పరిష్కారం ఏది...? పట్టు కోసం...?

Update: 2018-09-17 15:30 GMT

మహాకూటమి దిశలో ఒక్కో అడుగు పడుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన ఘట్టంగా పరిణామాలు రూపుదిద్దుకుంటున్నాయి. అధికారపార్టీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న పార్టీల యత్నాలు ఫలిస్తే ఐక్య సంఘటన ప్రత్యామ్నాయవేదికగా ప్రజల ముందుకు వెళుతుంది. టీఆర్ఎస్ కు , ఈ కూటమికి మధ్య పోటీ ముఖాముఖిగా మారుతుంది. మిగిలిన పార్టీలు రంగంలో ఉన్నప్పటికీ ఆటలో అరటి పండు తరహాలోనే ఉంటాయి. అయితే ఎంత బలంగా, సమైక్యంగా ఈ కూటమి ఒక్కతాటిపైకి రానుందనే అంశంపై ఆధారపడే ఫలితాలు ఉంటాయి. ఇప్పటివరకూ సాగుతున్న చర్చలు, మంతనాలు, ఆయాపార్టీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొత్తు కట్టడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే సీట్ల సంఖ్య ఖరారు, స్థానాల ఎంపిక వంటివి ఆయా పార్టీల మధ్య కొంత చర్చకు దారితీసే అవకాశం ఉంది. దానిని పరిష్కరించేందుకు అధిష్ఠానం దూతలను పంపాలని కాంగ్రెసు కోరుతోంది. చంద్రబాబు నాయుడే పరిష్కరించాలని టీటీడీపీ నేతలు కోరుతున్నారు.

పీటముడి ..పితలాటకం...

కాంగ్రెసు, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ కలగలిసి ఒక జట్టుగా రంగంలో దిగాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఈవిషయంలో ఎటువంటి విభేదాలు లేవని ఆయాపార్టీల నాయకత్వం ప్రకటించేసింది. అయితే ఎన్నిసీట్లు ఏ పార్టీ తీసుకోవాలి? ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయాల్లో ఇప్పటికే విభేదాలు తొంగి చూస్తున్నాయి. టీడీపీ భారీగా 40 సీట్లు అంటూ బేరం మొదలు పెట్టింది. 30 కి సర్దుకుంటామంటూ చెబుతోంది. అయితే 25 ఇస్తే ఇక మేము మారు మాట్లాడం అంటూ పీసీసీకి సంకేతాలు పంపుతున్నారు టీడీపీ నాయకులు. కానీ పార్టీ అంతర్గత చర్చల్లో 20 సీట్లు లభిస్తే కాంగ్రెసుతో కలిసి నడిచివెళ్లవచ్చని అంగీకరిస్తున్నారు. ఇందులో హైదరాబాదు చుట్టుపక్కల పదిసీట్లు ఇవ్వాలని డిమాండు పెడుతున్నారు. మిగిలిన పదిసీట్లు ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్లు, ఆదిలాబాదు,నిజామాబాదుల్లో అడుగుతున్నారు.

హస్తం పార్టీ లెక్కలు.......?

