్రారంభించింది. ఇది అధికారపార్టీకి కొంత నిరాశ కలిగిస్తోంది.

సైకిల్ తో హుషారు...

కూటమి ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ ఇంతగా సహకరిస్తుందని కాంగ్రెసు ఊహించలేదు. గతంలో అధికారపార్టీగా కొనసాగిన తెలుగుదేశానికి వెనకబడిన తరగతుల్లో కొంత పలుకుబడి ఉంది. సీమాంధ్ర ఓటర్ల మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. తెలంగాణ జనసమితి, సీపీఐ వంటి పార్టీలు సీట్ల విషయంలో పంతానికి, పట్టుదలకు పోతున్నప్పటికీ టీడీపీ మాత్రం నేలవిడిచి సాము చేయడం లేదు. గతంలో తాము సాధించిన సీట్ల సంఖ్యకు సమానంగా కేటాయిస్తే చాలనే సర్దుబాటు ధోరణి కనబరుస్తోంది. ఇది కాంగ్రెసుకు ప్లస్ పాయింటుగా మారింది. ఎక్కువ సంఖ్యలో టీడీపీకి సీట్లు కేటాయిస్తే పార్టీలో తిరుగుబాట్లు వస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తమకు బలమున్న స్థానాలను మాత్రమే కోరనున్నట్లు స్పష్టం చేసింది. మరొక బంపర్ ఆఫర్ ను సైతం కాంగ్రెసు ముందుంచింది. సీట్ల విషయంలో కన్ఫ్యూజన్ కు గురికాకుండా శాస్త్రీయంగా సర్వే నిర్వహించి కాంగ్రెసు కంటే టీడీపీకి ఆదరణ ఎక్కువగా ఉన్న సీట్లకు తమను ఎంపిక చేయవచ్చని సూచించింది. ఇందుకుగాను జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న తటస్థ సంస్థకు బాధ్యతలు అప్పగించాలని సూచించింది. టీడీపీకి కేటాయించే సీట్ల సంఖ్య ఖరారు అయిన తర్వాత ఈ రాండమ్ శాంపిల్ సర్వేకు శ్రీకారం చుడతారు. టీడీపీ సూచించిన 30 నియోజకవర్గాలలో బలం అంచనా వేసి అందులో 12 నుంచి 15 స్థానాలు టీడీపీకి కేటాయిస్తారు. ఈ ప్రతిపాదన ఉభయతారకంగా ఉంటుందని కాంగ్రెసు చెబుతోంది.

సవాళ్లకు సై....

ఆర్థికంగా, అంగబలం రీత్యా టీఆర్ఎస్ కంటే కాంగ్రెసు వెనకబడి ఉంది. కానీ గడచిన నెలరోజులుగా క్షేత్రస్థాయిలో బాగా పుంజుకున్నట్లు సర్వేలు చాటిచెబుతున్నాయి.ఇది నైతికంగా బలం చేకూరుస్తోంది. అయినప్పటికీ మెజార్టీ స్థానాల్లో గెలిచే స్థాయిలో మద్దతు లభించడం లేదు. టీఆర్ఎస్ అంతర్గత సర్వేల్లో ఆపార్టీకి 72 స్థానాలు లభిస్తాయని తాజా సమాచారం. కాంగ్రెసు నిర్వహించుకున్న సర్వేల్లో పార్టీకి లభించే సీట్ల సంఖ్య నలభై వద్దనే ఆగిపోతోంది. టీడీపీ,టీజేఎస్, సీపీఐ వంటి పార్టీలన్నీ కలిసి ఓటు బ్యాంకు సంఘటితమైతే టీఆర్ఎస్ కు గట్టిపోటీ ని్వ్వవచ్చు. పొత్తులతో తమ బలాన్ని మరో పాతిక సీట్లు పెంచుకోవాలనేది కాంగ్రెసు వ్యూహం. అయితే టీడీపీ,టీజేఎస్,సీపీఐలకు కేటాయించిన స్థానాల్లో రెబల్స్ రంగంలోకి దిగితే ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో టీడీపీ నుంచి కూడా రెబల్స్ బెడద ఎదురుకావచ్చనే సూచనలు వెలువడుతున్నాయి. వీటన్నిటినీ దీటుగా తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెసుపైనే ఉంటుంది. ఈ మొత్తం క్రమంలో కాంగ్రెసులోనూ అసంత్రుప్తులు కట్టుతప్పి వెన్నుపోట్లకూ అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ ఎదుర్కోవడమే కాంగ్రెసుకు సిసలైన సవాల్.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News