కాంగ్రెసు లెక్కలు వేరుగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఆరుస్థానాల వరకూ టీడీపీకి కేటాయించేందుకు కాంగ్రెసు సిద్ధమవుతోంది. మరో ఆరుస్థానాలను జిల్లాకు ఒకటి చొప్పున పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో కేటాయించాలని చూస్తున్నారు. మొత్తమ్మీద సైకిల్ పార్టీకి 12 సీట్లతో సరిపుచ్చాలనేది యోచన. ఖమ్మం, నల్లొండ జిల్లాల్లో కలిసి ఆరుస్థానాలు ఇవ్వాలని సీపీఐ డిమాండు పెడుతోంది. రెండు నుంచి మూడు సీట్లు మాత్రమే ఇవ్వవచ్చనేది హస్తం పార్టీ అంచనా. నాలుగు స్థానాలైనా ఇస్తే పొత్తు ఖాయం అంటోంది సీపీఐ. తెలంగాణ జనసమితికి సీట్ల కేటాయింపు సమస్యాత్మకంగా మారబోతోంది. పూర్వ రాజకీయ కార్యాచరణ సమితి నేత కోదండరామ్ నాయకత్వం వహిస్తూ ఉండటంతో తెలంగాణ జనసమితి అత్యధిక సీట్లను డిమాండ్ చేస్తోంది. గ్రౌండ్ లెవెల్ లో పెద్దగా బలం లేకపోయినా తమకు జిల్లాకు ఒకటి చొప్పున పునర్విభజన జిల్లాల్లో 31 సీట్లను అడుగుతోంది. అయితే అయిదుకు మించి ఈపార్టీకి సీట్లు ఇస్తే కొంపమునగడం ఖాయమని కాంగ్రెసు చెబుతోంది. మధ్యేమార్గంగా ఏడు సీట్లవరకూ వెళ్లవచ్చని కొందరు పీసీసీ పెద్దలు అంగీకరిస్తున్నారు. మొత్తం తమ భాగస్వామ్య పార్టీల కోటా 20కి పరిమితం చేయగలిగితే 99 సీట్లు తమకు మిగులుతాయంటున్నారు. అందులో ఎంఐఎం పోటీ చేసే పాతబస్తీలోని ఏడు స్థానాలు ఎలాగూ తమకు దక్కవు. అందువల్ల నికరంగా 92 సీట్లలో మాత్రమే నిజమైన పోటీ చేసినట్లవుతుందని కాంగ్రెసు నాయకులు పేర్కొంటున్నారు.

సానుభూతి...సహకరిస్తుందా?

చంద్రబాబు నాయుడు సైతం ఈ కూటమికి ఒక ఐకాన్ కాబోతున్నారు. ఆయన నేరుగా రంగంలోకి దిగకపోయినప్పటికీ ఉత్తరతెలంగాణ నీటి కోసం చేసిన బాబ్లీ పోరాటం ఇప్పటికే చర్చనీయమవుతోంది. మహారాష్ట్ర ధర్మాబాద్ వారెంట్ టీడీపీకి కొత్త బలాన్నిస్తోంది. దాని ప్రభావం కాంగ్రెసుకు కూడా కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ చాలా బలంగా ఉంది. రాష్ట్రసాధన ఉద్యమప్రభావ ఫలితంగా పట్టు సాధించింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెసు, టీడీపీలు కలిస్తే విజయం సాధించేఅవకాశాలు సహజంగానే అధికం. ఉత్తర తెలంగాణలో మాత్రం అంత సులభం కాదు. కానీ బాబ్లీ కారణంగా టీడీపీకి కొంత ఇమేజ్ ఏర్పడుతోంది. దానిని కాంగ్రెసు అందిపుచ్చుకుంటే ఈ కూటమి గట్టి మద్దతు కూడగట్టగలుగుతుంది. ఈ సానుభూతి పవనాలకు అడ్డుకట్ట వేయకపోతే ఇబ్బందులు తప్పవని అధికార టీఆర్ఎస్ కూడా గ్రహించింది. మహాకూటమి రూపంలో స్వాహా కూటమి తెలంగాణ ప్రజల ముందుకొస్తోందంటూ టీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. బీజేపీ సైతం ఎదురుకాగల ముప్పును పసిగట్టి కోర్టు నోటీసులతో తమకు సంబంధం లేదంటూ దూరం జరిగే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసలు కాంగ్రెసు హయాంలోనే కేసులు పెట్టారంటూ చెబుతోంది. నిజానికి చంద్రబాబుపై నమోదైన కేసు అంత తీవ్రమైనది కాదు, అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవచ్చు. అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు నోటీసులు వచ్చాయి. ఈ అంశాన్ని తెలివిగా పక్కనపెట్టి కమలం పార్టీ కాంగ్రెసుపై రుద్దేయాలని చూస్తోంది. దీనిని వ్యూహాత్మకంగా ఎదుర్కొంటూ ఈ మహాకూటమికి బలమైన ప్రజామద్దతు కూడగట్టే దిశలో కార్యాచరణపై కసరత్తు ప్రారంభించారు టీడీపీ నాయకులు. సీట్ల సంఖ్య ఖాయమైతే ఇక తాము రంగంలోకి దిగడమే తరువాయి అని చెబుతున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News